Guest houses
-
అతిథి ఉన్నా.. ఆదాయం కరువు
సాక్షి, అచ్యుతాపురం (విశాఖపట్నం): అతిథి గృహాలున్నా ఆదాయం మాత్రం సున్నా. ఎస్ఈజెడ్ పరిశ్రమలు, కొండకర్ల ఆవ, తంతడి బీచ్ పర్యాటక ప్రదేశాలు ఉన్నందున అతిథి గృహాలకు గిరాకీ ఉంది. పరిశ్రమలకు వచ్చే అతిథులు, పర్యాటకం కోసం వచ్చే ఔత్సాహికులు సేదదీరడానికి అతిథి గృహాల అవసరం ఉంది. అతిథుల తాకిడి ఎక్కువకావడంతో ఇక్కడ ఏడు లాడ్జీలు వెలిశాయి. ఒక్కొక్క గదికి రోజువారి అద్దె రూ.15 వందల వరకూ ఉంది. ఇలా ప్రైవేట్ లాడ్జీలకు రూ.వేలల్లో ఆదాయం వస్తున్నా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన జెడ్పీ అతిథి గృహానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. అద్దెకు ఇస్తారన్న సమాచారం ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ల నుంచి ప్రజాప్రతినిధులు అతిథి గృహాన్ని వాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సొంత జాగీరుగా అతిథి గృహాన్ని వాడుకున్నారు. ఈ అతిథి గృహంలో అన్ని వసతులు ఉన్నందున రోజుకు రూ.ఐదు వేలకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కొండకర్లలో అతిథి గృహ భవనం శిథిలమైంది. గతంలో ఇక్కడి గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దెను అక్కడి వాచ్మెన్ తీసుకొనేవాడు. ఇప్పుడు భవనం శిథిలమవడంతో ఆదాయం రాలేదు. ఉండేందుకు సౌకర్యాల్లేక.. కొండకర్ల, తంతడి బీచ్, అచ్యుతాపురం,చోడపల్లి పరిధిలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం అవసరం ఉంది. పర్యాటక ప్రదేశాలకు కుటుంబ సమేతంగా పర్యాటకులు వస్తున్నారు. వారు సేదదీరడానికి అతిథిగృహాల అవసరం ఉంది. తీరప్రాంతంలో విరివిగా సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. వారికి అతిథిగృహాలు అందుబాటులో లేకపోవడంతో విశాఖకు తరలివెళ్లిపోతున్నారు. పంచాయతీలకు ఆదాయం కరువు మండల పరిషత్ కార్యాలయం వద్ద అతిథిగృహం ఉంది. తంతడిలో రెండు తుపాను షెల్టర్లు ఉన్నాయి. ఎస్ఈజెడ్కు సమీపంలో పూడిమడకలో మూడు తుపాను షెల్టర్లు ఉన్నాయి. తుపాను సమయంలో వీటి అవసరం ఉంటుం ది. అంతవరకూ ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కక్క భవనానికి ప్రభుత్వం రూ.కోటికి మించి వెచ్చించింది. భవనం బాగోగులు చూడకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భవనం వాచ్మెన్లు అనధికారికంగా భవనాన్ని అద్దెకు ఇచ్చి తృణమోపణమో తీసుకుంటున్నారు. తంతడిలో తుపాను షెల్టర్‌ని నెలరోజులు సీరియల్ షూటింగ్‌కి అనధికారికంగా అద్దెకు ఇచ్చారు. గ్రామంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ సొమ్ము స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. పంచాయతీకి ఏమాత్రం ఆదాయం రాలేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తుఫాను షెల్టర్లు గ్రామనాయకుల విలసాలకు అడ్డాగా మారింది. ఆధునిక వసతులతో నిర్మించిన భవనాలలో పేకటరాయుళ్లు దర్జాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గ్రామనాయకుల ఇళ్లలో వేడుకలు జరిగినప్పుడు తుపానుòషెల్టర్లను విడిదిగా వినియోగిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు మండలానికి వచ్చినప్పుడు సేదదీరడానికి మాత్రమే గెస్ట్‌హౌస్‌లు ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి ఆదాయం సమకూరలేదు. ఆదాయం పోతోంది అచ్యుతాపురం పరిసరాలలో చిన్న గదికి రూ.3 వేల అద్దె వస్తుంది. పరిశ్రమలకు వచ్చేవారు. పర్యాటకులకు రోజువారీగా అద్దెకు గెస్ట్ హౌస్‌లు కావాలి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు ఇంతవరకూ అద్దెకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూపాయి ఆదాయం రాలేదు. గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేటు భవనాలను పంచాయతీకి అప్పగించి అద్దెకి ఇస్తే సమృద్ధిగా ఆదాయం వస్తుంది. – సూరాడ ధనరాజు, పూడిమడక అద్దెకు ఇస్తే రూ.వేలల్లో ఆదాయం తంతడిలో పర్యాటకులు సంఖ్య పెరిగింది. షూటింగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట్ల రూపాయలతో నిర్మించిన తుఫాను షెల్టర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని అద్దెకి ఇచ్చి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. పంచాయతీ సిబ్బందిలో ఒకరు భవనాలను అద్దెకు ఇచ్చే ప్రక్రియపై దృష్టిసారించడంతో నెలకు రూ.20వేల ఆదాయం వస్తుంది. ఇకనైనా అధికారులు దృష్టిపెట్టి ప్రస్తుతం ఉన్న ఖాళీభవనాలను అద్దెకు ఇవ్వడంతో ఆదాయం వస్తుంది. పారిశుధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. – చోడిపల్లి దేముడు, తంతడి -
కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం..
న్యూఢిల్లీ: కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం దేశవ్యాప్తంగా 190 అతిథి గృహాలను నిర్మించాలని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) నిర్ణయించింది. ‘బీఎస్ఎఫ్ విధులు చాలా కఠినంగా ఉంటాయి. జవాన్లు తమ సర్వీసులో ఎక్కువ కాలం ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. వారికి ఏడాదిలో రెండున్నర నెలలు మాత్రమే కుటుంబంతో గడిపే సమయం ఉంటుంది. మొత్తంగా 30 ఏళ్లు సర్వీసులో ఉంటే.. అందులో ఐదేళ్లు మాత్రమే కుటుంబంతో ఉంటారు. ఈ నేపథ్యంలో జవాన్లు మరింత ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు సదుపాయాలు కల్పిస్తున్నాం. 186 బెటాలియన్ లొకేషన్లతోపాటు మరికొన్ని చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించనున్నాం. ప్రతి బెటాలియన్ వద్ద 15 స్టూడియో అపార్ట్మెంట్లు నిర్మిస్తాం’ అని బీఎస్ఎఫ్ డైరెక్టర్ కేకే శర్మ వెల్లడించారు. ‘కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్లపై ఒంటరితనం ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. అందుకే ఈ సదుపాయాలు కల్పించడంలో వారికే ప్రాధాన్యం ఇస్తాం. ఓ నిర్ణీత సమయం వరకు అందులో ఉండేందుకు వారికి అనుమతి ఇస్తాం’ అని వివరించారు. తూర్పు, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో 2,800 పైగా గదులను నిర్మించనున్నట్లు తెలిపారు. -
కేజీ టు పీజీ .. గజిబిజి
* ఏడాదిన్నరగా ప్రకటనలే తప్ప చర్యలు చేపట్టని సర్కారు * నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 స్కూళ్ల ఏర్పాటు లక్ష్యం * 2016 జూన్ నుంచి ప్రారంభిస్తామన్నా.. కనీస కార్యాచరణకూ దిక్కులేదు... మిగిలిన సమయం ఇంకా ఎనిమిది నెలలే * ఇప్పుడున్న గురుకులాలు 668.. మోడల్ స్కూళ్లు మరో 187 * మిగతా వాటికి స్థలాలేవీ, ఎక్కడ నిర్మిస్తారు? * గురుకులాలను ఒకే గొడుగు కిందకు తేవడంపైనా అస్పష్టత * బాలికలకే పరిమితమైన కేజీబీవీల్లో బాలురకూ అవకాశమిస్తారా? * విద్యార్థులకు వసతి గృహాల పరిస్థితి ఏమిటి? * గందరగోళంగా మారిన ‘కేజీ టు పీజీ’ పథకం ‘వచ్చే ఏడాది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తాం. ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలి..’ - 2014 సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్ష ‘గురుకులాలను కేజీ టు పీజీలో భాగం చేస్తాం. నియోజకవర్గానికి 10 చొప్పున స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 662 ఉన్నాయి. మరో 528 ప్రారంభిస్తాం..’ - ఆగస్టు 5న ‘కేజీ టు పీజీ’పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పిన అంశం ‘మూడు దశల్లో కేజీ టు పీజీ.. 