Gusa Gusa
-
ఒవైసీపై రాంగోపాల్ వర్మ పోటీ?
మజ్లిస్ కోటను బద్దలుకొట్టడం బీజేపీకి సాధ్యమేనా? పాతబస్తీలో పాగా వేయడానికి కమలనాథులు ఓ ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? ఎంఐఎం అధినేత, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టేందుకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను బరిలోకి దించాలనుకుంటున్నారా? జాతీయ మీడియా ఇదే మాట చెబుతోంది. స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సూచనల మేరకు నేరుగా బీజేపీ అభ్యర్థిగా కాకుండా, శివసేన తరఫున రాంగోపాల్ వర్మను పోటీకి నిలబెట్టి, ఎన్డీయే అభ్యర్థిగా చూపించేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే రాంగోపాల్ వర్మ ఇటీవల రౌడీ చిత్రం ఆడియో ఆవిష్కరణ సమయంలో మాత్రం కొంత భిన్నంగా కనిపించారు. దండలు వేయించుకున్నారు, మోహన్‌బాబును స్నేహితుడు అంటూ పొగిడారు కూడా. మోహన్‌బాబు బుధవారం నాడు గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీని కలుస్తున్నారు. బహుశా ఆ సందర్భంలో వాళ్లిద్దరి మధ్య రాంగోపాల్ వర్మ గురించిన చర్చ కూడా రావచ్చనేది విశ్వసనీయ సమాచారం. బీజేపీ తరఫున కాకుండా శివసేన అభ్యర్థిగా వర్మను రంగంలోకి దింపాలన్నది కూడా మోడీ వ్యూహమేనని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఒకరిని తమ పార్టీ తరఫున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్న విషయాన్ని శివసేన వర్గాలు కూడా ధ్రువీకరించాయి. "@PawanKalyan: congress hataav desh bachaav... .chiranjeevi hataav raashtr bachaav — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2014 1984లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎంకు ఇచ్చినప్పటినుంచి ఈ లోక్‌సభ స్థానం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒవైసీ సోదరులు ఇంతకుముందు మోడీని దమ్ముంటే హైదరాబాద్ రావాలని సవాలు చేశారు గానీ, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. అప్పట్లో మోడీ వచ్చినప్పుడు ఆయన్ను కలిసిన సినీ ప్రముఖులలో రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. మోడీని పవన్ కల్యాణ్ కలవబోతున్నట్లు ట్విట్టర్లో మొట్టమొదట తెలిపింది కూడా వర్మే. అంటే.. ఎప్పటినుంచో మోడీతో వర్మ టచ్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే వర్మను ఒవైసీ మీద పోటీకి నిలబెట్టొచ్చని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి!! -
ఇదీ బెట్టింగే...
గుసగుసలు: క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాదు, బెట్టింగుల జోరు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ముఖ్యమైన నేతల్లో ఎవరికెంత మెజారిటీ వస్తుంది..? వంటి అంశాలపై బెట్టింగులకు దిగుతుంటారు. తెలంగాణలో ఒకరకంగా, సీమాంధ్రలో మరోరకంగా పార్టీల జయాపజయాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ పరస్పరం బెట్టింగుకు దిగారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ, ‘సమైక్య’ చాంపియన్‌గా ప్రచారం పొందేందుకు చివరి వరకు విఫలయ్నతం చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి, విభజన నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయా? జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయా? అనే దానిపై ఇద్దరు నేతలూ మాటా మాటా పెంచుకుని లక్షల్లోనే బెట్టింగ్‌కు దిగారు. ఇదంతా గమనిస్తూ పక్కనే ఉన్న మరో ఇద్దరు నేతలు క్రికెట్ బెట్టింగుల కంటే ఇదేదో ఆసక్తికరంగా ఉందే! అంటూ వ్యాఖ్యానించారు. -
టీడీపీని వీడే యోచనలో ఎంపీ మోదుగుల!
గుంటూరు: నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన చంద్రబాబునాయుడు పెట్టిన శీలపరీక్షలో నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ ఆయన్ను తీవ్రంగా అవమానించింది. నరసరావుపేట నుంచి మళ్లీ పోటీచేస్తానని, అక్కడ వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న అయోధ్యరామిరెడ్డి తన బావ అయినప్పటికీ వెనుకాడబోనని ఆయన చంద్రబాబును కలిసి స్పష్టంచేసినా, గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు అధినేత యోచిస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ వేణుగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని మోదుగుల స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీని వీడనున్నారని భావిస్తున్నారు. అవసరమైతే నరసరావుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఆయన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.