టీడీపీని వీడే యోచనలో ఎంపీ మోదుగుల!
గుంటూరు: నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన చంద్రబాబునాయుడు పెట్టిన శీలపరీక్షలో నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇటీవల ఈ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ ఆయన్ను తీవ్రంగా అవమానించింది.
నరసరావుపేట నుంచి మళ్లీ పోటీచేస్తానని, అక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అయోధ్యరామిరెడ్డి తన బావ అయినప్పటికీ వెనుకాడబోనని ఆయన చంద్రబాబును కలిసి స్పష్టంచేసినా, గుంటూరు పశ్చిమ లేదా బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు అధినేత యోచిస్తున్నారు.
దీంతో ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ వేణుగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని మోదుగుల స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీని వీడనున్నారని భావిస్తున్నారు. అవసరమైతే నరసరావుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఆయన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.