సాక్షి ప్రతినిధి నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. గతేడాది పనిచేసిన కాలపు బకాయిలను ఇవ్వకపోవడంతోపాటు ఇప్పుడు కాలేజీలను తెరిచినా విధుల్లోకి తీసుకోకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను ఇటీవల ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. డిగ్రీ అధ్యాపకుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు సబెక్టు బోధించే అధ్యాపకులు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
అవసరం ఉన్నా..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,200 మంది రెగ్యులర్ లెక్చరర్లు, 830 కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వారు కాకుండా అదనంగా మరో 1,940 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగిస్తున్నారు. 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల అవసరం ఉన్నా గత ఏడాది 719 మంది గెస్ట్ లెక్చరర్లనే ఆన్‌లైన్ బోధన కోసం తీసుకున్నారు.
వారికి ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల చొప్పున నెలకు రూ.21,600 గరిష్టంగా చెల్లిస్తున్నారు. గతేడాది రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లతోపాటు గెస్ట్ లెక్చరర్లు కూడా ఆన్‌లైన్ బోధన చేపట్టారు. వారికి ఆ పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటివరకూ అందలేదు. అప్పులు చేసి పూట వెళ్లదీయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
నెల రోజులు అవుతున్నా..
ఈ విద్యా సంవత్సరంలో గత నెలలో వివిధ యూనివర్సిటీల పరిధిలో తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా గెస్ట్ లెక్చరర్లను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఉపాధి ఉంటుందా? లేదా? అన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాల వారీగా గతేడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల సంఖ్య ఇలా..
ఆదిలాబాద్–3, భద్రాద్రి కొత్తగూడెం–17, హైదరాబాద్–133, జగిత్యాల–10, జనగామ–6, జయశంకర్ భూపాలపల్లి–8, జోగులాంబ గద్వాల–32, కామారెడ్డి–29, కరీంనగర్–27, ఖమ్మం–18, కొమురంభీం ఆసిఫాబాద్–6, మహబూబాబాద్–14, మహబూబ్‌నగర్–51, మంచిర్యాల–11, మెదక్–17, మేడ్చల్–14, ములుగు–6, నాగర్‌కర్నూలు–32, నల్లగొండ–46, నారాయణపేట్–17, నిర్మల్–5, నిజామాబాద్ –31, పెద్దపల్లి–10, రాజన్న సిరిసిల్ల–3, రంగారెడ్డి–16, సంగారెడ్డి–45, సిద్దిపేట–51, సూర్యాపేట–4, వికారాబాద్–16, వనపర్తి–20, వరంగల్ రూరల్–3, వరంగల్ అర్బన్–13, యాదాద్రి భువనగిరి–5
Comments
Please login to add a commentAdd a comment