GVA
-
ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది...
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం * ఆరు త్రైమాసికాల కనిష్ట స్థాయి * మైనింగ్, నిర్మాణం, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు... * ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8 శాతం ఉంటుందని కేంద్రం భరోసా న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) మందగమనంలోకి జారిపోయింది. ఈ రేటు కేవలం 7.1 శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు గడచిన ఆరు త్రైమాసికాల్లో (2014-15 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 6.6 శాతం) ఇదే తొలిసారి. మైనింగ్, నిర్మాణం, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతంకాగా, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఈ వృద్ధి రేటు 7.9 శాతంగా ఉంది. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం. జీవీఏ 7.3 శాతం... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) బుధవారం విడుదల చేసిన బేసిక్ ధర ప్రాతిపదికన స్థూల విలువ జోడింపు (జీవీఏ) గణాంకాల ప్రకారం... మొదటి త్రైమాసికంలో వృద్ధి 7.3%గా ఉంది. మార్కెట్ ధర వద్ద జీడీపీ వృద్ధి రేటును లెక్కిం చి.. ఫ్యాక్టర్ కాస్ట్ ప్రాతిపదికన జీవీఏ లెక్కగడతారు. జీవీఏ ‘ప్లస్’ ఉత్పత్తులపై పన్నులు... ఈ విలువ నుంచి సబ్సిడీలను మైనస్ చేస్తే వచ్చేదే జీడీపీ. జీవీఏ ప్రకారం వివిధ రంగాల ఉత్పత్తి విలువలు మొదటి త్రైమాసికంలో ఇలా ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు: 1.8 శాతం వృద్ధితో మొత్తం విలువ రూ.3,74,390 కోట్లకు చేరింది. మైనింగ్, క్వారీయింగ్: అసలు వృద్ధిలేకపోగా -0.4% క్షీణించి రూ.86,444 కోట్ల నుంచి రూ.86,091 కోట్లకు పడింది. తయారీ: 9.1 శాతం వృద్ధితో రూ.4,90,164 కోట్లకు చేరింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: ఈ రంగంలో వృద్ధి రేటు 9.4% ఉంది. ఉత్పత్తి విలువ 62,378 కోట్లుగా నమోదయ్యింది. నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 1.5 శాతంగా నమోదయ్యింది. ఉత్పత్తి విలువ 2,29,092 కోట్లు. ట్రేడ్, హోటెల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్: వృద్ధి 8%గా ఉంది. విలువ రూ.5,22,610 కోట్లు. ఫైనాన్సింగ్, రియల్టీ, వ్యాపార సేవలు: 9.4 శాతం వృద్ధితో విలువ రూ.6,35,963 కోట్లకు ఎగసింది. పబ్లిక్ అడ్మిన్, రక్షణ, ఇతర సేవలు: 12.3 శాతం వృద్ధితో రూ.3,37,630 కోట్లకు చేరాయి. * మొత్తంగా 2015-16తో పోల్చి 2016-17లో అన్ని విభాగాల విలువ 7.3% వృద్ధితో 25,51,435 కోట్ల నుంచి 27,38,318 కోట్లకు చేరింది. అయితే జీవీఏ వృద్ధి గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 7.2% కావడం గమనార్హం. * ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు ప్రతిబింబమైన ప్రైవేటు వినియోగ వ్యయంలో వృద్ధి 11.7 శాతంగా నమోదయ్యింది. ఇక పెట్టుబడులకు ప్రతిబింబమైన గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆందోళనకరమైన రీతిలో 6.8 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. 