పెళ్లైన నెల రోజులకే...
మూడుముళ్లు...ఏడడుగులు బంధం...నెల రోజుల్లోనే తెగిపోయాయి. నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఆ నవ వధూవరుల్లో వరుడు భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకేదో ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అత్తింటి వారు అనుమానించి భార్యను కాపురానికి పంపకపోవడంతో నెల రోజులుగా తిరిగితిరిగి వేసారి చివరకు తనువు చాలించాలని నిర్ణయించాడు. అదీ స్నేహితుని ఇంట్లో...చివరి సారిగా స్నేహితుని ఇంట్లో భోజనం చేసి ఉరి వేసుకొని మృత్యు ఒడిలోకి జారిపోయాడు. దీంతో వరుని ఇంట్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే...
సాలూరు(విజయనగరం) : స్థానిక బంగారమ్మ కాలనీలో నివాసముంటున్న మరిపి సంతోష్‌కుమార్(24) లావుడివీధిలో ఉంటున్న స్నేహితుడు తిరుమరెడ్డి త్రినాధ్ ఇంట్లో మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ పాంగి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు తండ్రి కృష్ణ పోలీసులకు తెలిపిన వివరాలు ప్రకారం సంతోష్‌కుమార్‌కు చినబోగిలి గ్రామానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీని వివాహం జరిగింది.
తన బిడ్డకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అమ్మాయి తరఫు వారు ఆరోపిస్తూ తమ ఇంటికి పంపలేదని తెలిపారు. తన కుమారుడు భార్యని తీసుకువచ్చేందుకు పలుమార్లు వెళ్లినా ఆమెను పంపేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై తన బిడ్డ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వివరించాడు. ఇదే సంఘటనపై సంతోష్‌కుమార్ స్నేహితుడు త్రినాధ్ మాట్లాడుతూ తమ ఇంట్లో మంగళవారం ఉదయం భోజనం చేశాడని, ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.