12వ తరగతి వరకు స్కూళ్లలో తరగతులు. తదనంతరం గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లను అనుసంధానం చేయడం. కేజీ నుంచి 4వ తరగతి వరకు సాధారణ విద్య. 5వ తరగతి నుంచి నివాస వసతితో కూడిన గురుకుల విద్య అందించడమే లక్ష్యం..’ - గత ఏడాది జూలై 1న సీఎస్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కేజీ టు పీజీ’ విద్య గందరగోళంగా మారింది. ప్రాథమిక పాఠశాలల నుంచి పీజీ దాకా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తామన్న హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఆలోచనలు చేస్తోంది. ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తోంది. కానీ ఇంతవరకూ కనీస కార్యాచరణకు మాత్రం దిక్కులేదు. ‘ప్రతిష్టాత్మక పథకం కనుక ఆలస్యమైనా ఫరవాలేదు.. పకడ్బందీగా ప్రారంభించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష..’’ అని మంత్రులు, సీఎం పలు సందర్భాల్లో చె బుతూ వస్తున్నారు. చివరికి 2016 జూన్‌లో ‘కేజీ టు పీజీ’ని ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి మరో ఎనిమిది నెలలు మాత్రమే గడువున్నా... చర్యలు మాత్రం కానరావడం లేదు. - సాక్షి, హైదరాబాద్ పరిపాలన సౌలభ్యం కోసమంటూ.. ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలను చేర్చాలని భావిస్తోంది. కానీ కేజీ టు పీజీలో భాగంగా వీటిని ఒకే పరిధిలోకి తెస్తున్నారా, పాలనపరమైన సౌలభ్యం కోసమే చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఆయా స్కూళ్ల సమస్యలపైనా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గందరగోళంగా మారింది. వచ్చే విద్యా విద్యాసంవత్సరంలోనైనా ‘కేజీ టు పీజీ’ని ప్రారంభిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ స్పష్టత కరువే ‘కేజీ టు పీజీ’ అమలుపై ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనకు ప్రభుత్వవర్గాలే రాలేకపోతున్నాయి. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించే బృహత్తర లక్ష్యమైన ఈ పథకంపై సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేస్తున్నారే తప్ప ఏదీ ఆచరణకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీని వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్)లో ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇందుకు ఇంకా 8 నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ కనీస కార్యాచరణ ప్రారంభం కాలేదు. చివరకు రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు), మోడల్ స్కూల్లు అన్నింటిని ఈ పథకంలో భాగం చేసినా ప్రభుత్వ లక్ష్యం ప్రకారం మరో 351 స్కూళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 44 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 132 గిరిజన సంక్షేమ గురుకులాలు, 95 ప్రభుత్వ గురుకులాలు కలిపి మొత్తంగా 662 స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వం కేజీ టు పీజీ కింద లక్ష్యంగా పెట్టుకున్న స్కూళ్లు 1,190.. అంటే మరో 528 స్కూళ్లు అవసరం. అయితే కేంద్రం మోడల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసినందున రాష్ట్రంలో ఉన్న 187 మోడల్ స్కూళ్లను కూడా వీటితో కలపాలని భావిస్తున్నారు. వీటిని కలిపినా మొత్తంగా 839 స్కూళ్లు మాత్రమే కేజీ టు పీజీకి అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మరో 351 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ఆ స్కూళ్లకోసం స్థలాల సేకరణ కూడా చేపట్టలేదు. మరి స్థలాలు సేకరించేదెప్పుడు, స్కూళ్ల నిర్మాణం, మౌలిక