కుటుంబ సభ్యులు మందలించారని గిరిజన యువతి ఆత్మహత్య
Published Wed, Sep 25 2013 5:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : పురుగుమందు తాగి గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని పి.ఆమిటి పంచాయతీ మొరమగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుమలత(22) అనే యువతి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు... అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సుమలతకు తల్లి బిడ్డిక బంగారమ్మ, అన్న, వదిన ఉన్నారు. ఆమె భద్రగిరి పీటీజీ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్, కురుపాంలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలంటుండేదని, కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్‌గా పనికి కుదిరిందని బంధువులు తెలిపారు.
అన్న మందలించాడని...
విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట ఎస్సై ఎస్.ఖగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పొలం పనులకు వెళ్లాలని అన్నయ్య ఆనందరావు సుమలతను మందలించాడని, ఈ విషయంపై స్వల్ప గొడవలు కూడా పడ్డారని, దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
క్షణికావేశాలకు బలవుతున్న గిరిజన యువతులు..
ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారన్న క్షణికావేశం.. ప్రేమ విఫలం వంటి సంఘటనలతో గిరిజన యువతులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో మండలంలో ముగ్గురు గిరిజన యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏప్రిల్ 21న లుంబేసు పంచాయతీ లప్పటి గ్రామానికి చెందిన తోయల నీలమ్మ అనే యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 10న ఎల్విన్‌పేట పంచాయతీ జేకే పాడు కాలనీకికి చెందిన నిమ్మక గౌరీశ్వరి, ఆమె ప్రియుడు రాజారమేష్‌లు పురుగు మందు తాగారు. ఈ ఘటనలో గౌరీశ్వరి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే.. కుటుంబ సభ్యులు మందలించారని సుమలత అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు గిరిజన సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement