పెందుర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, డీసీపీ–2 సత్యనారాయణ, జీవీంఎసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో సమీక్షించారు. మధ్యాహ్నం ఎయిర్‌పోర్టు నుంచి పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎంను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలిరానుండడంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
చినముషిడివాడ ప్రధాన కూడలి నుంచి పీఠం వరకు ప్రత్యేకంగా రెయిలింగ్ అమర్చారు. మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో నాలుగోసారి పీఠానికి వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు పీఠం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎంను సాదరంగా స్వాగతించేందుకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సీఎం వైఎస్ జగన్ పర్యటన ఇలా..
బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటలకు వస్తారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తారు. రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం పాలుపంచుకుంటారు. అనంతరం 12.55 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment