పరిస్థితులు మెరుగుపడతాయ్
దావోస్: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడగలవన్న ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు శనివారం ముగిసింది. అయిదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అసమానతలు, మధ్యప్రాచ్య సంక్షోభం, బాధ్యతాయుత పెట్టుబడిదారీ విధానం తదితర అంశాలపై ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు చర్చించారు. భారత్ సహా పలు దేశాల నుంచి మొత్తం 2,500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
భారత నేతలు దేశ వృద్ధిపైన, సంస్కరణల కొనసాగింపుపైన ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టర్లు భారత్లో త్వరలో ఎన్నికల పరిణామాలపై ఆసక్తి కనపర్చారు. చివరి రోజున సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా భారత్ ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రణాళిక సంఘం డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టం చేశారు.