Grey Hounds
-
గ్రేహౌండ్స్ పటిష్ఠతకు రూ. 4 కోట్లు!
గ్రేహౌండ్స్ పటిష్ఠత, మావోయిస్టుల చర్యలను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కోసం రూ. 2.86 కోట్లు కేటాయించారు. ఐటీ సెజ్‌లలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్ తదితర అవసరాల కోసం రూ. 3.44 కోట్లు కూడా కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీశైలం జల వివాదంపై బుధవారం కృష్ణాబోర్డు సమావేశం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వసతులను మెరుగుపరచడానికి సివిల్, పోలీసు ఉన్నతాధికారులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో 12 మంది సభ్యులుంటారు. -
గ్రేహౌండ్స్ పని తీరును అభినందించిన రాయ్
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్స్ అణచివేతకు పని చేస్తున్న గ్రేహోండ్స్ పని తీరును గవర్నర్ సలహాదారు ఎం.ఎన్. రాయ్ మంగళవారం అభినందించారు. పోలీసు ఆస్తుల విభజనను సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ రోజు గండిపేట్, ప్రేమావతి పేటలోని గ్రేహోండ్స్ ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. ఆయన వెంట డీజీపీ బి. ప్రసాదరావు, గ్రేహోండ్స్ డీజీపీ జె.వి. రాముడు ఉన్నారు. ఎలాంటి వాతావరణంలో నైనా చురుకుగా పనిచేసే చిచ్చర పిడుగులాంటి గ్రేహౌండ్స్ కమెండోల యాంటి నక్సలైట్ ఆపరేషన్ నైపుణ్యాన్ని చూసి ఆయన అభినందించారు. అపాయెంటెడ్ డే సమీపిస్తున్న కొలది పోలీసుశాఖలో విభజన ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం,పోలీసుశాఖలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు , ఎం.ఎన్.రాయ్ పోలీసుశాఖకు చెందిన ఆస్తుల పంపకం కోసం వివిధ భవనాలను స్వయంగా మంగళవారం సందర్శించారు. పంపకాల కోసం తీసుకుంటున్న పనులను ఆయన సమీక్షించారు. ఇందులో భాగంగా గత రెండురోజులుగా ఆయన రాష్ట్ర డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లోని వివిధ విభాగాలను తిలకించారు. డీజీపీ కార్యాలయంలోని నాలుగు అంతస్తుల్లో ఉన్న అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీల కార్యాలయాలతోపాటు అదే ప్రాంగణంలోని పోలీసు కమ్యూనికేషన్స్, రైల్వే పోలీసు, పోలీసు రిక్రూట్మెంట్, పోలీసు హౌజింగ్ కార్పోరేషన్ల కార్యాలయాలను రాయ్ సందర్శించారు. అలాగే బేగంపేట్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయం, యాంటి టైస్ట్ ఆపరేషన్ విభాగం అక్టోపస్ కార్యాలయాలను కూడా రాయ్ సందర్శించారు. చివరిలో ఆయన యాంటి నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. -
ఠాణాలే లక్ష్యం
మావోయిస్టుల వ్యూహరచన సరిహద్దు వెంబడి పది స్టేషన్లు అప్రమత్తం బలం తగ్గలేదని చూపడానికే ప్రణాళిక స్టేషన్ల వద్ద సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు ఈస్టు డివిజన్‌లోకి గుత్తికోయలు? పోలీసులు ఒత్తిడి పెంచుతూ ఉండడంతో సతమతమవుతున్న మావోయిస్టులు, ప్రత్యర్థులను గట్టిదెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉన్నట్టు అర్ధమవుతోంది. తాజాగా వారు పోలీసు స్టేషన్లపై దాడికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది. దాడులకు అవకాశం ఉందని తెలియడంతో ఏవోబీ వెంబడి ఉన్న పది స్టేషన్లలో పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దికాలంగా ఈస్ట్ డివిజన్లో దాడులు చేస్తున్న మావోయిస్టులు మరింత తెగించకుండా అప్రమత్తమవుతున్నారు. అవుట్‌పోస్టుల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు, లక్ష్యసాధనకు దూకుడుగా వ్యవహరించే వీలుందని భావిస్తున్నారు. ఇటీవలే ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చలపతి కూడా ఈస్టు డివిజన్లో పర్యటించారని, ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలు కూడా ఈస్టు డివిజన్‌లోకి అడుగు పెట్టారని తెలియడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొయ్యూరు,న్యూస్‌లైన్: నెల రోజులుగా ఈస్ట్ డివిజన్లో మావోయిస్టులు చెలరేగుతున్నారు. అటు బలపం నుంచి ఇటు చాపగెడ్డ వరకు ఏపీఎఫ్డీసీ ఆస్తులు నాశనం చేశారు. ఈ వేడి చల్లారక ముందే పోలీస్ట్ స్టేషన్లపై దాడులు చేయాలని మావోయిస్టులు ఆలోచిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో సరిహద్దు వెంబడి ఉన్న పోలీస్ స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు కూడా అధిక సంఖ్యలో వచ్చారని, వీరంతా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారని తెలియడంతో ఉన్నతాధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గుత్తికోయలు భారీగా వస్తే ఏదో పెద్ద విధ్వంసానికి పథకాలు వేస్తున్నారన్న అనుమానాలు ఉండడంతో ప్రస్తుత వాతావరణంపై మరింత దృష్టి పెట్టారు. అగ్రనేతలు కొందరు పోలీసులకు పట్టుబడడంతో మావోయిస్టులు బలహీన పడ్డారన్న వాదనలను తిప్పి కొట్టేందుకు స్టేషన్లపై దాడులకు దిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఏవోబీని ఆనుకుని సీలేరు, గూడెం కొత్తవీధి, చింతపల్లి, అన్నవరం, జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచింగ్‌పుట్,కొయ్యూరు,మంప స్టేషన్లున్నాయి. సీలేరు నుంచి ముంచింగ్‌పుట్ వరకు ఉన్న స్టేషన్ల వద్ద సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలున్నాయి. కొయ్యూరు, మంప స్టేషన్ల వద్ద ఏపీఎస్పీతో పాటు ఇతర బలగాలున్నాయి. వీటికి అదనంగా గ్రేహౌండ్స్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు.