గుర్మీత్ అకౌంట్ క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో జైలు పాలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఓ వైపు గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు కాగ, మరోవైపు గుర్మీత్ మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా భారత్‌లో నిలిపివేశారు. ఈ నిలుపుదలతో భారత్‌లో ఆయన ఫాలోవర్స్ ఎవరూ గుర్మీత్ అకౌంట్‌ను యాక్సస్ చేయడం కానీ, ట్వీట్లు చూడటం కానీ వీలుపడదు. అయితే భారత్‌లో మాత్రమే ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేశారు. విదేశీయులు మాత్రం డేరా సచ్చా సౌదా పోస్టులను చూడవచ్చు. ఇప్పటివరకు గుర్మీత్‌కు 3.6 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఫాలోవర్స్ అభ్యర్థన మేరకు ఆయన అకౌంట్‌ను బ్లాక్చేశామని హర్యానాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. డేరాతో సంబంధమున్న ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వారు చూడటానికి ఇష్టపడుట లేదని పేర్కొన్నారు. @గుర్మీత్రామ్రహీమ్ ఖాతా నిలిపివేయబడింది అనే మెసేజ్ మాత్రమే ఆయన అకౌంట్ పేజీలో ప్రస్తుతం దర్శనమిస్తోంది. ఆయన ట్వీట్లు ఏమీ కనిపించడం లేదు. ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో దోషిగా తేలిన వివాదస్పద డేరా చీఫ్ గుర్మీత్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్ తీర్పు నేపథ్యంలో ఉత్తర భారతం ఉడికిపోయింది. పంజాబ్, హర్యానాలో గుర్మీత్ మద్దతుదారులు ఆందోళనలు చేశారు.