కొల్లగొట్టేందుకు.. కోకొల్లలుగా
భీమదేవరపల్లి, న్యూస్‌లైన్ : నాలుగు గ్రామాల పరిధి.. నాలుగు నెలల సమయం.. సుమారు నాలుగు వందల దరఖాస్తులు.. ఇదీ మండలంలోని ఇనుపరాతి గుట్టలపై గ్రానైట్ క్వారీల ఏర్పాటుకు ఉన్న డిమాండ్. ఈ గుట్టలను విశాఖ ఉక్కు పరిశ్రమకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు అంతే స్థాయిలో దరఖాస్తులూ వచ్చి పడుతున్నాయి. నాలుగు నెలల నుంచి దాదాపు మూడు వందలపైనే దరఖాస్తులు అందాయని తహశీల్దార్ కార్యాలయవర్గాలు చెబుతున్నాయి.
చివరకు దేవుని గుట్టలకూ దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో బడా వ్యాపారులతోపాటు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
మండలంలోని ఎర్రబల్లి, కొత్తపల్లి, కొత్తకొండ, ధర్మారం, ముస్తఫాపూర్, గట్లనర్సింగపూర్, వంగరలలో 1500 హెక్టార్లలో గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఎర్రబల్లి, కొత్తపల్లి గ్రామాల శివారులోని గుట్టల్లో ఇనుము ఉంది. వీటిని విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తూ రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వంగర, ముస్తఫాపూర్, ధర్మారం గుట్టల కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
దేవునికీ తప్పని ముప్పు!
వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న దేవునిగుట్టలనూ కొల్లగొట్టేందుకు ‘గ్రానైట్ ఘనులు’ సిద్ధమయ్యారు. కొత్తకొండ వీర భద్రస్వామి దేవస్థా నం, గట్లనర్సింగాపూర్ లక్కాకులమ్మ జాతర గుట్టలకూ దరఖాస్తులు చేసుకున్నారు. చిత్రమేంటంటే వీరభద్రస్వామి సమీపంలోని గుట్టపైనే వెలిశాడు. ఏటా సంక్రాంతి సందర్భంగా నెల పాటు ఇక్కడ బ్రహ్మోత్సావాలు జరుగుతాయి. గట్లనర్సింగపూర్ లక్కాకులమ్మ జాతర సైతం ఏటా మూడు రోజులు నిర్వహిస్తారు. ఈ గుట్టలకు ఎసరు పెడితే ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం వాటిల్లుతుందనేది భక్తుల ఆందోళన.