ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విచారణలో ఉన్న నిందితుడు రికార్డు రూంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం గాజులరేగకు చెందిన బేతా రాంబాబు అలియాస్ సురేష్ (44) ఈ నెల 7న నెల్లిమర్లలోని ఉపాధి హామీ కార్యాలయంలో జరిగిన బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడు. గురువారం నెల్లిమర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపర్చేందుకు సిద్ధమయ్యారు. తనకు బెయిల్ మంజూరు ఇప్పించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదన్న విషయాన్ని తెలుసుకున్న రాంబాబు మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత సెంట్రీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లారు.
ఆ సమయంలో అందుబాటులో ఉన్న తాడుతో రికార్డు రూంలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని రాంబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతన్ని విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీస్‌స్టేషన్‌లో రాంబాబు ఆత్మహత్య ఉదంతంపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం ఆర్‌డీవో భవానీశంకర్ కేంద్రాస్పత్రిలోని న్యూమోడరన్ మార్చురీలో ఉన్న రాంబాబు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆరా తీశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment