అనన్య జోడి ఆధిపత్యం
సెయిలింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ గ్రీన్కో యూత్ ఓపెన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో అనన్య చౌహాన్–అనన్య సివాచ్ జోడి ఆధిపత్యం కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తొలి రోజు 420 క్లాస్ ఈవెంట్లో జరిగిన రెండు రేసుల్లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఈ జంట రెండోరోజు సోమవారం జరిగిన తర్వాతి మూడు రేసుల్లోనూ విజేతగా నిలిచి అబ్బుర పరిచింది. మొత్తం ఈ విభాగంలో ఐదు రేసులు జరుగగా, అన్నింట్లోనూ అనన్య ద్వయమే విజేతగా నిలిచింది. సంజయ్ రెడ్డి–అజయ్ యాదవ్ జంట సోమవారం జరిగిన మూడు రేసుల్లోనూ రన్నరప్‌గా నిలిచి ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. లేజర్ 4.7 విభాగంలో రామ్ మిలన్ యాదవ్ జోరు కొనసాగింది.
సోమవారం జరిగిన మూడు రేసుల్లోనూ అతనే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మూడో రేసులో మహేశ్ బాలచందర్, గోవింద్ బైరాగి, నాలుగో రేసులో సతీశ్ యాదవ్, మహేశ్ బాలచందర్, ఐదో రేసులో అనికేత్ రాజారామ్, కృష్ణ మోంగియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆప్టిమిస్ట్ క్లాస్ ఈవెంట్ మూడో రేసులో శ్రద్ధా వర్మ, ఆశిష్ విశ్వకర్మ, దావూద్ ఖురేషి... నాలుగో రేసులో ఆశిష్ విశ్వకర్మ, హృతిక్ అమర్, రాజ్ విశ్వకర్మ... ఐదో రేసులో శ్రద్ధా వర్మ, దావూద్ ఖురేషి, ఆశిష్ విశ్వకర్మ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ విభాగంలో ఐదు రేసులు ముగిసేసరికి ఆశిష్ విశ్వకర్మ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.