guest faculty
-
గెస్ట్ ఫ్యాకల్టీకి తీపి కబురు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మొత్తం 1,074 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు 2022–23 సంవత్సరానికి 10 నెలలు రెన్యువల్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబరు 147 విడుదల చేసింది. వీరికి గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం 3 నుంచి 5 నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడ్‌కు రూ.150 చొప్పున ఇచ్చేవారు. నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఇచ్చేవారు. అదీ.. కళాశాల ఎక్యుములేషన్ ఫండ్ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు. ఎక్యుములేషన్ ఫండ్ లేని కారణంతో 2017–18, 2018–19, 2019–2020 సంవత్సరాలకు మూడేళ్ల పాటు 87 కళాశాలల్లో లెక్చరర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి కష్టాలకు చెక్ పెడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ కాలాన్ని పెంచడంతోపాటు ఎక్యుములేషన్ ఫండ్‌తో సంబంధం లేకుండా వేతనాలనూ విడుదల చేసింది. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గెస్ట్ ఫ్యాకల్టీ ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని గెస్ట్ ఫ్యాకల్టీలు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాలను సానుకూలంగా విని సహకరించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. మాకు న్యాయం జరిగింది... ప్రభుత్వం గెస్ట్ ఫ్యాకల్టీల సమస్యలను గుర్తించి 10 నెలల రెన్యువల్ విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మాకు న్యాయం జరిగింది. ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి మా గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – రాజేష్ పట్టా, గెస్ట్ ఫ్యాకల్టీ (ఫిజిక్స్), నందిగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం జిల్లా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాకు ప్రభుత్వం రెన్యువల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. విద్యా శాఖ మంత్రి దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. మా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రెన్యువల్ చేయించారు. – పట్నాన శ్రీనివాసరావు, గెస్ట్ ఫ్యాకల్టీ,కామర్స్, ప్ర.జూ. కళాశాల, జి.సిగడాం -
వేతన బకాయిల్లేవు.. రెన్యూవల్ లేదు
సాక్షి ప్రతినిధి నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. గతేడాది పనిచేసిన కాలపు బకాయిలను ఇవ్వకపోవడంతోపాటు ఇప్పుడు కాలేజీలను తెరిచినా విధుల్లోకి తీసుకోకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను ఇటీవల ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. డిగ్రీ అధ్యాపకుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు సబెక్టు బోధించే అధ్యాపకులు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అవసరం ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,200 మంది రెగ్యులర్ లెక్చరర్లు, 830 కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వారు కాకుండా అదనంగా మరో 1,940 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగిస్తున్నారు. 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల అవసరం ఉన్నా గత ఏడాది 719 మంది గెస్ట్ లెక్చరర్లనే ఆన్లైన్ బోధన కోసం తీసుకున్నారు. వారికి ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల చొప్పున నెలకు రూ.21,600 గరిష్టంగా చెల్లిస్తున్నారు. గతేడాది రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లతోపాటు గెస్ట్ లెక్చరర్లు కూడా ఆన్లైన్ బోధన చేపట్టారు. వారికి ఆ పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటివరకూ అందలేదు. అప్పులు చేసి పూట వెళ్లదీయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నెల రోజులు అవుతున్నా.. ఈ విద్యా సంవత్సరంలో గత నెలలో వివిధ యూనివర్సిటీల పరిధిలో తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా గెస్ట్ లెక్చరర్లను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఉపాధి ఉంటుందా? లేదా? అన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాల వారీగా గతేడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల సంఖ్య ఇలా.. ఆదిలాబాద్–3, భద్రాద్రి కొత్తగూడెం–17, హైదరాబాద్–133, జగిత్యాల–10, జనగామ–6, జయశంకర్ భూపాలపల్లి–8, జోగులాంబ గద్వాల–32, కామారెడ్డి–29, కరీంనగర్–27, ఖమ్మం–18, కొమురంభీం ఆసిఫాబాద్–6, మహబూబాబాద్–14, మహబూబ్‌నగర్–51, మంచిర్యాల–11, మెదక్–17, మేడ్చల్–14, ములుగు–6, నాగర్‌కర్నూలు–32, నల్లగొండ–46, నారాయణపేట్–17, నిర్మల్–5, నిజామాబాద్ –31, పెద్దపల్లి–10, రాజన్న సిరిసిల్ల–3, రంగారెడ్డి–16, సంగారెడ్డి–45, సిద్దిపేట–51, సూర్యాపేట–4, వికారాబాద్–16, వనపర్తి–20, వరంగల్ రూరల్–3, వరంగల్ అర్బన్–13, యాదాద్రి భువనగిరి–5 -
టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్(టీటీడబ్ల్యూర్డీసీఎస్)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల్లో పార్ట్‌టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► డైరెక్టర్ హానరరీ: అర్హత: మాస్టర్ ఆఫ్ డిజైన్/పీహెచ్‌డీతో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాషన్ డిజైన్: అర్హత: ఫ్యాషన్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్ ఇంటీరియర్ డిజైన్: అర్హత: ఇంటీరియర్ డిజైన్/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్ ఫోటోగ్రఫీ: అర్హత: ఫోటోగ్రఫీ/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్‌టైం ఫ్యాకల్టీ ఇన్ కంప్యూటర్ సైన్స్: అర్హత: ఎంసీఏ/ఎంటెక్(సీఎస్ఈ/ఐటీ) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ttwrdcs.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: ఆర్సీబీలో టెక్నికల్ కొలువులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
పుస్తక నవోదయం...
విజయవాడలోని ఏలూరురోడ్డులో అన్నీ పుస్తకాలయాలే, అందులో అన్నీ ఉద్ద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది నవోదయ సంస్థ. తెలుగు వారంతా తెల్లకాగితాలతో ఉన్న ఒక పుస్తకాన్ని ప్రదర్శిస్తే దానికి కూడా నిశ్శబ్దంగా నవోదయ ముద్ర పడుతుంది. ఈ ముద్ర వెనుక కథ చాలా పెద్దదే. రామమోహనరావు చిన్నబావ కొండపల్లి రాఘవరెడ్డి గుడివాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ స్థాపించిన ఏడాదికే ఆ కార్యాలయాన్ని విజయవా డకు మార్చడంతో నవోదయ ప్రస్థానం మొద లైంది. 60 ఏళ్ల క్రితం సువిశాల ప్రాంగణంలో ప్రారంభమై, కొత్త పోకడల పెనుతుఫాన్‌కు తల వంచి, తన పరిధిని తగ్గించుకుంది. నవోదయ సంస్థ ఆర్థికంగా చిక్కినా, లక్ష్యాన్ని విడిచి పెట్టలేదు. ప్రచురణలు ఆపారు. విక్రయాలు జరిపారు. 1934లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరు గ్రామంలో ముగ్గురు ఆడపిల్లల తరవాత జన్మించిన అట్లూరి రామమోహన్‌రావు, ఎస్సెస్సెల్సీ వరకు చదువుకున్నారు. 1955లో పర్వతనేని ఝాన్సీతో దండల వివాహం చేసు కున్నారు. పుస్తక వ్యాపారాన్ని గౌరవప్రదమైన వృత్తిగా భావించిన రామమోహనరావు, ‘చదువుకున్న వారితో పరిచ యాలు పెరిగినకొద్దీ నాకున్న సాహిత్య పరిజ్ఞానం ఎంతటిదో తెలిసింది. బాపు కార్టూన్ల సంకలనాన్ని శ్రీరమణ ముందుమాటతో మొట్టమొదటగా ప్రచు రించే అదృష్టం నాకు దక్కింది. నండూరి రామ మోహనరావుగారి ‘విశ్వ రూపం’ పుస్తకాన్ని నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు ఆవిష్క రించడం మరపురాని ఘట్టం. ‘బాపు రమణీయం’ పుస్తకావిష్కరణ సభ నవోదయ సంస్థకి ఒక తీపి జ్ఞాపకం అనేవారు. కలకత్తాలోని పుస్తకప్రదర్శనకు వెళ్లి వచ్చాక, ‘ఇటువంటి పండుగను యేటా విజ యవాడ నగరంలో నిర్వహిస్తే బాగుంటుంది. అందరూ కలిసి వస్తే అందుకు నేను పెద్దరికం తీసుకుంటాను’ అని పలికి, పాతికేళ్లపాటు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఒక రచయిత పదికాలాల పాటు జీవించి ఉండాలంటే వారి రచనలు పుస్తక రూపంలో ఉండాలి. లేదంటే ఆ వ్యక్తి రచయితగా మరణించినట్లే అనే భావనతో చాలామందిని సజీ వులను చేశారు రామమోహనరావు. 1961 నాటికి గొల్లపూడి మారుతీరావు రచించిన ‘చీకట్లో చీలికలు’ పుస్తకానికి బాపుతో బొమ్మలు వేయించారు. ముళ్లపూడి వెంకటరమణ ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకం అందంగా ముద్రించడంతో, వారికి నవోదయ మీద నమ్మకం కుదిరింది. ‘‘బాపు ఓసారి హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో నన్ను కలవటం నా జీవితంలో మేలి మలుపు. నాటి నుంచి వారిద్దరూ నాకు ఆత్మీ యులు. అందుకే వారితో అవసరానికి మించి అభి మానం పెంచుకున్నాను’’ అని వారిని స్మరించుకునే వారు రామమోహనరావు. శంకరమంచి సత్యం రచించిన ‘అమరావతి కథలు’ (100 కథలు) పుస్త కానికి బాపు చేత బొమ్మలు వేయించాలనుకున్న కలను నెరవేర్చుకున్నారు. ఆకాశవాణి మిత్రుల మాటలలో జరుక్శాస్త్రి పేరు తరచుగా తగిలేది. ‘ఎవరు ఈ జరుక్శాస్త్రి? చదువుదామంటే ఎక్కడా కనబడడేమండీ?’ అనుకుని, సమాచారం సేక రించి, ‘శరత్ పూర్ణిమ’ (కథలు), ‘తనలో తాను’ (వ్యాసాలు), ‘జరుక్శాస్త్రి పేరడీలు’ ప్రచురించారు. ఆరుద్ర కోరికపై, శ్రీరంగం నారాయణబాబు ‘రుధి రజ్యోతి’ ప్రాముఖ్యత తెలియకుండానే ప్రచురిం చడంవల్ల శ్రీశ్రీ, ఆరుద్రల మధ్య సంబంధాలు నిర్దేశించే స్థాయికి చేరింది ఆ ప్రచురణ. 1963లో గోపీచంద్ ఫొటోని క్యాలెండర్‌గా ప్రచురించారు. నవోదయ రామమోహనరావును ఎవరైనా ‘మీరు కమ్యూనిస్టు కదా’ అంటే ‘నేను కమ్యూ నిస్టుని కాదు, హేతువాదిని. నా పిల్లలిద్దరి పెళ్లిళ్లూ రిజిస్ట్రార్ ఆఫీసులోనే చేయించాను. మా అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నప్పుడు గర్విం చాను. మా నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రి యలు నిర్వహించమని ఎంతమంది ఒత్తిడి చేసినా తలొగ్గలేదు. నా తదనంతరం కూడా నా శరీరంలోని అన్నిభాగాలూ వైద్య విద్యార్థులకే ఉపయోగ పడాలన్నది నా కోరిక’ అనేవారు. ఎన్నో ఆదర్శ భావాలు కలిగి, పుస్తక ప్రపంచంలో ఒక శకాన్ని సృష్టించిన నవోదయ రామమోహనరావు, తన ప్రచురణల ద్వారా రచయితతో పాటు చిరయశస్సు సంపాదించుకున్నారు. (బాపు జయంతిరోజునే నవోదయ రామమోహనరావు కాలం చేయడం యాదృచ్ఛికం కావొచ్చు) డాక్టర్ వైజయంతి పురాణపండ -
‘అతిథి’కి అనుమతేది?
సాక్షి, బాన్సువాడ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా రెన్యువల్ ఉత్తర్వులు వెలువడకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడోరేపో ఉత్తర్వులు రాకపోతాయా..అన్న ఆశతో పనిచేస్తున్నారు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. అయితే కళాశాలల్లో శాశ్వత లెక్చరర్లు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. నాలుగు కళాశాలల్లో కలిపి యాభై మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వీరికి గతేడాది ప్రతి నెలా రూ. 21,600 వేతనం అందించారు. సాధారణంగా గతేడాది విధులు నిర్వహించిన వారికే రెన్యువల్ ఇవ్వాల్సి ఉన్నా ఈసారి ఆగస్టు మాసంలో గెస్ట్‌లెక్చరర్ల ఖాళీలు భర్తీ చేయడానికి అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో గెస్ట్‌లెక్చరర్ల ఫోరం నాయకులు కోర్టును ఆశ్రయించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 మంది పాత గెస్ట్ లెక్చరర్లనే కొనసాగించాలని ఉత్తర్వులు వచ్చాయి. అయితే పాత వారిని రెన్యువల్ చేయకుండా విద్యా శాఖ ఉన్నతాధికారులు అప్పీల్‌కు వెళ్లారు. దీంతో రెన్యువల్లో జాప్యం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ‘గెస్ట్’లు.. గత విద్యాసంవత్సరంలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసినవారు ఈ విద్యాసంవత్సరంలో రెన్యువల్ కాకపోయినా.. విధులకు హాజరవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపాల్‌ల కోరిక మేరకు కళాశాలలకు వస్తున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా వేతనాలు లేకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. కళాశాలకు రాకపోకలకు రవాణా ఖర్చులకూ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ తమకు రెన్యువల్ వచ్చేంత వరకు విధులకు రాకుండా ఉంటే విద్యార్థుల చదువులు ముందుకు సాగేవా అని గెస్ట్ లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెస్యువల్ చేసి, వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నా.. నేను ఐదేళ్లుగా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మాథ్స్ గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈ ఏడాది రెన్యువల్ ఉత్తర్వులు రాకున్నా విద్యార్థులకు అన్యాయం జరుగరాదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నా. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు వెలువరించి న్యాయం చేయాలి. – భీమయ్య, మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్, బాన్సువాడ ఉత్తర్వులు రాలేదు గెస్ట్ లెక్చరర్లను ఈసారి రెన్యువల్ చేయలేదు. గతేడాది పనిచేసిన వారినే కొనసాగించాలంటూ కమిషనర్ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా 12 మంది పాతవారు విధులకు హాజరవుతుండడంతో కళాశాలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. ప్రస్తుతం పోస్టుల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కమిషనర్‌నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. – గంగాధర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీకళాశాల, బాన్సువాడ -
గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : జిల్లా యూనిట్‌గా బాలయోగి గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం బుధవారం జరగాల్సిన ఇంటర్వ్యూలు రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ రద్దు ప్రకటన మంగళవారం విడుదల చేసినప్పటికీ అనేక మంది అభ్యర్థులు ఎచ్చెర్లలోని ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరయ్యారు. ఒక్కరోజు ముందు ఇంటర్వ్యూలు ఎలా రద్దు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఏటా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో బాలయోగి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 12 ఉన్నాయి. ఇందులో బాలికలు పాఠశాలలు 8, బాలుర పాఠశాలలు 4 ఉన్నాయి. మొత్తం 107 గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి బోధకులు) అవసరం. పాఠశాల స్థాయి బోధకులకు రూ.14 వేలు, జూనియర్ కళాశాల పరిధిలో పనిచేసే వారికి రూ.18 వేలు వేతనం ఇస్తారు.వాక్ ఇన్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేస్తారు. వీరిని 10 నెలలు కొనసాగిస్తారు.ఈ ఏడాదికి సంబంధించి జిల్లా బాలయోగి గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్టినేటర్ వై.యశోదలక్ష్మి ఇటీవల ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల బాలయోగి గురుకుల పాఠశాలలో బుధవారం ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత వారినే కొనసాగించాలంటూ బాలయోగి గురుకుల రాష్ట్ర కార్యదర్శి రాములు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్వ్యూల రద్దు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలితో పాటు విజయంనగరం జిల్లా నుంచి వందలాది మంది అభ్యర్థులు వచ్చారు. ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ముందు రోజు ఎలా ప్రకటిస్తారని స్థానిక ప్రిన్సిపాల్ ఉషారాణిని నిలదీశారు. కార్యదర్శి ఉత్తర్వుల మేరకు రద్దు చేసినట్లు ఆమె స్పష్టం చేయడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
జీతమెప్పుడొస్తుంది బాబో!
జీతాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల ఎదురుచూపు జిల్లాలో 59 మంది అధ్యాపకుల నియామకం విద్యా సంవత్సరం ముగిసినా పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేసిన అధ్యాపకులకు వేతనాలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న పైసా చెల్లించలేదు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గెస్టు ఫ్యాకల్టీకి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తే చాలా వాటిలో అంత మొత్తంలో డబ్బులు లేవని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. చాలా కళాశాలల్లో అధ్యాపకులు లేరు. రెండేళ్లుగా కాంట్రాక్ట్ బేసిక్‌పై కూడా అధ్యాపకులను నియమించడం లేదు. ఈ నేపథ్యంలో కళాశాలలో ఇంటర్ విద్య మిథ్యగా మారకూడదని ప్రభుత్వం సెప్టెంబర్, నవంబర్ నెలల్లో 59 మందిని గెస్టు ఫ్యాకల్టీలుగా నియమించింది. పిరియడ్‌కు రూ. 150 చొప్పున 68 పిరియడ్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అంతకన్న ఎక్కువ పిరియడ్లను తీసుకుంటే రూ. పది వేలకు మించకుండా చెల్లిస్తారు. పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉన్న యువకులు ఆర్థిక ఇబ్బందులు కలుగతాయనే ఆశతో గెస్టు ఫ్యాకల్టీగా చేరారు. నెలనెలా గౌవర వేతనాన్ని చెల్లిస్తుందనుకుంటే ఆరు నెలలైనా పైసా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యారు. విద్యా సంవత్సరం ముగిసినా అధికారులు గౌవర వేతనం మాటెత్తకపోవడంతో ఆయోమయంలో ఉన్నారు. స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి చెల్లించాలని ఆదేశాలు: మరోవైపు గెస్ట్ ఫ్యాకల్టీలకు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గౌరవ వేతనాలు చెల్లించాలని సోమవారం ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే చాలా కళాశాలల్లో అంత పెద్ద మొత్తంలో నిధులు లేవని, అలాంటి కళాశాలల్లో పనిచేసిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. పది రోజుల్లో చెల్లిస్తాం: కబీరు, డీవీఈఓ గెస్టు ఫ్యాకల్టీలుగా పనిచేసే వారికి స్పెషల్ ఫీజు మొత్తాల నుంచి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం సోమవారం ప్రొసిడింగ్స్‌ను ఇచ్చింది. వారం, పది రోజుల్లో ఇచ్చేస్తాం. అయితే ఏయే కాలేజీలో ఎంత అమౌంటు ఉందో ముందు చూడాలి. తక్కువ మొత్తం ఉంటే మళ్లీ ప్రభుత్వానికి నివేదించాలి. స్పెషల్ ఫీజు గ్రాంట్లు ఉన్న కళాశాలల అధ్యాపకులకు చెల్లిస్తాం. మార్చిలో ఇస్తామన్నారు: ఎల్ల రంగడు, కౌతాళం జూనియర్ నేను నవంబర్‌లో గెస్టు ఫ్యాకల్టీగా కౌతాళం జూనియర్ కళాశాలలో చేరాను. ఇంత వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. మార్చిలో ఇస్తామన్నారు. ప్రస్తుతం మే వచ్చింది. అయినా ఇంతవరకు ఎవరూ ఏమి అనడం లేదు. గెస్ట్ ఫ్యాకల్టీ అభ్యర్థులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి.