రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
మూడో స్థానంలో కృష్ణా
చివరి స్థానంలో అల్లూరి జిల్లా
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచాక తొలిసారిగా జిల్లాలవారీ స్థూల ఉత్పత్తిని లెక్కించారు.
ఈ క్రమంలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా వాటా 9.15 శాతం ఉండగా ఎన్టీఆర్ జిల్లా వాటా 5.65 శాతం, కృష్ణా జిల్లా వాటా 5.24 శాతం ఉంది. ఇక చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 1.16 శాతం వాటాతో నిలిచింది.
పారిశ్రామిక, సేవా రంగాల్లోనూ విశాఖ టాప్..
కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏలూరు జిల్లా 9.87 శాతం వాటాతో మొదటి ర్యాంకులో ఉండగా కృష్ణా జిల్లా 7.56 శాతంతో రెండో ర్యాంకులో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా 5.32 శాతం వాటాతో మూడో ర్యాంకు దక్కించుకుంది. పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం జిల్లా 18.82 శాతం వాటాతో మొదటి ర్యాంకులో నిలవగా తిరుపతి 7.78 శాతం వాటాతో రెండో ర్యాంకులో నిలిచింది.
అనకాపల్లి 7.02 శాతం వాటాతో మూడో ర్యాంకులో ఉంది. అలాగే సేవా రంగంలోనూ విశాఖపట్నం జిల్లా సత్తా చాటింది. 10.22 శాతం వాటాతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఎన్టీఆర్ జిల్లా 9.45 శాతం వాటాతో రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా 6.57 శాతం వాటాతో మూడో ర్యాంకులో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment