కవాతు చేస్తూ కుప్పకూలాడు..
లండన్: చేతిలో తుపాకులు, ముఖాన్ని కప్పేసే నల్లటి గొర్రెబొచ్చు టోపీలు, ఒంటిపై బరువైన ఎరుపు రంగు దుస్తులు, పైన ఎర్రటి ఎండ. ఎంగిలి పడ్డాడోలేదో పాపం ఆ గార్డ్స్ మన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 90వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతోన్న అధికారిక వేడుకల్లో ఈ ఘటన జరిగింది. లండన్ లోని హార్స్ గార్డ్స్ పరేడ్ లో శనివారం జరిగిన రిహార్సల్స్ లో ఓ గార్డ్స్ మన్ కుప్పకూలిపోగా, సహచరులు అతణ్ని స్ట్రెచర్ పై మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు.
శుక్రవారం కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. అతిథులతో కలిసి రాణిగారు వేంచేయడానికి కొద్ది నిమిషాల ముందు.. ఆమెకు వందనం సమర్పించేందుకు ఎదురుచూస్తోన్న గార్డుల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. 2014, 2011ల్లో జరిగిన రాణిగారి పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలా గార్డులు పడిపోయిన సంఘటనలున్నాయి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నట్లు.. రాణిగారి పుట్టినరోజు వేడుకల్లో గార్డ్స్ మన్లను ఇలా కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. అయినాసరే మా రాణిగారికోసం ఎన్ని ఇబ్బందులకైనా రెడీ అంటున్నారు బ్రిటన్ భటులు!