వారెవ్వా హన్సిక!
తమిళసినిమా: ఆలోచనలకు సాన పడితే అద్భుతాలు సాక్షాత్కరిస్తాయి. నటి హన్సిక కూడా అదే చేశారు. ఈమె తన చక్కని నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్న హన్సికకు ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువే. తన ఈ మధ్య ప్రభుదేవాతో కలిసి నటించిన గులేబాకావళి చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను పొందింది. అయితే ప్రస్తుతం హన్సికకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నది నిజం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మలో మరో టాలెంట్ కూడా మెండుగా ఉంది. అవును మంచి నటే కాదు మంచి చిత్రకారిణి కూడా. చిత్రలేఖనాలంటే ఎంతో మక్కువ. షూటింగ్ లేని సమయాల్లో కుంచె చేతబట్టి క్యాన్వాస్పై తన మనసులోని భావాలకు అబ్బురపరిచే రూపాలను ఇస్తుంటారు. అవి మోసిన చిత్ర కళాకారుడి కళారూపాలకు దీటుగా ఉంటాయి. అలా తన మనసులోని ఆలోచనలకు రూపం ఇచ్చిన ఒక చిత్రలేఖనాన్ని హన్సిక సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.ఆ చిత్ర లేఖనం పలువురి ప్రశంసలను అందుకుంటోంది.
ఈమె తాను రూపొందించిన కళాకృతుల గురించి పలు మార్లు చెప్పారు కానీ, వాటిని ఏనాడు ప్రదర్శించలేదు. ప్రదర్శనలకు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం చెప్పారు. దీంతో ఆమెలోని చిత్రకారిణి గురించి ఎవరూ పెద్దగా ఊహించలేదు. అలాంటిది హన్సిక కుంచెతో రంగులద్దిన బుద్ధుడి చిత్రలేఖనం కళాహృదయులను రంజింపజేస్తోంది. ఆహా హన్సికలో ఇంత గొప్ప ఆర్ట్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రముఖ హాస్య నటుడు వివేక్ లాంటి వారు తను కళా రూపకాలకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచనలిస్తున్నారు. అలా వచ్చిన నిధిని సమాజసేవకు ఉపయోగించవచ్చునని ట్విట్టర్లో సలహా ఇస్తున్నారు. అందుకు బదులిస్తూ వారికి థ్యాంక్స్ చెబుతూ తనకు అలాంటి ఆలోచన ఉందని హన్సిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ అందాల భామ సామాజిక సేవలోనూ ముందే ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 23 ఏళ్ల అమ్మాయి 30 మంది పిల్లలకు అమ్మ అయ్యారు. అవును హన్సిక 30 మంది అనాథ పిల్లలను చేర దీసి వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లతోనే గడుపుతానంటున్న హన్సిక 30 మంది పిల్లలు తనను అమ్మ అనే పిలుస్తారని, అంత మందికి అమ్మ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వారందరికీ ఒక ఆశ్రమాన్ని కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హన్సిక తెలిపారు. వారెవ్వా హన్సికా!