‘పచ్చని’ చదువుకు పాతర
సాక్షి, కర్నూలు: పథకం ఉద్దేశం మంచిదే అయినా.. అమలులో చిత్తుశుద్ధి లోపిస్తోంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించే పథకం ఏదీ అనుకున్న స్థాయిలో ముందుకు సాగని పరిస్థితి. ప్రారంభంలో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత నిధుల విడుదలలో కోత విధిస్తుండటంతో మొదటికే మోసం వస్తోంది. ఈ కోవకు చెందినదే గ్రీన్కోర్. విద్య బతకడం నేర్పాలి. తనచుట్టూ ఉన్న వారిని బతికించేందుకు తోడ్పడాలి. సామాజిక రుగ్మతలపై ఎడతెగని పోరాటం చేసే.. సమజ క్షేమాన్ని కాంక్షించే గుణం అలవర్చాలి. అప్పుడే ఆ జ్ఞానానికి సార్థకత. ఇలాంటి సుగుణాలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో గ్రీన్కోర్ పథకానికి ప్రభుత్వం పదేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచే పచ్చదనం.. పర్యావరణ పరిరక్షణ.. పరిశుభ్రత ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజెప్పి చక్కటి సమాజాన్ని నిర్మించాలనే పథకం ఉద్దేశం ఇటీవల కాలంలో నీరుగారుతోంది. జిల్లాలోని 54 మండలాల్లో 501 ఉన్నత పాఠశాలలు ఉండగా.. నిధుల లేమితో పథకం కొడిగట్టింది. పథకంలో భాగంగా 8 నుంచి 10వ తరగతి వరకు ఎంపిక చేసిన విద్యార్థులతో
నీరు, శుభ్రత, విద్యుత్, మొక్కలు, స్థల సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సమన్వయకర్తగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లేదా సైన్స్ ఉపాధ్యాయుడు, అధ్యక్షుడిగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు. నిర్వహణకు రూ.2,500 చొప్పున ఆయా పాఠశాలల ఖాతాలో నిధులు జమచేస్తారు. ఈ మొత్తంలో రూ.500 సంఘం నిర్వహణకు, సేంద్రియ ఎరువుల తయారీకి రూ.1000, మిగిలిన సొమ్ము సంఘంలోని విద్యార్థుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 250 ఉన్నత పాఠశాలల్లో పథకం అమలుకు అనుమతులు మంజూరయ్యాయి. మొదట్లో అన్ని పాఠశాలలకు నిధులు మంజూరైనా.. నిధుల దుర్వినియోగం సాకుతో ఏడాదికి 50 పాఠశాలలకే నిధులను పరిమితం చేశారు. 2008-09 నుంచి ఆసక్తి గల పాఠశాలలు ప్రతిపాదనలు పంపితేనే నిధులు మంజూరు చేయడం జరుగుతోంది. ఈవిధంగా 2010-11 సంవత్సరానికి 50 ఉన్నత పాఠశాలలకు రూ. 1.25 లక్షలు మంజూరయ్యాయి. వీటన్నింటినీ ఆయా పాఠశాలలు ఖర్చు చేశాయి. అయితే ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు లేకపోవడం గమనార్హం. ఇక 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఇప్పటి వరకు నిధులే మంజూరు చేయకపోవడం పథకం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇందుకు సంబంధించిన నిధులను హైదరాబాద్లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు నిర్వహణకు మళ్లించినట్లు సమాచారం.
గ్రీన్కోర్ సంఘాలు.. పనితీరు
మొక్కల సంఘం: మొక్కలు నాటించి వృథా నీటిని మళ్లించడం. వర్షం నీటిని నిలువ చేసి భూగర్భ జలాలను, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం.
శుభ్రత సంఘం: చెట్ల పైనుంచి రాలిన ఆకులతో వర్మీ కంపోస్టును తయారు చేయడం. పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వడం.
నీటి సంఘం: నీటి వృథాను అరికట్టి పొదుపు చేయడం. అవసరాలకు వాడిని నీటిని మొక్కల పెంపకానికి మళ్లించడం. మంచినీటి ట్యాంకుల శుభ్రం, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించడం.
విద్యుత్ సంఘం: వీలైనంత వరకు గాలి, వెలుతురును వాడుకొంటూ విద్యుత్ చార్జీలను తగ్గించడం. వనరుల సమర్థ సద్వినియోగాన్ని విద్యార్థులకు అలవర్చడం.
స్థల సంఘం: విద్యార్థుల సైకిళ్లను ఒకేచోట నిలిపేలా చూడటం. మొక్కల పెంపకంతో పాటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం. వృథా స్థలాన్ని క్రీడలకు వినియోగించడం.