మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది.
జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం.
22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది?
మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది.
జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది.
‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు.
మంజు జంకలేదు
‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా?
ఎందుకు?
ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు.
వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం.
ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా.
ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి.
– మంజూ ఉరవ్