అమాత్యులే అతిథులు
మంత్రుల నివాసాలుగా అతిథిగృహాలు
సబ్‌కలెక్టర్ కార్యాలయం, బరంపార్కులో సమావేశ మందిరాలు
ఇప్పటికే పరిశీలించిన మంత్రులు
అధికారుల కోసం అద్దె భవనాలు అన్వేషణ
ఇక ప్రభుత్వ భవనాల్లోనే సమావేశాలు
ఇన్నాళ్లూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సమావేశాలకు బ్రేక్ పడనుంది. ఇకపై ప్రభుత్వ భవనాలైన సబ్‌కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని ఒకటి రెండు అంతస్తులు, బరంపార్కులోని స్థలాలను సమావేశాలకు వినియోగిస్తారు. వివిధ శాఖలకు చెందిన కార్యాలయంలోని మీటింగ్ హాళ్లనే ఆయా మంత్రులు వినియోగించుకుంటారు.
విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అతిథి గృహాలు అమాత్యుల నివాసాలుగా మారనున్నాయి. కొంతమంది మంత్రులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు నివసించేందుకు మాత్రం అనువైన భవనాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో అతిథిగృహాల(గెస్ట్‌హౌస్)కు కొద్దిపాటి మరమ్మతులు చేసి మంత్రులకు నివాసాలుగా కేటాయించాలని నిర్ణయించి నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ప్రకటించారు.
బరంపార్కును పరిశీలించిన మంత్రులు
మున్సిపల్‌మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిరోజులుగా మంత్రులకు అవసరమైన నివాసాల కోసం అన్వేషణ సాగిస్తున్న విషయం విదితమే. వారు ఇటీవీల విడివిడిగా బరంపార్కులోని రూమ్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అతిథిగృహాల సమచారం తెప్పించుకుని పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని మంత్రుల నివాసాలకు తగినట్లుగా మరమ్మతులు చేపట్టారు. మిగిలిన అతిథిగృహాలను కూడా సాధ్యమైనంత త్వరలో అమాత్యుల నివాసాలుగా మార్చనున్నారు.
అధికారుల కోసం ప్రయివేటు భవనాలు
ప్రభుత్వ కార్యాలయాలకు, కార్యదర్శి హోదా అధికారులకు అద్దె భవనాలు ఇవ్వనున్నారు. నగరంలో ఆకర్షణీయంగా, అందంగా ఉన్న ఇళ్ల కోసం ఇప్పటికే అధికారులు గాలిస్తున్నారు. భవనాలను అద్దెకు ఇచ్చే ఆలోచన ఉన్న వారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మిని సంప్రదిస్తే అద్దె గురించి చర్చిస్తారు.
ప్రభుత్యోగులకు హడ్కో ఇళ్లు
హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం హడ్కో 10 వేల ఇళ్లను రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ఇళ్లు తీసుకున్న ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌ను నేరుగా ఆ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హడ్కో నిర్ణయించిన వార్షిక లీజుకు, ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్సుకు ఏదైనా వ్యత్యాసం ఉంటే, దాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రెండు మూడు నెలలల్లో ప్రభుత్యోగులందరినీ విజయవాడ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తుచేస్తోంది. ఇందుకోసం ఒక అధికార కమిటీ కూడా వేస్తోంది. ఉద్యోగులను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తుంది.