బాపట్ల ఇసుక నేలల్లో పండే డెకరేషన్ ఆకుకు భలే డిమాండ్
పూలదండలు, ఫంక్షన్ అలంకరణల్లో విరివిగా వినియోగం
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా
అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ‘లైన్ ఆకు’
సముద్ర తీరప్రాంతంలో 400 ఎకరాల్లో సాగు
రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి..
40 రోజులకు ఒక కోత.. ఏడాదిలో 8 కోతలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో ‘‘డెకరేషన్ ఆకు’’ ఉండి తీరాల్సిందే! బాపట్ల తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేసే ఈ ప్రత్యేకమైన ఆకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మన రైతులు డెకరేషన్ ఆకు (లైన్ ఆకు)ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు.
అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఆకర్షణీయంగా, వాడిపోకుండా ఉండే లైన్ ఆకును పూలమాలల్లో కలుపుతారు. ప్రధానంగా శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ డెకరేషన్‌లో విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్లే దీన్ని ఫంక్షన్ ఆకు, డెకరేషన్ ఆకు అని కూడా వ్యవహరిస్తారు.
ఇసుక నేలలు అనుకూలం కావడంతో బాపట్ల పరిసరాల్లోని దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి కొత్తపాలెం, పోతురాజు కొత్తపాలెం, నాగేంద్రపురం, సుబ్బారెడ్డిపాలెం, కుక్కలవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, తులసీనగర్ తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల్లో రైతులు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు.
నెల రోజులకు తొలి కోత
డెకరేషన్ ఆకును ఒకసారి సాగుచేస్తే రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. తొలి ఏడాది రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. నాటిన నెల రోజులకు కోతకు వస్తుంది. నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరగ్గానే ఆకును కోస్తారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు ఒకసారి కోసి మార్కెట్‌కు తరలిస్తారు.
ఆకు పెరిగేందుకు ఎరువుల వాడకంతోపాటు పాచి తెగులు, కుళ్లు తెగుళ్ల నివారణకు ఐదు రోజులకు కొకసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నప్పటికి ఆకుకు ధర ఉంటే మంచి లాభాలే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు.
లాభదాయకమే..
రెండు నెలల క్రితం కిలో రూ.25 పలికిన డెకరేషన్ ఆకు ప్రస్తుతం రూ.20 ఉంది. 70 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఎకరాకు రూ.1.40 లక్షలు రాబడి వస్తుంది. ఏడాదిలో 8 కోతలు ద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తే పెట్టుబడి వ్యయం రూ.3 – 4 లక్షలు పోనూ ఎకరాకు రూ.6 లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. కిలో రూ.5 నుంచి రూ.10 లోపు అమ్మిన సందర్భాల్లో నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు.
అయితే మిగిలిన పంటలతో పోలిస్తే లైన్ ఆకు సాగు లాభదాయకమేనన్నది రైతుల అభిప్రాయం. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా దిగుబడి వస్తుండడంతో రైతులు ప్రతి 40 రోజులకు కోత కోసి 70 కిలోల చొప్పున బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ మార్కెట్‌కు లారీల్లో తరలిస్తున్నారు. కొందరు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై తదితర మార్కెట్లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా డిమాండ్ నేపథ్యంలో లైన్‌ఆకు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది.
ధర ఉంటే మంచి రాబడి
20 సెంట్లలో లైన్‌ఆకు సాగు చేశా. తొలుత రూ.40 వేలు పెట్టుబడి పెట్టా. ఒకసారి సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట ఉంటుంది. ప్రతి 40 రోజులకొకసారి ఆకు కోతకోసి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు పంపుతున్నాం. ప్రస్తుతం కిలో ఆకు రూ.20 ఉంది. ఈ మాత్రం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది.
– ఎం.నారాయణరెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెం
కొమ్మ తెచ్చి నాటాలి
70 సెంట్లలో లైన్ ఆకు సాగుచేశా. కొమ్మ తెచ్చి నాటితే మూడు నాలుగేళ్లు ఉంటుంది. కోసిన ఆకును 70 కిలోల బస్తాల్లో నింపి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పంపుతున్నాం.
– రామకృష్ణారెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెం
జాగ్రత్తగా పెంచుకోవాలి
ఎకరం పొలంలో డెకరేషన్ ఆకు సాగు చేశా. తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఆకు కోసిన ప్రతిసారీ ఎరువులు వేయడంతోపాటు వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా. ఆకును జాగ్రత్తగా పెంచుకోవాలి. నెల క్రితం కిలో రూ.25 చొప్పున ధర ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రేటు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావు.
– కుక్కల కోటిరెడ్డి, రైతు, కుక్కలవారిపాలెం
ఏడాది పొడవునా పంట
డెకరేషన్ ఆకు నాటిన నెలకే కోతకు వస్తుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి 40 రోజులకొకసారి కోతకు వస్తుంది. ఏడాది పొడవునా పంట ఉంటుంది. ఒకసారి సాగుచేస్తే మూడు నాలుగేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దరలు బాగున్నాయి.
– ఏ.రవణమ్మ, రైతు, దరివాద కొత్తపాలెం
Comments
Please login to add a commentAdd a comment