Groom committed suicide
-
పెళ్లి ఇష్టం లేక వరుడి ఆత్మహత్య?
హసన్‌పర్తి/వర్ధన్నపేట: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ శవమై లభించాడు. వర్ధన్నపేట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పోలీసులు.. వరుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరంలోని గోకుల నగర్‌కు చెందిన భూక్యా కృష్ణ తేజ(29) వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో జరగనుంది. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికల పంపిణీ చేయడం ప్రారంభించారు. పెళ్లి ఇష్టం లేకనే? కృష్ణతేజకు పెళ్లి ఇష్టం లేకనే ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ బైక్ పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని బైక్‌ను పరిశీలించారు. అందులో పెళ్లి పత్రికలు లభ్యంకాగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు కృష్ణతేజ తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక పెళ్లి ఇష్టం లేక పారిపోయాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం వర్ధన్నపేట మండలంలోని శ్రీ రామోజీ కుమ్మరిగూడెం శివారులోని ఎస్సీరెస్పీ కాల్వలో కృష్ణాతేజ మృతదేహం లభ్యమైంది. -
పెళ్లైన నెల రోజులకే...
మూడుముళ్లు...ఏడడుగులు బంధం...నెల రోజుల్లోనే తెగిపోయాయి. నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఆ నవ వధూవరుల్లో వరుడు భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకేదో ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అత్తింటి వారు అనుమానించి భార్యను కాపురానికి పంపకపోవడంతో నెల రోజులుగా తిరిగితిరిగి వేసారి చివరకు తనువు చాలించాలని నిర్ణయించాడు. అదీ స్నేహితుని ఇంట్లో...చివరి సారిగా స్నేహితుని ఇంట్లో భోజనం చేసి ఉరి వేసుకొని మృత్యు ఒడిలోకి జారిపోయాడు. దీంతో వరుని ఇంట్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే... సాలూరు(విజయనగరం) : స్థానిక బంగారమ్మ కాలనీలో నివాసముంటున్న మరిపి సంతోష్‌కుమార్(24) లావుడివీధిలో ఉంటున్న స్నేహితుడు తిరుమరెడ్డి త్రినాధ్ ఇంట్లో మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ పాంగి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు తండ్రి కృష్ణ పోలీసులకు తెలిపిన వివరాలు ప్రకారం సంతోష్‌కుమార్‌కు చినబోగిలి గ్రామానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీని వివాహం జరిగింది. తన బిడ్డకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అమ్మాయి తరఫు వారు ఆరోపిస్తూ తమ ఇంటికి పంపలేదని తెలిపారు. తన కుమారుడు భార్యని తీసుకువచ్చేందుకు పలుమార్లు వెళ్లినా ఆమెను పంపేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై తన బిడ్డ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వివరించాడు. ఇదే సంఘటనపై సంతోష్‌కుమార్ స్నేహితుడు త్రినాధ్ మాట్లాడుతూ తమ ఇంట్లో మంగళవారం ఉదయం భోజనం చేశాడని, ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.