సాంస్కృతిక వటవృక్షం
నాగ్‌పూర్/బిలాస్పూర్: మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుక గుడీ పడ్వా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్‌లో పర్యటించారు. అక్కడి ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. రెషీంబాగ్లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతిమందిర్కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్‌కు, సంస్థ రెండో సర్సంఘ్చాలక్ మాధవ్‌రావ్ సదాశివరావ్ గోల్వాల్కర్‌కు నివాళులర్పించారు. ఆరెస్సెస్ గొప్పదనాన్ని, సంస్థ నేతల కృషిని ప్రస్తుతిస్తూ సందర్శకుల పుస్తకంలో హిందీలో భావోద్వేగపూరితంగా నోట్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి సంస్థ పంచాంగ కార్యక్రమం (ప్రతిపద)లో పాల్గొన్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఈ 11 ఏళ్లలో మోదీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్థ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ‘‘ఆరెస్సెస్ భారతదేశానికి సాంస్కృతిక వటవృక్షం వంటిది. జాతి ప్రయోజనాలే లక్ష్యంగా మన సంస్కృతిని, ఆధునికతను నిత్యం పరిరక్షిస్తోంది. ఇందుకోసం అసంఖ్యాకులైన ఆరెస్సెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా పురోగమిస్తున్న వేళ ఆరెస్సెస్ వందేళ్ల తపస్సు ఇప్పుడు ఫలాలందిస్తోంది. బానిస మనస్తత్వాన్ని, బానిస పాలన చిహ్నాలను, కాలం చెల్లిన చట్టాలను తొలగిస్తూ నూతన న్యాయసంహితతో భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ అన్నారు. మాధవ్ నేత్రాలయకు శంకుస్థాపన నాగపూర్‌లో మాధవ్ నేత్రాలయ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్‌కు అనుబంధంగా నిర్మించబోయే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. ఆరెస్సెస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్‌కు గుర్తుగా ఈ నేత్రాలయను నిర్మించారు. ‘‘గోల్వాల్కర్ స్ఫూర్తితో ఈ నేత్రాలయం లక్షలాది మందికి కంటి బాధలను దూరంచేసింది. కొత్త ఆస్పత్రి కూడా కంటి సమస్యల బాధితులకు వెలుగులను పంచనుంది’’ అన్నారు. దీక్షాభూమిలో అంబేడ్కర్‌కు నివాళి నాగపూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన చోట నిర్మించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. రాజ్యంగ నిర్మాతకు నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల డైరీలో మోదీ రాశారు. భారత్‌ను సమ్మిళిత, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడమే అంబేడ్కర్‌కు అసలైన నివాళి అన్నారు. తర్వాత నాగపూర్‌లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఆయుధాగారాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడ మానవరహిత విహంగాల రన్‌వేను ప్రారంభించారు.కాంగ్రెస్ వల్లే నక్సలిజం ప్రబలింది ఛత్తీస్ పర్యటనలో మోదీ ధ్వజం కాంగ్రెస్ ప్రభుత్వాల విఫల విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నక్సలిజం ఊపందుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆయా రాష్ట్రాల్లో పెనుమార్పు మొదలైంది. నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో శాంతి శకం ఆరంభమైంది’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో రూ.33,700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బిలాస్పూర్ జిల్లా మోహ్భాత్తా గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘‘దేశాన్ని 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? అభివృద్ధికి నోచుకోని జిల్లాలను పట్టించుకోవడం మానేసింది. వాటిని ‘వెనుకబడిన జిల్లాలు’గా ప్రకటించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో నక్సలిజం విజృంభించింది. అభివృద్ధి పడకేసింది. మావోయిస్టు హింసలో ఎంతోమంది తల్లులు కుమారులను కోల్పోయారు. నక్సలైట్ల బెడదతో అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందలేదు. కాంగ్రెస్ పాలకులు వారినెప్పుడూ పట్టించుకోలేదు. మేమొచ్చాక స్వచ్్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్‌లతో ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. ‘‘ఎవరికైనా ఆశ్రయం కల్పించడాన్ని భారత సంప్రదాయాల్లో గొప్పగా చెబుతారు. ఛత్తస్‌గఢ్‌లో ‘నవరాత్రి’ సందర్భంగా 3 లక్షల పేద కుటుంబాలు సొంతిళ్లలోకి మారుతున్నాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్యోజనతో లక్షలాది ఇళ్లు నిర్మించాం. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. వాజ్‌పేయీ శతజయంతి వేడుకలు, ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ రజతోత్సవాలు ఈ ఏడాదే రావడం యాదృచి్ఛకం’’ అని మోదీ అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.