బీసీ గురుకులాల్లో సర్కారు శ్రమ దోపిడీ.. తక్కువ జీతం ఎక్కువ పనిభారం
‘డే స్టడీ– నైట్ స్టే’ అంటూ అపరిమిత విధులు
గెస్ట్ టీచర్‌కు నెలకు ఇచ్చేది కేవలం రూ.19వేలే.. చేసేది బండెడు చాకిరి
బడ్జెట్‌లేదనే పేరుతో గతనెల జీతం ఇవ్వని ప్రభుత్వం
రాష్ట్రంలో 1,253 మంది గెస్ట్ టీచర్లు గగ్గోలు
సాక్షి, అమరావతి : గెస్ట్ టీచర్లు అంటే రెగ్యులర్ టీచర్లు కాదు అని అర్థం. వీరి విధులు కూడా పరిమితంగానే ఉంటాయి.. చెల్లించే వేతనాలు కూడా అంతంతే. కానీ, రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉన్న 1,253 మంది గెస్ట్ టీచర్లపై అపరిమితమైన భారం మోపుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కూటమి సర్కారు వచ్చాక మునుపెన్నడూలేని రీతిలో వీరు అవస్థలు పడుతున్నారు.
పేరుకు గెస్ట్ టీచర్లు అయినా వీరు చేయాల్సిన విధులు అన్నీఇన్నీ కావు. రాత్రిపూట విధుల నుంచి డిప్యూటీ వార్డెన్ చేసే పనుల వరకు అన్నీ వీరే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. తక్కువ జీతంతో ఎక్కువ పనిభారం మోస్తున్న ఈ గెస్ట్ టీచర్లు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక ఉద్యోగం పోతుందనే భయంతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్న ఇదో రకం శ్రమ దోపిడి.
పగలు బోధన.. రాత్రి కాపలా..
నిజానికి.. విద్యార్థులకు నిర్ధేశించిన సబ్జెక్టుల వారీగా బోధించడమే గెస్ట్ టీచర్ల విధి. కానీ, అందుకు విరుద్ధంగా పగలు బోధన.. రాత్రి కాపలా అనే రీతిలో వారిపై ప్రభుత్వం అదనపు బాధ్యతలు మోపుతోంది. ఫలితంగా ఉద్యోగ భద్రత, వేతనం, సరైన సౌకర్యాలు లేకుండానే అవస్థలుపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం తాజాగా రాత్రి విధులు అప్పగించడంపట్ల వీరు ఆవేదన చెందుతున్నారు.
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కేటాయించిన గురుకులాల్లో ఉండాలని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘డే స్టడీ–నైట్ స్టే’ పేరుతో రోజుకు ఇద్దరు టీచర్లు రాత్రిపూట విద్యార్థులతో కలిసి ఉంటూ వార్డెన్ తరహా బోధనేతర విధులు కూడా అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పనులకు గురుకులాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాల్సిన ప్రభుత్వం వీటిని కూడా గెస్ట్ టీచర్లకు అప్పగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లు చేయాల్సిన పనులను కూడా ఆ పోస్టులు భర్తీ చేయకుండా వాటిని ఈ గెస్ట్ టీచర్లకు అప్పగించడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేతనంలేక వెతలు..
ఇదిలా ఉంటే.. ఈ గెస్ట్ టీచర్లకు బడ్జెట్ కేటాయింపు జరగకపోవడంతో గతనెల వేతనాలు చెల్లించలేదు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోతే బతికేది ఎలా అంటూ వీరు వాపోతున్నారు. వాస్తవానికి.. రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్‌కు నెలకు రూ.లక్ష, కాంట్రాక్టు టీచర్‌కు రూ.50 వేలు, గెస్ట్ టీచర్‌కు కేవలం రూ.19వేలు వేతనం చెల్లిస్తున్నారు. పైగా.. గెస్ట్ టీచర్‌కు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కూడా ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment