గ్రీన్హౌస్ రైతులకు బ్యాంకు రుణాలు
విలువైన ఆస్తుల పూచికత్తుతో ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ రైతులకు రుణాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అంగీకరించింది. ఉద్యానశాఖ పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే సాధారణ పంట రుణాలకు ఇచ్చినట్లుగా కాకుండా ప్రభుత్వ గ్రీన్హౌస్ పథకం కింద రుణాలు తీసుకోవాలంటే విలువైన ఆస్తులను పూచీకత్తుగా చూపితేనే ఇస్తామని షరతు విధించింది. అది కూడా పట్టణాల్లో ఉండే విలువైన ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లను పూచీకత్తు చూపాలని బ్యాంక్లు తేల్చిచెప్పాయి.
సాధారణంగా గ్రీన్హౌస్ కోసం ఎకరాకు రూ.38 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో ప్రభుత్వ సబ్సిడీ 75 శాతం పోను మిగిలిన రూ. 9.5 లక్షలు రైతులే సమకూర్చుకోవాలి. ఇది చిన్నసన్నకారు రైతులకు మోయలేని భారమే. దీంతో గ్రీన్హౌస్ సబ్సిడీ పథకం కోసం ధనిక రైతులే ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ విన్నపం మేరకు వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించాయి. అయితే పట్టణాల్లో ఇళ్లు, ఇళ్లస్థలాలు ఉండే వారెందరనేది ప్రశ్నార్థకం.
ఎస్సీ, ఎస్టీ రైతులకు మరికొంత సబ్సిడీ...
గ్రీన్హౌస్ నిర్మాణం ఖరీదైన వ్యవహారం కావడంతో ఎస్సీ, ఎస్టీ రైతులు అనేకమంది ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో గ్రీన్హౌస్ నిర్మాణం జరిపేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు ఉద్యానశాఖకు విన్నవించాయి. తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణాలు చేపట్టే కంపెనీలుంటే వాటి గురించి ఆరా తీయాలని కోరాయి. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన సొమ్ముకు తమ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ భరించేందుకు సన్నద్ధత వ్యక్తంచేశాయి.
ఆదాయ పన్నుదారులూ అర్హులే...
గ్రీన్హౌస్ ఖరీదైన వ్యవహారం కావడంతో లబ్ధిదారులు ఆదాయపు పన్ను పరిధిలోకే వస్తారు. కానీ తొలుత ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లించే వారికి గ్రీన్హౌస్ సబ్సిడీకి అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో మార్పులు చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ఆదాయపు పన్ను చెల్లించే వారూ ఈ పథకం కింద సబ్సిడీ పొందవచ్చని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు.