Gudimalkapur market
-
కాసులు కురిపిస్తున్న అలంకరణ ఆకు!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో ‘‘డెకరేషన్ ఆకు’’ ఉండి తీరాల్సిందే! బాపట్ల తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేసే ఈ ప్రత్యేకమైన ఆకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మన రైతులు డెకరేషన్ ఆకు (లైన్ ఆకు)ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఆకర్షణీయంగా, వాడిపోకుండా ఉండే లైన్ ఆకును పూలమాలల్లో కలుపుతారు. ప్రధానంగా శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ డెకరేషన్లో విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్లే దీన్ని ఫంక్షన్ ఆకు, డెకరేషన్ ఆకు అని కూడా వ్యవహరిస్తారు.ఇసుక నేలలు అనుకూలం కావడంతో బాపట్ల పరిసరాల్లోని దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి కొత్తపాలెం, పోతురాజు కొత్తపాలెం, నాగేంద్రపురం, సుబ్బారెడ్డిపాలెం, కుక్కలవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, తులసీనగర్ తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల్లో రైతులు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు. నెల రోజులకు తొలి కోతడెకరేషన్ ఆకును ఒకసారి సాగుచేస్తే రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. తొలి ఏడాది రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. నాటిన నెల రోజులకు కోతకు వస్తుంది. నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరగ్గానే ఆకును కోస్తారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు ఒకసారి కోసి మార్కెట్‌కు తరలిస్తారు. ఆకు పెరిగేందుకు ఎరువుల వాడకంతోపాటు పాచి తెగులు, కుళ్లు తెగుళ్ల నివారణకు ఐదు రోజులకు కొకసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నప్పటికి ఆకుకు ధర ఉంటే మంచి లాభాలే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. లాభదాయకమే..రెండు నెలల క్రితం కిలో రూ.25 పలికిన డెకరేషన్ ఆకు ప్రస్తుతం రూ.20 ఉంది. 70 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఎకరాకు రూ.1.40 లక్షలు రాబడి వస్తుంది. ఏడాదిలో 8 కోతలు ద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తే పెట్టుబడి వ్యయం రూ.3 – 4 లక్షలు పోనూ ఎకరాకు రూ.6 లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. కిలో రూ.5 నుంచి రూ.10 లోపు అమ్మిన సందర్భాల్లో నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. అయితే మిగిలిన పంటలతో పోలిస్తే లైన్ ఆకు సాగు లాభదాయకమేనన్నది రైతుల అభిప్రాయం. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా దిగుబడి వస్తుండడంతో రైతులు ప్రతి 40 రోజులకు కోత కోసి 70 కిలోల చొప్పున బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ మార్కెట్‌కు లారీల్లో తరలిస్తున్నారు. కొందరు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై తదితర మార్కెట్లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా డిమాండ్ నేపథ్యంలో లైన్‌ఆకు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది.ధర ఉంటే మంచి రాబడి20 సెంట్లలో లైన్‌ఆకు సాగు చేశా. తొలుత రూ.40 వేలు పెట్టుబడి పెట్టా. ఒకసారి సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట ఉంటుంది. ప్రతి 40 రోజులకొకసారి ఆకు కోతకోసి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు పంపుతున్నాం. ప్రస్తుతం కిలో ఆకు రూ.20 ఉంది. ఈ మాత్రం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – ఎం.నారాయణరెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంకొమ్మ తెచ్చి నాటాలి70 సెంట్లలో లైన్ ఆకు సాగుచేశా. కొమ్మ తెచ్చి నాటితే మూడు నాలుగేళ్లు ఉంటుంది. కోసిన ఆకును 70 కిలోల బస్తాల్లో నింపి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పంపుతున్నాం. – రామకృష్ణారెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంజాగ్రత్తగా పెంచుకోవాలిఎకరం పొలంలో డెకరేషన్ ఆకు సాగు చేశా. తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఆకు కోసిన ప్రతిసారీ ఎరువులు వేయడంతోపాటు వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా. ఆకును జాగ్రత్తగా పెంచుకోవాలి. నెల క్రితం కిలో రూ.25 చొప్పున ధర ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రేటు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావు.– కుక్కల కోటిరెడ్డి, రైతు, కుక్కలవారిపాలెంఏడాది పొడవునా పంటడెకరేషన్ ఆకు నాటిన నెలకే కోతకు వస్తుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి 40 రోజులకొకసారి కోతకు వస్తుంది. ఏడాది పొడవునా పంట ఉంటుంది. ఒకసారి సాగుచేస్తే మూడు నాలుగేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దరలు బాగున్నాయి. – ఏ.రవణమ్మ, రైతు, దరివాద కొత్తపాలెం -
తెలంగాణలో టమాట ధర పైపైకి
సాక్షి, సిటీబ్యూరో : టమాటా.. ఈ మాట వింటేనే ఎంత మాట అనేంతగా ఆశ్చర్యపడాల్సివస్తోంది. ప్రస్తుతం దీని ధర బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యమైన టమాటా రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 పలుకుతోంది. లాక్డౌన్, వేసవిలో ధరలు నిలకడగానే ఉన్నా.. వారం పదిరోజులుగా తన ప్రతాపం చూపిస్తోంది. అప్పుడు కిలో రూ.20 నుంచి రూ.30 పలికింది. ప్రస్తుతం మూడింతలు పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.40 పలుకుతోంది. కానీ రిటైల్ మార్కెట్లోనే హాట్‌హాట్‌గా మారింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా.. గత ఏడాది ఇదే సమయంలో కిలో టమాటా రూ.30 పలకడం గమనార్హం. ఎందుకిలా? గ్రేటర్ ప్రజల టమాటా అవసరాలు ఎక్కువ శాతం శివారు ప్రాంతాల నుంచి వచ్చే దిగుమతులే తీరుస్తాయి. రెండు వారాలుగా నగర మార్కెట్లకు ఆశించిన స్థాయిలో రావడంలేదు. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో పంట ఇంకా చేతికి రాలేదు. ఉన్న కొద్దిపాటి టమాటాను గ్రేటర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో దీని ధరలు విపరితంగా పెరిగాయి. నెల రోజుల్లో టమాటా పంట చేతికి వస్తే ఎక్కువ మోతాదులో దిగుమతులు ఉంటాయని, దీంతో ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరోవైపు మళ్లీ లాక్డౌన్ చేస్తారనే సంకేతాల నేపథ్యంలో వినియోగదారులు టమాటాను భారీ స్థాయిలో కొనుగోలు చేయడంతో కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనూ ధరలపై ప్రభావం చూపుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు.. శివారు ప్రాంతాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగర హోల్‌సెల్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా చార్జీలు, ఏజెంట్ల కమీషన్‌తో పాటు ఇక్కడి మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు వాటా.. ఇవన్నీ కలుపుకొని టమాటా ధరలు పెరుగుతున్నాయి. కాగా.. మార్కెట్ కమీషన్ ఏజెంట్లు ఇతర ప్రాంతాల నుంచి టమాటా తెప్పించి ఎక్కువ లాభాల కోసం ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ అధికారులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. మూడ్రోజులు గుడిమల్కాపూర్ మార్కెట్ బంద్ గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటక్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల మార్కెట్లో ఓ వ్యక్తి కరోనా వ్యాధి బారిన పడ్డారని, దీంతో హమాలీలు, వ్యాపారులు మార్కెట్‌ను బంద్ చేయాలని కోరారు. కమిటీ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. గురు, శుక్ర, శనివారాల్లో మార్కెట్‌ను బంద్ చేయాలని తీర్మానించారు. ఈ మూడ్రోజుల్లో మార్కెట్లో శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. -
మాస్కులు మాకేల..!
గోల్కొండ: నగరంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్లలో ఒకటైన గుడిమల్కాపూర్ మార్కెట్ కరోనా హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన ఓ వ్యక్తికి గత వారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆ మరునాడే గుడిమల్కాపూర్‌లో మరో 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో అధికారులు హడావిడిగా మూడు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేశారు. శానిటైజేషన్ చేసిన అనంతరం శనివారం మార్కెట్‌ను మళ్లీ తెరిచారు. మాస్కు లేనిదే మార్కెట్లోకి అనుమతించేది లేదంటూ నిబంధనలు విధించారు. అయితే మార్కెట్లోని వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, కూరగాయలు కొనేందుకు వచ్చే చిల్లర వ్యాపారులు మాస్కులు లేకుండానే మార్కెట్లోకి వస్తున్నారు. కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చే ట్రక్కులు, డీసీఎంలు, ఆటోట్రాలీల వారు కూడా మాస్కులు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు. మార్కెట్ కమిటీ సిబ్బంది సైతం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ మార్కెట్ ఒకటి. మార్కెట్లో నిబంధనలు పాటించక పోవడం వలన కరోనా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలను రాత్రివేళల్లో తెస్తారు. ఆకు కూరలతో పాటు ఇతర కూరగాయలను కొనేందుకు చిల్లర వ్యాపారులు తెల్లవారుజాము 3 గంటల నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తారు. వేల సంఖ్యలో రైతులు, కమీషన్ ఏజెంట్లు, డ్రైవర్లు, చిల్లర వ్యాపారులు ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులోనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది సైతం మాస్కుల్లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ప్రజలకే కానీ తమకు వర్తించన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులతో మార్కెట్ కమిటీలో జరుగుతున్న ఉల్లంఘనలపై విచారణ చేపట్టి బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న పాలకమండలి, కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
జన పథం - గుడిమల్కాపూర్ మార్కెట్
-
డీసీఎం బీభత్సం
=వేగంగా దూసుకొచ్చి ఢీ.. =ఇద్దరు విద్యార్థినులకు గాయాలు =8 వాహనాలు ధ్వంసం =గుడిమల్కాపూర్‌లో ఘటన మెహిదీపట్నం, న్యూస్‌లైన్: స్కూలు విడిచే సమయం.. పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు.. మరోపక్క ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమై ఆటోల్లో కూర్చుని ఉన్న విద్యార్థులు.. అంతలో మితిమీరిన వేగంతో డీసీఎం దూసుకొచ్చింది. క్షణాల్లో పరిస్థితిని భీతావహంగా మార్చేసింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. పలువురు చిన్నారులు తృటిలో తప్పించుకున్నారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ చౌరస్తా ఎంఎన్ఆర్ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ నర్సయ్య కథనం ప్రకారం.. జిర్రా ప్రాంతానికి చెందిన ఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ పాల ఏజెన్సీకి చెందిన డీసీఎం గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి గుడిమల్కాపూర్ చౌరస్తా వైపు రాంగ్రూట్లో ప్రవేశించింది. వేగంగా దూసుకొచ్చి ఎంఎన్ఆర్ పాఠశాల సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను, పాఠశాల విద్యార్థులతో ఉన్న ఆటోలను ఢీకొట్టింది. ఆటోలలో మెహిదీపట్నంలోని వికలాంగుల, బుద్ధిమాంద్యుల హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. వేగంగా వచ్చిన వ్యాను ఆటోలను ఢీకొట్టడంతో అందులోని వారంతా భీతావహులై కేకలు పెట్టారు. డీసీఎం ఆటోలను ఢీకొట్టే క్రమంలో పెద్ద శబ్దం వచ్చింది. అదే సమయంలో తమ పిల్లల్ని తీసుకెళ్లడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో హర్షిత, జుబేరియా స్వల్పంగా గాయపడ్డారు. వీరి ఆటోలకు పక్కనున్న మరో వాహనంలోని విద్యార్థులు సమయస్ఫూర్తితో తప్పించుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ ఖాజాను అదుపులోకి తీసుకున్నారు. నుజ్జునుజ్జయిన ఆటోలను పక్కకు తొలగించారు. మొత్తం ఆరు ఆటోలు, కారు, బస్సు ధ్వంసమయ్యాయి. డ్రైవర్‌కు మూర్ఛ రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.