‘క్రీమీలేయర్’ మార్గదర్శకాలపై స్పష్టత
బీసీ సంక్షేమశాఖ సర్క్యులర్ జారీ
సాక్షి, హైదరాబాద్: క్రీమీలేయర్‌పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ స్పష్టతనిచ్చింది. ఒక వ్యక్తి బీసీ సంపన్నశ్రేణి(క్రిమీలేయర్) హోదాను అతని స్టేటస్‌తో సంబంధం లేకుండా తల్లితండ్రుల స్టేటస్‌ను బట్టి మాత్రమే నిర్ణయించాలని సూచించింది. ఎవరైనా గ్రూప్-1 స్థాయి ఉద్యోగానికి ఎంపికై, మళ్లీ గ్రూప్-1 స్థాయిలోనే మరో ఉద్యోగం కోసం గ్రూప్-1 పరీక్షలకు కాని, సివిల్ సర్వీస్ పరీక్షలకుగాని ప్రయత్నించినప్పుడు అతని స్టేటస్‌ను బట్టి క్రీమీలేయర్‌గా పరిగణించరాదని తెలిపింది.
మహిళల విషయంలో ఆమె తల్లితండ్రుల స్టేటస్‌ను బట్టి క్రీమీలేయర్ హోదాను నిర్ణయించాలే తప్ప ఆమె భర్త స్టేటస్‌ను బట్టి కాదని వివరణ నిచ్చింది. ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి క్రీమీలేయర్ వర్తిస్తుందని అనుకోవడం సరికాదని, ఒక ఉద్యోగి తొలి నియామకపు స్టేటస్, ఆ కుటుంబానికి ఉన్న భూమి పరిమాణం, ప్రైవేట్ సేవలు లేదా వ్యాపారం లేదా వాణిజ్యరంగాల ద్వారా వచ్చే ఆదాయం, పట్టణాల్లో ఉన్న ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం, సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లింపు(రూ.30 లక్షల ఆస్తి వరకు సంపదపన్ను మిన హాయింపు ఉంది) వంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకుని, వీటిలో ఏ కేటగిరి లోనూ క్రిమీలేయర్గా పరిగణించే వీలులేనపుడు అటువంటి వారి పిల్లలు సంపన్నశ్రేణి కిం దకు రారని తెలిపింది.
వేర్వేరు కేటగిరిల కింద పొందే ఆదాయాన్ని కలిపి చూడవద్దని, ఆ విధంగా కలిపి చూపి క్రిమీలేయర్ స్టేటస్‌ను నిర్ణయించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయాలకు అనుగుణంగా రైతులు, వ్యాపారులు, ఉద్యోగులకు తహసీల్దార్లు నిర్ణీతసమయంలోగా ఓబీసీ క్రీమీలేయర్ ధ్రువీకరణపత్రాలను జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జీ డెరైక్టర్ ఆలోక్‌కుమార్ జారీ చేసిన సర్క్యులర్‌ను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.