=వేగంగా దూసుకొచ్చి ఢీ..
=ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
=8 వాహనాలు ధ్వంసం
=గుడిమల్కాపూర్‌లో ఘటన
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: స్కూలు విడిచే సమయం.. పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు.. మరోపక్క ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమై ఆటోల్లో కూర్చుని ఉన్న విద్యార్థులు.. అంతలో మితిమీరిన వేగంతో డీసీఎం దూసుకొచ్చింది. క్షణాల్లో పరిస్థితిని భీతావహంగా మార్చేసింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. పలువురు చిన్నారులు తృటిలో తప్పించుకున్నారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ చౌరస్తా ఎంఎన్‌ఆర్ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య కథనం ప్రకారం..
జిర్రా ప్రాంతానికి చెందిన ఎస్‌ఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పాల ఏజెన్సీకి చెందిన డీసీఎం గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి గుడిమల్కాపూర్ చౌరస్తా వైపు రాంగ్‌రూట్‌లో ప్రవేశించింది. వేగంగా దూసుకొచ్చి ఎంఎన్‌ఆర్ పాఠశాల సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను, పాఠశాల విద్యార్థులతో ఉన్న ఆటోలను ఢీకొట్టింది. ఆటోలలో మెహిదీపట్నంలోని వికలాంగుల, బుద్ధిమాంద్యుల హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. వేగంగా వచ్చిన వ్యాను ఆటోలను ఢీకొట్టడంతో అందులోని వారంతా భీతావహులై కేకలు పెట్టారు. డీసీఎం ఆటోలను ఢీకొట్టే క్రమంలో పెద్ద శబ్దం వచ్చింది.
అదే సమయంలో తమ పిల్లల్ని తీసుకెళ్లడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో హర్షిత, జుబేరియా స్వల్పంగా గాయపడ్డారు. వీరి ఆటోలకు పక్కనున్న మరో వాహనంలోని విద్యార్థులు సమయస్ఫూర్తితో తప్పించుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ ఖాజాను అదుపులోకి తీసుకున్నారు. నుజ్జునుజ్జయిన ఆటోలను పక్కకు తొలగించారు. మొత్తం ఆరు ఆటోలు, కారు, బస్సు ధ్వంసమయ్యాయి. డ్రైవర్‌కు మూర్ఛ రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం బీభత్సం
Published Fri, Nov 29 2013 5:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement