అర్జునుడి గురుదక్షిణ
పురానీతి
భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణుడు. తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేసేవాడు. భరద్వాజుడికి పాంచాల దేశాధీశుడు పృషతుడు చిరకాల మిత్రుడు. తన కొడుకు ద్రుపదుడిని భరద్వాజుడి ఆశ్రమంలో చేర్చాడు. ద్రోణుడు, ద్రుపదుడు సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేసేవారు. కొంతకాలానికి పృషతుడు కాలం చేయడంతో ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్లి, పట్టాభిషిక్తుడై రాజ్యభారం మోయాల్సి వచ్చింది. అస్త్రవిద్యపై ఆసక్తి గల ద్రోణుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం చాలించుకున్న తర్వాత అగ్నివేశుడనే ముని వద్ద చేరి అస్త్రవిద్యను అభ్యసించాడు. ద్రోణుడి శుశ్రూషకు అగ్నివేశుడు సంతసిల్లాడు.
ద్రోణుడికి ధనుర్వేదాన్ని ఆమూలాగ్రంగా నేర్పించాడు. అగ్నివేశుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ద్రోణుడికి భరద్వాజుడు కృపి అనే కన్యతో వివాహం జరిపించాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. సంసారభారం మీద పడటంతో ద్రోణుడికి ద్రవ్యార్జన అనివార్యంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రోణుడికి పరిస్థితులు కలసిరావడం లేదు.
క్షత్రియులను నిర్జించిన పరశురాముడు సంపదనంతా బ్రాహ్మణులకు పంచిపెడుతున్నట్లు విన్న ద్రోణుడు. పరశురాముడిని వెదుక్కుంటూ బయలుదేరాడు. మహేంద్రగిరిపై తపోనిష్టలో ఉన్న పరశురాముడిని కలుసుకున్నాడు. ‘ఎవరివి నీవు? ఎందుకు వచ్చావు?’ అని పరశురాముడు ప్రశ్నించగా, ‘నేను భరద్వాజుడి కుమారుడను. విత్తాపేక్షతో వచ్చాను’ అని బదులిచ్చాడు ద్రోణుడు. అందుకు పరశురాముడు చాలా విచారించాడు. ‘తరుణం మించిన తర్వాత వచ్చావు నీవు. నా వద్దనున్న సంపదనంతా ఇతరులకు పంచిపెట్టేశాను. నా వద్ద ప్రస్తుతం దివ్యాస్త్ర శస్త్రాలు తప్ప మరేమీ లేవు’ అని అన్నాడు.
‘మహాత్మా! వాటినే అనుగ్రహించండి’ అని పలికిన ద్రోణుడు పరశురాముడి నుంచి అస్త్ర శస్త్రాలను తీసుకుని ఇంటికి వచ్చాడు. అస్త్రశస్త్రాలు ఆకలి తీర్చలేవు కదా! ఇంట్లో పసిబాలుడైన అశ్వత్థామ ఆకలికి అల్లాడిపోతున్నాడు. అలాంటి విపత్కర పరిస్థితిలో ద్రోణుడికి బాల్యమిత్రుడైన ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. సహాయం చేస్తాడనే ఆపేక్షతో పాంచాల రాజధానికి బయలుదేరాడు. ద్రుపదుడి సభకు వెళ్లాడు. ద్రోణుడెవరో గుర్తించనట్లే నటించాడు ద్రుపదుడు. ద్రోణుడు తనను తాను పరిచయం చేసుకుని, బాల్యస్మృతులను గుర్తుచేస్తే, ‘మహారాజునైన నేనెక్కడ. దరిద్రుడవైన నీవెక్కడ’ అంటూ తూలనాడాడు. అవమాన భారంతో ద్రోణుడు వెనుదిరిగాడు.
కొంతకాలం గడిచాక బావమరిది అయిన కృపాచార్యుడి సహాయంతో ధృతరాష్ట్రుడి వద్ద కొలువు పొందాడు. పాండు తనయులకు, కౌరవులకు అస్త్రవిద్య నేర్పించాడు. వారిలో పాండవ మధ్యముడు అర్జునుడు మేటిగా తయారయ్యాడు. గురుదక్షిణ ఏమివ్వాలని కోరారు శిష్యులు. ద్రుపదుడు తనకు చేసిన అవమానాన్ని వివరించి, అతడికి గుణపాఠం చెబితే చాలన్నాడు ద్రోణుడు. పాండవులు, కౌరవులు అస్త్రధారులై పాంచాల దేశాన్ని ముట్టడించారు. ద్రుపదుడు స్వయంగా రణరంగంలోకి దిగి వీరవిహారం మొదలుపెట్టాడు. కౌరవులు అతడి ధాటికి తాళలేక పరుగులు తీశారు.
పరిస్థితిని గమనించిన అర్జునుడు నేరుగా ద్రుపదుడితో తలపడ్డాడు. ద్రుపదుడిని నిరాయుధుడిగా చేసి పట్టి బంధించి తెచ్చి ద్రోణుడి సమక్షంలో నిలిపాడు. ‘గురూత్తమా! ఇదిగో నా గురుదక్షిణ’ అని పలికాడు. ద్రోణుడు విజయ దరహాసం చిందిస్తూ ద్రుపదుడిని తేరిపార చూశాడు. ‘ఓహో! ద్రుపద మహారాజా! ఇప్పటికైనా మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొందురా?’ అని పలికాడు. అవమాన భారంతో తలదించుకున్నాడు ద్రుపదుడు. ‘ఇకనైనా బ్రాహ్మణులను అవమానించకు’ అని హితవు పలికి అతడిని విడిచిపుచ్చాడు ద్రోణుడు.