డీఎస్పీ గన్‌మన్ మృతి
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ గన్‌మన్ (ఏఆర్ కానిస్టేబుల్) సుల్తాన్ (30) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విధినిర్వహణలో భాగంగా ఉదయమే డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అతను డ్రస్ మార్చుకునేందుకు కార్యాలయం పైభాగంలో ఉన్న రేకుల షెడ్లోకి వెళ్లాడు. రేకుల షెడ్ నుంచి వేలాడదీసిన ఇనుప తీగపై ఆరేసిన టవల్‌ను సుల్తాన్ అందుకుంటుడగా అప్పటికే వర్షం కురుస్తుండడం పాత విద్యుత్ తీగల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై నేలపై పడి పోయాడు.
పక్కనే ఉన్న మరో గన్‌మన్ గమనించి అందరిని అప్రమత్తం చేశాడు. సుల్తాన్‌ను స్థానిక ప్రవేట్ వైద్యుడు గౌరినాథ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఇతను కర్నూలు మండలం బి. తాండ్రపాడు నివాసి. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మిడుతూరు పోలీసు స్టేషన్ అటాచ్డ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ డీఎస్పీ గన్‌మన్‌గా ఉన్నారు. పది రోజుల క్రితం ఇతనికి డివిజన్ నుంచి బదిలీ అయినట్టు తెలిసింది. అయితే ఏవో కారణాలతో అతన్ని డివిజన్ నుంచి రిలీవ్ చేయలేదు. సమాచారం అందుకున్న డీఎస్పీ సుప్రజ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాల తెలుసుకున్నారు. కన్నీరుపెట్టుకుంటు బోరున విలపించారు.
సుల్తాన్ మృతదేహాన్ని సందర్శించిన ఎస్పీ:
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవి కృష్ణ ఆత్మకూరు చేరుకుని సుల్తాన్ మృతదేహాన్ని సందర్శించారు. శరణ్య క్లినిక్‌లో ఉన్న సుల్తాన్ మృతదేహానికి ఆయన ఘనంగా నివాళ్లులర్పించారు. అనంతరం డీఎస్పీ సుప్రజతో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులు డాక్టర్ గౌరీ నాథ్‌తో కూడా ఆయన మాట్లాడారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ లోకేష్ కుమార్, వెంకట సుబ్బయ్య, సుధాకరరెడ్డి కూడా సుల్తాన్‌కు నివాళ్లు అర్పించారు.