ప్రభుత్వ ఉగాదికి దుర్గగుడి మార్కు..!
నగరంలోని ‘నాక్’లో ఉత్సవాలు
ఉగాది పచ్చడి దేవస్థానం నుంచే..
అర్చకులు, వేదపండితులు, సిబ్బంది సేవలు
విజయవాడ : నగరంలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం నిర్వహించే దుర్ముఖి నామ ఉగాది ఉత్సవాల్లో దుర్గగుడి మార్కు కనపడుతోంది. వేడుకలను సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను దుర్గగుడి అర్చకులు, వేదపండితులు, సిబ్బందే నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్, స్థానాచార్య విష్ణుబోట్ల శివప్రసాద్తోపాటు సుమారు ఆరేడుగురు అర్చకులు, పరిచారకలు, అదే సంఖ్యలో వేదపండితులు ప్రభుత్వ ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మినిస్టీరియల్ సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వీవీఐపీలకు, ప్రజలకు కావాల్సిన ఉగాది పచ్చడిని దేవస్థానం నుంచే పంపుతున్నారు. అంతేకాకుండా కొంతమంది వీవీఐపీలకు దేవస్థానం ప్రసాదాలను కూడా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
దేవస్థానానికి వీవీఐపీల తాకిడి?
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులంతా నగరంలోనే ఉంటున్నందున ఉగాది రోజున వీఐపీలకు తాకిడి బాగానే ఉంటుందని దేవస్థానం అర్చకులు అంచనాలు వేస్తున్నారు. వచ్చేవారికి ఆలయ మర్యాదలో సత్కరాలు, దర్శనాలకు సిద్ధం చేస్తున్నారు. మరో వైపు సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత్వరగా అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పంచాగ శ్రవణంపెతైలుగు తమ్ముళ్ల పెత్తనం
దుర్గగుడిలో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా ఈవో ఆధ్వర్యంలో ఉగాది పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ ఏడాది అలాగే నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి వాస్తు, జ్యోతిష్యం చెబుతున్న ఒక సిద్ధాంతి చేత ఇంద్రకీలాద్రిపై పంచాగ శ్రవణం చేయించి, దేవస్థానం ఖాతా నుంచి నజరానా ఇప్పించాలని నగరానికి చెందిన కొంతమంది రాష్ట్రస్థాయి అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. దీనిపై కమిషనర్ కార్యాలయం నుంచి కూడా సిఫార్సు చేయించారు. ఆ సిద్ధాంతిని ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చి ఆయన ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని నేతల ఆలోచన. అయితే దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇటీవలే దేవస్థానానికి విశ్వనాథ్ ఆస్థాన సిద్ధాంతిగా నియమితులయ్యారు. ఆయనతోనే పంచాంగ శ్రవణం చేయిస్తానంటూ తెలుగు తమ్ముళ్లకు, ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.