Gummalaxmipuram
-
గుమ్మలక్ష్మీపురం ఘటనపై మంత్రి సీరియస్.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణను తక్షణమే విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత క్రిమినల్ కేసు నమోదుకు కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. చదవండి: (హైస్కూల్ టీచర్ నిర్వాకం... చర్యలు తీసుకోని పోలీసులు) -
ఏమైందో? ఏమో?.. చింతచెట్టుకు వేలాడుతూ..
గుమ్మలక్ష్మీపురం (శ్రీకాకుళం): మండలంలోని సంధిగూడ గ్రామంలో యువతి మండంగి సంధ్య (25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై షన్ముఖరాజు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో సుమారు నాలుగుసార్లు లక్ష్మణ్ ఇంటికి సంధ్య వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా లక్ష్మణ్ ఇంటికి ఆమె రాగా వారిద్దరి మధ్య కొద్దిపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురై లక్ష్మణ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ పట్టుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇటీవల పలు పోస్టులకు ప్రకటనలు రావడంతో దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు అవసరమై సంధ్యకు ఫోన్ చేసి ఇవ్వాల్సిందిగా లక్ష్మణ్ కోరినప్పటికీ నిరాకరించింది. దీంతో గొహిది సర్పంచ్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్ ఆమెతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించాడు. చదవండి: (నాన్నా నన్ను క్షమించు... చాలా సార్లు ఇబ్బంది పెట్టాను!) ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడ వచ్చింది. ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి, పరిశీలించి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చెట్టును ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి
గుమ్మలక్ష్మీపురం(విజయనగరం): వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఎల్విన్‌పేటకు చెందిన గంట డానియల్(15), బొద్దిగ లోకేష్(15) తాడికొండలో జరుగుతున్న జాతరకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. -
కుటుంబ సభ్యులు మందలించారని గిరిజన యువతి ఆత్మహత్య
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : పురుగుమందు తాగి గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని పి.ఆమిటి పంచాయతీ మొరమగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుమలత(22) అనే యువతి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు... అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సుమలతకు తల్లి బిడ్డిక బంగారమ్మ, అన్న, వదిన ఉన్నారు. ఆమె భద్రగిరి పీటీజీ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్, కురుపాంలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలంటుండేదని, కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్‌గా పనికి కుదిరిందని బంధువులు తెలిపారు. అన్న మందలించాడని... విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట ఎస్సై ఎస్.ఖగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పొలం పనులకు వెళ్లాలని అన్నయ్య ఆనందరావు సుమలతను మందలించాడని, ఈ విషయంపై స్వల్ప గొడవలు కూడా పడ్డారని, దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షణికావేశాలకు బలవుతున్న గిరిజన యువతులు.. ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారన్న క్షణికావేశం.. ప్రేమ విఫలం వంటి సంఘటనలతో గిరిజన యువతులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో మండలంలో ముగ్గురు గిరిజన యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏప్రిల్ 21న లుంబేసు పంచాయతీ లప్పటి గ్రామానికి చెందిన తోయల నీలమ్మ అనే యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 10న ఎల్విన్‌పేట పంచాయతీ జేకే పాడు కాలనీకికి చెందిన నిమ్మక గౌరీశ్వరి, ఆమె ప్రియుడు రాజారమేష్‌లు పురుగు మందు తాగారు. ఈ ఘటనలో గౌరీశ్వరి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే.. కుటుంబ సభ్యులు మందలించారని సుమలత అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు గిరిజన సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.