'వారికి కళ్లెం వేసేది మోదీనే'
దేశంలో పరమత అసహనం పెరిగిపోతున్నదంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కీలక మిత్రపక్షం పీడీపీ నుంచి బలమైన మద్దతు లభించింది. ఈ విషయంలో ప్రధాని మోదీని పీడీపీ అధినేత, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ వెనకేసుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి అనుబంధం బలంగా ఉందని ఆయన తెలిపారు.
జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ కచ్చితమైన సందేశాన్ని ఇస్తారని, భారత్‌లోని భిన్నత్వం, బహుళత్వంపై తన విశ్వాసాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నట్టు ముఫ్తి చెప్పారు. ప్రస్తుతం ఇష్టానుసారంగా మాట్లాడుతూ మత ఉద్రిక్తతలు పెంచుతున్న పార్టీ నేతలకు మోదీ కళ్లెం వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలో ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు బలంగా ఉందని, బీజేపీ కూడా తమ రాష్ట్రంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకంగా తాము ప్యాకేజీ ఇవ్వాలని కోరడం లేదని, అయితే 2003లో వాజ్‌పేయ్ తరహాలోనే మోదీ కూడా కశ్మీర్‌కు ప్యాకేజీ ప్రకటించడంతోపాటు పాకిస్థాన్‌కు స్నేహం హస్తం అందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
మోదీ విజయవంతం అవుతారు
'దాద్రీ ఘటన బాధాకరం. దురదృష్టకరం. మన ప్రజాస్వామ్యంపై మచ్చ. కానీ మోదీ అజెండా 'అందరికీ సహాయం, అందరి వికాసం'. ఆయన మతవాది కానేకాదు. త్వరలోనే ఆయన తన పార్టీలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న నేతలకు కళ్లెం వేస్తారని నాకు నమ్మకముంది. ఇందుకు సమయం పడుతుంది. మోదీ నియంతృత్వవాది కాదు అనేది నా అనుభవం. మాతో పొత్తు పెట్టుకునే ముందు ఆయన చాలామందితో చర్చలు, సంప్రదింపులు జరిపారు. మోదీకి మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన సంకుచిత రాజకీయాల నుంచి బయటకు వచ్చి.. ఆర్థికాభివృద్ధి, రాజకీయ ఏకాభిప్రాయం దిశగా కృషి చేయక తప్పదు. పాకిస్థాన్‌తో స్నేహానికి ప్రయత్నించక తప్పదు' అని ముఫ్తి పేర్కొన్నారు.