సాక్షి, కామారెడ్డి : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను ఆహ్వానించింది. గతేడాది ఆగస్టు 14న విధుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి గెస్ట్ లెక్చరర్లుగా విధుల్లో చేరిన వారు రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. నిరుద్యోగులుగా ఉన్న తమకు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు దొరికాయని సంబరపడ్డారు.
2018–19 విద్యా సంవత్సరం ముగిసిపోవడమే కాకుండా 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ వారికి వేతనాలు మంజూరు కాలేదు. జీతాలు రాకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను మంజూరు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 30 మంది...
కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 30 మంది గెస్ట్ లెక్చరర్లుగా ఉద్యోగాల్లో చేరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తే ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పద్ధతిని తీసుకువచ్చింది. గెస్ట్ లెక్చరర్లకు వారి పని గంటలను బట్టి వేతనాలను చెల్లించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది.
ఆ తర్వాత ఒక్కో గెస్ట్ లెక్చరర్‌కు నెలకు రూ.21,600 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గెస్ట్ లెక్చరర్ నెలలో 72 గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సెలవు దినాలకు వేతనం లేదు. ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచి గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం చేస్తుకున్న ఒప్పందం ప్రకారం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని 30 మంది గెస్ట్ లెక్చరర్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వేతనాలు మంజూరు చేయాలి
గెస్ట్ లెక్చరర్ల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి. రెగ్యులర్, కాం ట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వం సూచించిన ప్రకారం విధులకు హాజరవుతున్నాం. పాఠాలు భోదిస్తున్నాం. జీతాలు రాకపోవడంతో చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయం గమనించాలి.
- రాంప్రసాద్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment