‘రేడియో’కు ఉజ్వల భవిష్యత్
ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి
రేడియో ప్రసారాలపై గెస్ట్ లెక్చర్
తెయూ(డిచ్‌పల్లి) : ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ రేడియో మాధ్యమానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో ప్రోగ్రాం ప్రొడక్షన్’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలోనూ అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమంగా రేడియో మరింత ముందుకు పోతోందని పేర్కొన్నారు. రేడియోలో ప్రసారాల రూపకల్పన అత్యంత సవాల్‌తో కూడుకున్నదన్నారు. విద్యార్థులు రేడియోలో కెరీర్ ఎంచుకుని విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. బాలికలు తాము ఎంచుకున్న రంగంలో ఆత్మవిశ్వాసంతో వెళ్లాలన్నారు. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో అడ్డంకులు, సవాళ్లకు ఎదురీదకుండా ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు.
తను ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో రేడియో జాకీగా, ఇంటర్నెట్ రేడియో ఖుషీ స్టేషన్‌లో ఆర్జేగా పని చేసిన రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లు, వృత్తిలో తాను రాణించిన విధానాన్ని ఆమె వివరించారు.
మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చి, వారిని ఉత్సాహపరిచారు. రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నిహార కానేటితో గెస్ట్ లెక్చర్ ద్వారా విద్యార్థులకు రేడియో రంగంపై మంచి అవగాహన కలిగిందని వర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి కె.రాజారాం పేర్కొన్నారు. అనంతరం నిహార కానేటిని సన్మానించారు. కార్యక్రమంలో బీవోస్ చైర్మన్ జి.చంద్రశేఖర్, అధ్యాపకులు ప్రభంజన్ యాదవ్, శాంతాబాయి, మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.