gross production
-
జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచాక తొలిసారిగా జిల్లాలవారీ స్థూల ఉత్పత్తిని లెక్కించారు. ఈ క్రమంలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా వాటా 9.15 శాతం ఉండగా ఎన్టీఆర్ జిల్లా వాటా 5.65 శాతం, కృష్ణా జిల్లా వాటా 5.24 శాతం ఉంది. ఇక చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 1.16 శాతం వాటాతో నిలిచింది. పారిశ్రామిక, సేవా రంగాల్లోనూ విశాఖ టాప్..కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏలూరు జిల్లా 9.87 శాతం వాటాతో మొదటి ర్యాంకులో ఉండగా కృష్ణా జిల్లా 7.56 శాతంతో రెండో ర్యాంకులో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా 5.32 శాతం వాటాతో మూడో ర్యాంకు దక్కించుకుంది. పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం జిల్లా 18.82 శాతం వాటాతో మొదటి ర్యాంకులో నిలవగా తిరుపతి 7.78 శాతం వాటాతో రెండో ర్యాంకులో నిలిచింది.అనకాపల్లి 7.02 శాతం వాటాతో మూడో ర్యాంకులో ఉంది. అలాగే సేవా రంగంలోనూ విశాఖపట్నం జిల్లా సత్తా చాటింది. 10.22 శాతం వాటాతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఎన్టీఆర్ జిల్లా 9.45 శాతం వాటాతో రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా 6.57 శాతం వాటాతో మూడో ర్యాంకులో నిలిచాయి. -
AP: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర అన్ని రంగాల్లో కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.3,74,369 కోట్లు పెరిగింది. అలాగే రాష్ఠ్ర తలసరి ఆదాయం గత నాలుగేళ్లలో 65,487 రూపాయలు పెరిగింది. ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో వెల్లడించింది. గత నాలుగేళ్లుగా వ్యవసాయం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.7,90,810 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.11,65,179 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతున్నట్లు పేర్కొంది. 2018–19లో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల నికర విలువ రూ.2,61,448 కోట్లు ఉందని, ఈ విలువ ప్రతి ఏటా పెరుగుతూ 2022–23లో రూ.4,16,441 కోట్లకు చేరిందని వివరించింది. అలాగే తయారీ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.67,393 కోట్లు ఉండగా 2022–23కి రూ.89,180 కోట్లకు పెరిగింది. నిర్మాణ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.56,106 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.76,694 కోట్లకు పెరిగింది. రియల్ ఎస్టేట్, యాజమాన్యం, నివాసం, వృత్తిపరమైన సేవల ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.58,147 కోట్లు ఉండగా 2022–23కి రూ.82,775 కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గత నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షలు దాటింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 ఉండగా 2022–23కి రూ. 2,19,518 రూపాయలకు పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. -
నాలుగేళ్లలో రెట్టింపు కానున్న ఏపీ స్థూల ఉత్పత్తి
-
ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు
ఏపీ జీఎస్డీపీ 2022–23లో 16 శాతం వృద్ధితో రూ.13 లక్షల కోట్లకు చేరింది. 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. సాక్షి, అమరావతి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. ‘ఎస్బీఐ రీసెర్చ్’ ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ► దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. ► 2027 నాటికి భారత్ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్ప్రదేశ్ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలవనున్నాయి. ► 2027 నాటికి భారత్లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. ► ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. -
ప్రగతిలో విశాఖ ప్రథమం
విశాఖ రూరల్ : అభివృద్ధిలో విశాఖ ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖ జిల్లా వాటా 18 శాతం కావడమే దీనికి నిదర్శనం. జిల్లా స్థూల ఉత్పత్తి రెట్టింపునకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఆదాయ వనరుల పెంపుతో జిల్లా ప్రగతికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ‘జిల్లా విజన్ డాక్యుమెంట్’ రూపకల్పన మొదలైంది. నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విశాఖదే అగ్రభాగం: 2012-2013 వార్షిక నివేదిక ప్రకారం విశాఖ జిల్లా స్థూల ఉత్పత్తి రూ.56,668 కోట్లు. ఇందులో అధికంగా సర్వీసు రంగం రూ.31,372 కోట్లతో డీడీపీలో 55.36 శాతం వాటాతో అగ్రభాగంగా ఉంది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం రూ.19,811 కోట్లతో 34.96 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, వ్యవసాయ రంగం వాటా రూ.5485 కోట్లతో 9.6 శాతంగా ఉంది. వ్యవసాయ రంగంలో కూడా అధిక శాతం ఉద్యాన పంటల ద్వారా ఎక్కువగా వస్తోంది. రూ.1152 కోట్లు హార్టీకల్చర్ ద్వారా పురోగతి కనిపిస్తోంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో డీడీపీలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగా సర్వీసు, పారిశ్రామిక రంగాలు కీలకంగా ఉన్నాయి. రూ.లక్ష కోట్లు లక్ష్యం జిల్లా స్థూల ఉత్పత్తిని రూ.56,668 కోట్ల నుంచి 2019 నాటికి రూ.లక్ష కోట్లకు పెంచేందుకు అధికారులు జిల్లా విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్కు సమానం. ముందుగా నియోజకవర్గంలో ఒక మండలం, మండలంలో గ్రామాన్ని తీసుకొని ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. పదిహేను నియోజకవర్గాల్లో 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డాక్యుమెంట్ను తయారు చేస్తున్నారు. ఆయా మండలాల్లో కీలక రంగాన్ని ఆధారంగా చేసుకొని స్థూల ఉత్పత్తి రెట్టింపునకు అనుసరించాల్సిన విధానాలతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఆంధ్ర, గీతం విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిపుణుల బృందాన్ని జిల్లాకు పంపించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు.