ప్రభుత్వ పాఠశాలల్లో ‘గెస్ట్’ టీచర్లు
న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆరువేల మంది ‘అతిథి ఉపాధ్యాయుల’ను నియమించింది. జాతీయ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని విద్యాశాఖ డెరైక్టర్ పద్మినీ సింఘ్లా తెలిపారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరువేల మంది ఉపాధ్యాయులను ‘అతిథి’ ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. మరో 10 వేల మందిని త్వరలో నియమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలైలో 1981 మంది టీజీటీలను, మరో 284 మంది అసిస్టెంట్ టీచర్లను సర్వ శిక్ష అభియాన్ కింద నియమించినట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో అవసరమైన పోస్టులను ‘ప్రత్యేక’ ప్రాతిపదికన భర్తీచేసేందుకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్(డీఎస్‌ఎస్‌ఎస్‌బి)తో డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిత్యం సంప్రదిస్తోందని పద్మిని తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఉన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగుపరిచేందుకు ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల త్యాగరాజ్ స్టేడియంలో సుమారు 1007 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో బహిరంగ చర్చ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విద్యార్థులకు తగిన బోధన అందించేందుకు వారు తీసుకున్న చర్యలు, బోధనాపద్ధతులపై చర్చించి వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు కృషిచేస్తామన్నారు. 8వ తరగతిలో ‘డిటెన్షన్ పాలసీ’ లేకపోవడంతో విద్యార్థులు ఆ ఏడాది చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించడంలేదని ఆమె అన్నా రు. దీంతో వారు 9వ తరగతిలో చదువుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీంతో 9వ తరగతి నుంచి ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుందని ఆమె వివరించారు.