guest teachers
-
గెస్ట్ టీచర్లపై బోధనేతర భారం!
సాక్షి, అమరావతి : గెస్ట్ టీచర్లు అంటే రెగ్యులర్ టీచర్లు కాదు అని అర్థం. వీరి విధులు కూడా పరిమితంగానే ఉంటాయి.. చెల్లించే వేతనాలు కూడా అంతంతే. కానీ, రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉన్న 1,253 మంది గెస్ట్ టీచర్లపై అపరిమితమైన భారం మోపుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కూటమి సర్కారు వచ్చాక మునుపెన్నడూలేని రీతిలో వీరు అవస్థలు పడుతున్నారు. పేరుకు గెస్ట్ టీచర్లు అయినా వీరు చేయాల్సిన విధులు అన్నీఇన్నీ కావు. రాత్రిపూట విధుల నుంచి డిప్యూటీ వార్డెన్ చేసే పనుల వరకు అన్నీ వీరే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. తక్కువ జీతంతో ఎక్కువ పనిభారం మోస్తున్న ఈ గెస్ట్ టీచర్లు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక ఉద్యోగం పోతుందనే భయంతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్న ఇదో రకం శ్రమ దోపిడి. పగలు బోధన.. రాత్రి కాపలా..నిజానికి.. విద్యార్థులకు నిర్ధేశించిన సబ్జెక్టుల వారీగా బోధించడమే గెస్ట్ టీచర్ల విధి. కానీ, అందుకు విరుద్ధంగా పగలు బోధన.. రాత్రి కాపలా అనే రీతిలో వారిపై ప్రభుత్వం అదనపు బాధ్యతలు మోపుతోంది. ఫలితంగా ఉద్యోగ భద్రత, వేతనం, సరైన సౌకర్యాలు లేకుండానే అవస్థలుపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం తాజాగా రాత్రి విధులు అప్పగించడంపట్ల వీరు ఆవేదన చెందుతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కేటాయించిన గురుకులాల్లో ఉండాలని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘డే స్టడీ–నైట్ స్టే’ పేరుతో రోజుకు ఇద్దరు టీచర్లు రాత్రిపూట విద్యార్థులతో కలిసి ఉంటూ వార్డెన్ తరహా బోధనేతర విధులు కూడా అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులకు గురుకులాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాల్సిన ప్రభుత్వం వీటిని కూడా గెస్ట్ టీచర్లకు అప్పగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లు చేయాల్సిన పనులను కూడా ఆ పోస్టులు భర్తీ చేయకుండా వాటిని ఈ గెస్ట్ టీచర్లకు అప్పగించడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వేతనంలేక వెతలు..ఇదిలా ఉంటే.. ఈ గెస్ట్ టీచర్లకు బడ్జెట్ కేటాయింపు జరగకపోవడంతో గతనెల వేతనాలు చెల్లించలేదు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోతే బతికేది ఎలా అంటూ వీరు వాపోతున్నారు. వాస్తవానికి.. రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్‌కు నెలకు రూ.లక్ష, కాంట్రాక్టు టీచర్‌కు రూ.50 వేలు, గెస్ట్ టీచర్‌కు కేవలం రూ.19వేలు వేతనం చెల్లిస్తున్నారు. పైగా.. గెస్ట్ టీచర్‌కు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా ఉండవు. -
షాకింగ్ ఘటన: పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి 5 ఏళ్లు జైలు శిక్ష
ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేక కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్‌పురకాలన్‌లోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రభాన్ సేన్ గెస్ట్ టీచర్ లక్ష్మీకాంత్ శర్మ అనే వ్యక్తిని పనిలో చేర్చుకునేందుకు రూ. 2 వేల రూపాయాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాన్ సేన్‌ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 30 వేల రూపాయాలు జరిమాన కూడా విధించింది. సదరు గెస్ట్ టీచర్ శర్మ ఈ విషయమై జనవరి 6, 2015న లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజల్లోనే వారు వేసిన ప్లాన్‌లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఈ మేరకు న్యాయమూర్తి సిన్హా మాట్లాడుతూ...ప్రభుత్వ సేవకులు అవినీతికి పాల్పడటం అనేది సమాజంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. అందులోకి ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన భాగం, పైగా అందరికీ మార్గదర్శి. అలాంటి వ్యక్తే అవినీతికి పాల్పడితే సమాజానికే చేటు అంటూ..సదరు ఉపాధ్యాయుడికి ఈ విధంగా శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పక్కా ప్లాన్‌తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ) -
కొత్త గురుకులాల్లో గెస్ట్ టీచర్లు!
‘గురుకుల నోటిఫికేషన్’పై కొరవడిన స్పష్టత సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి నెలన్నర క్రితం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ అందులో పేర్కొన్న నిబంధనలపై క్షేత్రస్థాయి నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో టీఎస్పీఎస్సీ ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ క్రమంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందని అభ్యర్థులు ఆశించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పంద నా లేదు. దీంతో కొత్త విద్యా సంవత్సరం ముంచుకొస్తుండడంతో ఆయా ఖాళీల్లో గెస్ట్‌టీచర్ల(తాత్కాలిక ఉపాధ్యాయులు)ను నియమించుకోవాలని గురుకుల సొసైటీ లు భావిస్తున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే వెను కబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీబీసీఆర్ఈఐ ఎస్) పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జూన్ 12న ప్రారంభించేందుకు ఆ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ.. బోధకులు, సిబ్బంది నియామ కాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఈ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ టీచర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవ త్సరంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారం భం కానున్నాయి. వీటికి 714మంది టీచర్లు అవసరం. రెగ్యులర్ ఉపాధ్యా యులు వచ్చే వరకు గెస్ట్ టీచర్లను, ఔట్సోర్సింగ్ ద్వారా 238 మంది బోధనేతర సిబ్బందిని నియమించుకోనున్నారు. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సొసైటీ భావిస్తోంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘గెస్ట్’ టీచర్లు
న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆరువేల మంది ‘అతిథి ఉపాధ్యాయుల’ను నియమించింది. జాతీయ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని విద్యాశాఖ డెరైక్టర్ పద్మినీ సింఘ్లా తెలిపారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరువేల మంది ఉపాధ్యాయులను ‘అతిథి’ ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. మరో 10 వేల మందిని త్వరలో నియమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలైలో 1981 మంది టీజీటీలను, మరో 284 మంది అసిస్టెంట్ టీచర్లను సర్వ శిక్ష అభియాన్ కింద నియమించినట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో అవసరమైన పోస్టులను ‘ప్రత్యేక’ ప్రాతిపదికన భర్తీచేసేందుకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బి)తో డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిత్యం సంప్రదిస్తోందని పద్మిని తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఉన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగుపరిచేందుకు ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల త్యాగరాజ్ స్టేడియంలో సుమారు 1007 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో బహిరంగ చర్చ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విద్యార్థులకు తగిన బోధన అందించేందుకు వారు తీసుకున్న చర్యలు, బోధనాపద్ధతులపై చర్చించి వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు కృషిచేస్తామన్నారు. 8వ తరగతిలో ‘డిటెన్షన్ పాలసీ’ లేకపోవడంతో విద్యార్థులు ఆ ఏడాది చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించడంలేదని ఆమె అన్నా రు. దీంతో వారు 9వ తరగతిలో చదువుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీంతో 9వ తరగతి నుంచి ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుందని ఆమె వివరించారు.