రోడ్డెక్కిన గ్రీన్‌హౌస్ రైతులు
ఉద్యాన శాఖ శిక్షణ కార్యాలయం ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం గ్రీన్‌హౌస్ సబ్సిడీ బకాయిలు చెల్లించకపోవడంతో వివిధ జిల్లాలకు చెందిన రైతులు బుధవారం ఉద్యాన శాఖ శిక్షణ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి.. కొద్ది సేపటి తర్వాత విడుదల చేశారు. సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో చేసిన అప్పులకు రూ.లక్షల వాయిదాలు చెల్లిస్తున్నామని వారు వాపోయారు. ప్రభుత్వం సహకరించకపోవడంతో అనేకచోట్ల గ్రీన్‌హౌస్ నిర్మాణాలు నిలిచిపోయామని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం వారు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డితో చర్చించారు.
గ్రీన్ హౌస్ రైతుల పరిస్థితి అధ్వానం: గ్రీన్çహౌస్ రైతుల పరిస్థితి ఘోరంగా మారింది. నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేటకు చెందిన రైతు ఎం.రాజారెడ్డి రెండెకరాల్లో గ్రీన్‌హౌస్ చేపట్టాడు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము సకాలంలో వస్తుందని భావించి బ్యాంకుల్లో అప్పు చేసి ఖర్చు చేశాడు. సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేశాడు.ఇప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము రూ.15 లక్షలు రాక లబోదిబోమంటున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జగన్నాథరెడ్డి పరిస్థితి మరీ ఘోరం. అతడు బ్యాంకు నుంచి రూ.60 లక్షలు అప్పు తెచ్చి 4 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ చేపట్టాడు. కానీ ఒక్క పైసా కూడా రాకపోవడంతో గ్రీన్‌హౌస్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. బ్యాంకుకు నెలకు రూ.లక్ష పైనే వాయిదా చెల్లిస్తున్నాడు. రెండు నెలలుగా చెల్లించలేక పోవడంతో బ్యాంకు నోటీసుల పంపింది.