ఒక్కో పోస్టుకు 668 మంది
గ్రూప్– 2 ఆన్లైన్ దరఖాస్తులకు ముగిసిన గడువు
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ నవంబర్ 8న విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. మొత్తం 982 పోస్టులకు 6,55,279 మంది దరఖాస్తులు సమర్పించినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టెస్టులో ఒక్కో పోస్టుకు దాదాపు 668 మంది చొప్పున పోటీ పడనున్నారు. స్క్రీనింగ్ టెస్టును ఓఎంఆర్ పత్రాల ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల రూపంలో నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర (ఏపీలో జరిగిన వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు), భారత రాజ్యాంగం, భారత ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక పరిస్థితి, గ్రామీణ సమాజంలో ఇటీవలి కాలంలోని సమస్యలు, ఇతర పరిణామాల (ఏపీ స్పెషల్ రిఫరెన్సు)తో ప్రశ్నలుంటాయి. స్క్రీనింగ్ టెస్టు నుంచి ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మే 20, 21 తేదీల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుందని కార్యదర్శి ప్రకటించారు.