‘కైలాసం’ కమలనాథులదేనా?
Published Fri, Nov 22 2013 12:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్‌లో పోటీపడుతున్న నేతల్లో ఎవరూ సొంత చరిష్మాతో గట్టేక్కే అవకాశం కనిపించడంలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేతలందరూ ఇతరుల చరిష్మాతోనే గెలుపొందే అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అజయ్‌కుమార్ మల్హోత్రా, కాంగ్రెస్ నుంచి వీరేందర్ కసానా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సౌరభ్ భరద్వాజ్‌లు పోటీ పడుతున్నారు.
టికెట్ కోసం బీజేపీలో ఆసక్తికర పోరు..
గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం టికెట్ కోసం బీజేపీ నేతలు పోటీపడిన తీరు ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికను ఆసక్తికరంగా మార్చాయి. పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్‌కుమార్ మల్హోత్రా ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా పేరొందిన ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆయన తన కుమారుడు అజయ్ మల్హోత్రాకు ఇప్పించుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు. దీంతో ఈ నియోజకవర్గం టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన మరో నేత విజయ్ జోలీకి నిరాశే ఎదురైంది. కాగా రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దుతున్నా తండ్రి చరిష్మా అజయ్‌ను గెలిపిస్తుందని చెప్పుకుంటున్నారు.
ఇదిలాఉండగా ఈ నియోజకవర్గం సీటుకోసం కాంగ్రెస్, ఆప్‌లలో పెద్దగా పోటీ నెలకొనలేదు. కాంగ్రెస్ నుంచి చిత్తరంజన్ పార్క్ కౌన్సిలర్ వీరేందర్ కసానా పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో గెలుపు అసాధ్యమని భావించిన కాంగ్రెస్ నామమాత్రంగా పోటీ చేసేందుకే కసానాకు టికెట్ ఇచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం బీజేపీతో గట్టిగా తలపడాలనే అభిప్రాయంతోనే ఇంజనీరింగ్‌తో పాటు న్యాయశాస్త్రంలోనూ పట్టాపుచ్చుకున్న సౌరభ్ భరద్వాజ్ ఎన్నికల బరిలోకి దించిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురిలో అజయ్‌కుమార్ మల్హోత్రాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
భిన్నమైన పరిస్థితులు..
గ్రేటర్ కైలాష్‌ను ప్రధానంగా సంపన్నులు నివసించే నియోజకవర్గంగా పేర్కొనవచ్చు. అయితే గ్రేటర్ కైలాష్, చిత్తరంజన్ పార్క్, పంచ్‌శీల్ వంటి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేసిన సంపన్న కాలనీల సరసన కాల్కాజీ, సంత్‌నగర్ , షేఖ్ సరాయ్, డీడీఏ ఫ్లాట్లు, చిరాగ్ దిల్లీ షాపుర్ జాట్, జమ్రుద్‌పూర్ , సావిత్రీనగర్ వంటి పట్టణ గ్రామాలు, జేజే క్లస్టర్లు కూడా ఉన్నాయి. పార్కింగ్, ట్రాఫిక్ , సీవేజ్ తదితరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. బీఆర్‌టీ కారిడార్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఇక్కడి వారు అంటున్నారు. పంజాబీ ఓటర్లు 20 శాతం కాగా, వైశ్యులు 18 శాతం, షెకులు 10 శాతం ఉన్నారు.
Advertisement