సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలతో అలరారే ఉత్తరాంధ్ర పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎల్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగా సాగరతీరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్‌హోటల్‌తో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. రూ.96 కోట్లతో ఎండాడ సమీపంలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ రానుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా.. టూరిజం ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో జరిగిన పర్యాటక ఒప్పందాల్లో సింహభాగం ఇన్వెస్టర్లు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. జీఐఎస్‌లో పర్యాటక రంగానికి సంబంధించి రూ.8,806 కోట్లతో 64 ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు రానున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి.
ఎండాడలో..
సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ఇందుకు కీలకంగా ఉన్న పర్యాటక రంగం ఉపాధి అవకాశాలకు, ఆర్థిక వ్యవస్థకు ఇంజన్‌లా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందుకే.. ప్రపంచస్థాయి లగ్జరీ రిసార్టులు, ఫైవ్‌స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాగరతీరంలో ఎండాడ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్(డీఎఫ్‌బీవోటీ) విధానంలో డెవలపర్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది.
స్టార్ హోటల్‌తో కూడిన భారీ కన్వెన్షన్ సెంటర్
ఎండాడలోని సర్వే నంబర్ 106/1లో 1.78 ఎకరాలు, 106/4లో 0.55 ఎకరాలు మొత్తం 2.33 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. మొత్తం రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో కింద కన్వెన్షన్ సెంటర్, పైన ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్ మొదలు పెట్టిన 36 నెలల్లో పూర్తి చేయాలనే టార్గెట్‌తో ప్రాజెక్టును అప్పగించనున్నారు. 2020–25 టూరిజం పాలసీలో విధానాలను అనుసరిస్తూ.. 33 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా సదరు టెండర్లు దక్కించుకున్న సంస్థే చూసుకోవాలి. వార్షిక రెవెన్యూ షేర్ 8 శాతంగా నిర్ణయించారు. ఈ నెల 22న బిడ్స్ తెరవనున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. విశాఖ పర్యాటకం మరింత వరల్డ్ క్లాస్‌గా మారబోతోంది. విశాఖ తీరానికి ఈ కన్వెన్షన్ సెంటర్ విత్ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రాజెక్టు మరో మణిహారం కానుందని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment