Guest Lecture
-
ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం
బనశంకరి: ఎస్ఐ పోస్టుల కుంభకోణంలో ఎన్వీ సునీల్‌కుమార్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకువచ్చింది. ముఖ్య నిందితుడు రుద్రేగౌడ పాటిల్ ద్వారా బ్లూ టూత్‌లో సమాధానాలు విని సునీల్ పరీక్ష రాశాడు. దివ్యా హగరగి ఆధీనంలో ఉన్న కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్లో అతడు పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. డీకేతో నిందితురాలి ఫోటో ఎస్ఐ స్కాంలో పరారీలో ఉన్న నిందితురాలు దివ్యా హగరగి కేపీసీసీ అద్యక్షుడు డీకే.శివకుమార్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఆమె బీజేపీ నాయకురాలని, ఆమె ఇంటికి హోంమంత్రి జ్ఞానేంద్ర వెళ్లి సన్మానం పొందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, ఈ ఫోటోలు రావడం విశేషం. గెస్ట్ లెక్చరర్ విచారణ మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మైసూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సౌమ్యను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఒకటవ ఏసీఎంఎం కోర్టులో ఆమెను హాజరుపరిచారు. గతనెల 14 తేదీన భూగోళ శాస్త్రం పరీక్ష రోజున ఉదయమే పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన సౌమ్య మొబైల్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటోలు తీసుకుని లీక్ చేసింది. ఆమె వద్ద ఉన్న ప్రశ్నలు క్రమపద్ధతిలో లేనట్లు తెలిసింది. ఆమె మొబైల్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై విచారణ సాగుతోంది. పేపర్ లీక్ స్కాంలో మైసూరు వర్సిటీలో జాగ్రఫీ గెస్ట్ లెక్చరర్ సౌమ్యా పైన కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ శివప్ప మంగళవారం తెలిపారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. (చదవండి: హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్) -
గెస్ట్ లెక్చరర్లపై చిన్నచూపు
సాక్షి, కామారెడ్డి : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను ఆహ్వానించింది. గతేడాది ఆగస్టు 14న విధుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి గెస్ట్ లెక్చరర్లుగా విధుల్లో చేరిన వారు రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. నిరుద్యోగులుగా ఉన్న తమకు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు దొరికాయని సంబరపడ్డారు. 2018–19 విద్యా సంవత్సరం ముగిసిపోవడమే కాకుండా 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ వారికి వేతనాలు మంజూరు కాలేదు. జీతాలు రాకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 30 మంది... కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 30 మంది గెస్ట్ లెక్చరర్లుగా ఉద్యోగాల్లో చేరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తే ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పద్ధతిని తీసుకువచ్చింది. గెస్ట్ లెక్చరర్లకు వారి పని గంటలను బట్టి వేతనాలను చెల్లించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఒక్కో గెస్ట్ లెక్చరర్‌కు నెలకు రూ.21,600 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గెస్ట్ లెక్చరర్ నెలలో 72 గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సెలవు దినాలకు వేతనం లేదు. ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచి గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం చేస్తుకున్న ఒప్పందం ప్రకారం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని 30 మంది గెస్ట్ లెక్చరర్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు మంజూరు చేయాలి గెస్ట్ లెక్చరర్ల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి. రెగ్యులర్, కాం ట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వం సూచించిన ప్రకారం విధులకు హాజరవుతున్నాం. పాఠాలు భోదిస్తున్నాం. జీతాలు రాకపోవడంతో చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయం గమనించాలి. - రాంప్రసాద్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
‘రేడియో’కు ఉజ్వల భవిష్యత్
ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి రేడియో ప్రసారాలపై గెస్ట్ లెక్చర్ తెయూ(డిచ్పల్లి) : ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ రేడియో మాధ్యమానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో ప్రోగ్రాం ప్రొడక్షన్’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలోనూ అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమంగా రేడియో మరింత ముందుకు పోతోందని పేర్కొన్నారు. రేడియోలో ప్రసారాల రూపకల్పన అత్యంత సవాల్‌తో కూడుకున్నదన్నారు. విద్యార్థులు రేడియోలో కెరీర్ ఎంచుకుని విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. బాలికలు తాము ఎంచుకున్న రంగంలో ఆత్మవిశ్వాసంతో వెళ్లాలన్నారు. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో అడ్డంకులు, సవాళ్లకు ఎదురీదకుండా ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు. తను ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో రేడియో జాకీగా, ఇంటర్నెట్ రేడియో ఖుషీ స్టేషన్లో ఆర్జేగా పని చేసిన రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లు, వృత్తిలో తాను రాణించిన విధానాన్ని ఆమె వివరించారు. మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చి, వారిని ఉత్సాహపరిచారు. రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నిహార కానేటితో గెస్ట్ లెక్చర్ ద్వారా విద్యార్థులకు రేడియో రంగంపై మంచి అవగాహన కలిగిందని వర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి కె.రాజారాం పేర్కొన్నారు. అనంతరం నిహార కానేటిని సన్మానించారు. కార్యక్రమంలో బీవోస్ చైర్మన్ జి.చంద్రశేఖర్, అధ్యాపకులు ప్రభంజన్ యాదవ్, శాంతాబాయి, మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.