gv. Prakaskumar
-
జీవీ కొత్త చిత్రం ప్రారంభం
యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఎనకు ఇన్నోరు పేర్ ఇరుక్కు కుమారు చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం జీవీ బ్రూస్లీ, కడవుల్ ఇరుకురాన్ కుమారూ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా జీవీ హీరోగా మరో చిత్రం ఆదివారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎంఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం ముత్తుసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, తంబిరామయ్య, రోబోశంకర్, అరుణ్రాజ్కుమార్, ఆర్జే.బ్లేడ్.శంకర్, ఆర్జే మిర్చి విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీనే సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పీకే.వర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి ఎం.సురేశ్‌రాజ్, అరుణ్ పురుషోత్తమన్, టి.రఘనాథన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు నటులు ప్రసన్న, శ్యామ్, రాంకీ, నిరోషా దంపతులు, దర్శకుడు విజయ్, నిర్మాత ఫైవ్‌స్టార్ కదిరేశన్, పలువురు సీనీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
మేనల్లుడు చిత్రానికి మేనమామ సంగీతం
ఒకరు ఆస్కార్ అవార్డు గ్రహీత, మరొకరు యువ క్రేజీ సంగీత దర్శకుడు, యువ కథానాయకుడిగా దూసుకెళుతున్న నటుడు కూడా. వీరి కలయికలో చిత్రం వస్తే అది ప్రత్యేకతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.అలాంటి చిత్రానికి త్వరలో శ్రీకారం జరగనుందన్నదే తాజా సమాచారం.అవును మేనల్లుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించనున్న చిత్రానికి ఆయన మేనమామ, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత భాణీ అందించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం.చాలా గ్యాప్ తరువాత రాజీవ్‌మీనన్ మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు.ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. జీవీ ప్రస్తుతం ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాన్ని పూర్తి చేసి కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాత రాజీవ్‌మీనన్ చిత్రంలో జీవీ నటించనున్నట్లు సమాచారం.