సౌకర్యాలు కల్పించేదెప్పుడు, తరగతులు ప్రారంభించేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బాలికలకే పరిమితమైన 391 కేజీబీవీల్లో బాలురకు కూడా ప్రవేశాలు కల్పిస్తారా, అలాగే కొనసాగిస్తారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇక 12వ తరగతి వరకు ఉన్న 100 మోడల్ స్కూళ్లకు సంబంధించి వాటి ఆవరణలో బాలికలకు హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. మరి వాటిలో బాలురకు హాస్టల్ సదుపాయం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
అమాత్యులే అతిథులు
మంత్రుల నివాసాలుగా అతిథిగృహాలు సబ్‌కలెక్టర్ కార్యాలయం, బరంపార్కులో సమావేశ మందిరాలు ఇప్పటికే పరిశీలించిన మంత్రులు అధికారుల కోసం అద్దె భవనాలు అన్వేషణ ఇక ప్రభుత్వ భవనాల్లోనే సమావేశాలు ఇన్నాళ్లూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సమావేశాలకు బ్రేక్ పడనుంది. ఇకపై ప్రభుత్వ భవనాలైన సబ్‌కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని ఒకటి రెండు అంతస్తులు, బరంపార్కులోని స్థలాలను సమావేశాలకు వినియోగిస్తారు. వివిధ శాఖలకు చెందిన కార్యాలయంలోని మీటింగ్ హాళ్లనే ఆయా మంత్రులు వినియోగించుకుంటారు. విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అతిథి గృహాలు అమాత్యుల నివాసాలుగా మారనున్నాయి. కొంతమంది మంత్రులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు నివసించేందుకు మాత్రం అనువైన భవనాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో అతిథిగృహాల(గెస్ట్‌హౌస్)కు కొద్దిపాటి మరమ్మతులు చేసి మంత్రులకు నివాసాలుగా కేటాయించాలని నిర్ణయించి నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ప్రకటించారు. బరంపార్కును పరిశీలించిన మంత్రులు మున్సిపల్‌మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిరోజులుగా మంత్రులకు అవసరమైన నివాసాల కోసం అన్వేషణ సాగిస్తున్న విషయం విదితమే. వారు ఇటీవీల విడివిడిగా బరంపార్కులోని రూమ్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అతిథిగృహాల సమచారం తెప్పించుకుని పరిశీలించారు. ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రుల నివాసాలకు తగినట్లుగా మరమ్మతులు చేపట్టారు. మిగిలిన అతిథిగృహాలను కూడా సాధ్యమైనంత త్వరలో అమాత్యుల నివాసాలుగా మార్చనున్నారు. అధికారుల కోసం ప్రయివేటు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు, కార్యదర్శి హోదా అధికారులకు అద్దె భవనాలు ఇవ్వనున్నారు. నగరంలో ఆకర్షణీయంగా, అందంగా ఉన్న ఇళ్ల కోసం ఇప్పటికే అధికారులు గాలిస్తున్నారు. భవనాలను అద్దెకు ఇచ్చే ఆలోచన ఉన్న వారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మిని సంప్రదిస్తే అద్దె గురించి చర్చిస్తారు. ప్రభుత్యోగులకు హడ్కో ఇళ్లు హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం హడ్కో 10 వేల ఇళ్లను రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ఇళ్లు తీసుకున్న ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌ను నేరుగా ఆ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హడ్కో నిర్ణయించిన వార్షిక లీజుకు, ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్సుకు ఏదైనా వ్యత్యాసం ఉంటే, దాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రెండు మూడు నెలలల్లో ప్రభుత్యోగులందరినీ విజయవాడ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తుచేస్తోంది. ఇందుకోసం ఒక అధికార కమిటీ కూడా వేస్తోంది. ఉద్యోగులను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తుంది.