8 శాతానికి చేరతాం: శక్తికాంత్ దాస్ ప్రస్తుత ఫలితం నిరాశాజనకంగా ఉన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 8 శాతం దాపుల్లోనే ఉంటుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. తగిన వర్షపాతం, వేతన కమిషన్ సిఫారసులు 8 శాతం దిశలో వృద్ధి నడకకు దారితీసే అంశాలుగా వివరించారు. అధిక సబ్సిడీ వ్యయాలే తాజా సమీక్షా త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు పడిపోవడానికి కారణమనీ ఆయన వివరించారు. సబ్సిడీల వ్యయం జీడీపీలో దాదాపు 0.3 శాతం ఉందని పేర్కొన్న ఆయన, ఇది కలుపుకుంటే జీడీపీ 7.4 శాతానికి ఎగసేదన్న విషయం గమనార్హమన్నారు. నికర ప్రత్యక్ష పన్నులూ తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే పెట్టుబడుల పరిస్థితిపై ఆందోళన ఉందని పేర్కొన్న ఆయన, దీనికి కారణాలను సమీక్షిస్తామని వివరించారు. జూలైలో మౌలిక రంగం వృద్ధి 3.2% న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జూలైలో 3.2 శాతంగా నమోదయ్యింది. 2015 జూలైలో ఈ రేటు 1.3 శాతం. రిఫైనరీ ఉత్పత్తుల భారీ వృద్ధి దీనికి కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాలనూ వేర్వేరుగా చూస్తే... రిఫైనరీ: వృద్ధి 2.9% నుంచి 13.7%కి ఎగసింది. బొగ్గు: -0.1% క్షీణత నుంచి 5.1 శాతం వృద్ధికి చేరింది. సహజ వాయువు: -4.4 శాతం క్షీణత నుంచి 3.3 శాతం వృద్ధికి మళ్లింది. సిమెంట్: వృద్ధిలో ఎటువంటి మార్పూ లేకుండా 1.4 శాతంగా ఉంది. ఎరువులు: వృద్ధి రేటు 8.6% నుంచి 2.5%కి పడిపోయింది. విద్యుత్: వృద్ధి 3.5 శాతం నుంచి 1.6 శాతానికి దిగింది. క్రూడ్ ఆయిల్: -0.4 శాతం నుంచి మరింతగా -1.8 క్షీణతలోకి పడిపోయింది. స్టీల్: -1.4 శాతం క్షీణత -0.5 శాతం క్షీణతకు చేరింది. లక్ష్యంలో 73% దాటిన ద్రవ్యలోటు న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయిన మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్-జూలై) బడ్జెట్ లక్ష్యంలో 73.3%కి పెరిగింది. విలువ రూపంలో ఈ మొత్తం రూ.3.93 లక్షల కోట్లు. 2016-17లో ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రేటు 3.5 శాతంగా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా గతేడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 69.3%గా ఉంది. -
అర్ధిక వృద్ధి..నిరాశ!
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతమే.. - అంచనాలను అందుకోని గణాంకాలు.. - సేవలు, వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు - ఆర్బీఐ వడ్డీరేట్ల కోత డిమాండ్లకు ఊతం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2015-16;ఏప్రిల్-జూన్; క్యూ1) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలైన.. సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2014-15 జనవరి-మార్చి) వృద్ధి రేటు 7.5 శాతం. చైనా వృద్ధి రేటును మించి ఇది నమోదుకావడం విశేషం. అదే ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం. ఆర్థిక క్రియాశీలతను లెక్కించడానికి కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) తాజాగా ప్రవేశపెట్టిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) రేటు గత ఏడాది ఇదే కాలంలో 7.4 శాతం కాగా ఇప్పుడు 7.1 శాతానికి పడింది. సీఎస్ఓ సోమవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది. నిరాశాజనకం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదవుతుందని కేంద్రం అంచనావేస్తోంది. ఆర్బీఐకి సంబంధించి ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. అయితే ప్రస్తుత గణాంకాలు, తాజా ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే- భవిష్యత్తులో భారీ స్థాయిలో వృద్ధి అసాధ్యంగానే కనిపిస్తోంది. పలువురు ఆర్థిక వేత్తల అంచనా 7.2 శాతం నుంచి 7.5 శాతం కాగా ఈ అంచనాలను సైతం తాజా గణాంకాలు అందుకోలేకపోయాయి. ప్రధాన రంగాలు పేలవం... - 2011-12 స్థిర ధరల ప్రకారం, క్యూ1 జీవీఏను చూస్తే- తయారీ రంగంలో వృద్ధి రేటు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. - అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 3.2 శాతానికి చేరింది. - వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6% నుంచి 1.9%కి దిగింది. - గనులు, తవ్వకాల రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. - ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల రంగాలకు సంబంధించి వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి జారింది. - అయితే నిర్మాణ రంగం క్రియాశీలత మాత్రం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. విలువ 27.13 లక్షల కోట్లు... తొలి త్రైమాసికంలో వివిధ రంగాల ఉత్పత్తి విలువ రూ.27.13 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఈ రేటు రూ.25.35 లక్షల కోట్లు. అంటే వృద్ధి 7 శాతం అన్నమాట. జీవీఏ ప్రాతిపదికన చూస్తే విలువ రూ.24.10 లక్షల కోట్ల నుంచి రూ.25.80 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఈ రేటు 7.1 శాతం. ప్రాథమిక ధరల వద్ద జీవీఏకు నికర సబ్సిడీలు, పన్నులు కలిపి, జీడీపీ గణాంకాలను లెక్కించడం జరుగుతుంది. కాగా పెట్టుబడులకు సంబంధించిన గ్రోస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) విలువ 2011-12 స్థిర ధరల వద్ద రూ.7.70 లక్షల కోట్ల నుంచి రూ.8.07 లక్షల కోట్లకు చేరింది. జూలైలో మౌలిక రంగం డీలా...వృద్ధి రేటు కేవలం 1.1 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల కీలక గ్రూప్ జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2014 జూలై వృద్ధి విలువతో పోల్చితే 2015 జూలైలో కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. 2014 జూలైలో ఈ గ్రూప్ వృద్ధి 4.1 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ దాదాపు 38 శాతం. గ్రూప్‌లో భాగమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణించడం మొత్తం గ్రూప్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఎనిమిది రంగాల ధోరణి వేర్వేరుగా... వృద్ధిలో 5: బొగ్గు ఉత్పాదకత వృద్ధి రేటు జూలైలో 0.3%. అయితే 2014 ఇదే నెలలో ఈ రేటు 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ప్రొడక్టుల రంగం మంచి పనితనం ప్రదర్శించింది. క్షీణతలోంచి (-5.2 శాతం) బయట పడి 2.9% వృద్ధిని నమోదుచేసుకుంది. ఎరువుల రంగం కూడా -4.2 శాతం క్షీణత నుంచి 8.6 శాతం వృద్ధికి మళ్లింది. సిమెంట్ రంగం వృద్ధి భారీగా 16.5% నుంచి 1.3 శాతానికి పడింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కూడా 11.8 శాతం నుంచి 3.5 శాతానికి పడింది. క్షీణతలో 3: క్రూడ్ ఆయిల్ ఉత్పాదకత -1.0 శాతం క్షీణత నుంచి మరింతగా -0.4 శాతం క్షీణతకు పడింది. సహజ వాయువు రంగం కూడా క్షీణతలోనే ఉంది. అయితే ఈ మైనస్ 8.9 శాతం నుంచి 4.4 శాతానికి మారింది.స్టీల్ ఉత్పాదకత 2.1 శాతం వృద్ధి రేటు నుంచి 2.6 శాతం క్షీణతలోకి జారింది. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు అటు జీడీపీ క్యూ1 గణాంకాలు, ఇటు పారిశ్రామిక రంగం మందగమన ధోరణికి ‘తక్కువ వడ్డీ రేటు’ రుణాలే మందని పరిశ్రమలు పేర్కొన్నాయి. తక్షణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా(ఆర్బీఐ) పాలసీ రేట్లను మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. తద్వారా అటు పెట్టుబడులు-ఇటు వినిమయం రెండింటికీ ఊపునివ్వాలని సూచించింది. ఇక ప్రభుత్వం సైతం సంస్కరణల అమలు దిశలో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేసింది. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందని భావిస్తున్నాం. ధరలు తక్కువగా ఉన్న పరిస్థితులు సైతం దీనికి అనుకూలిస్తాయి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరి పేర్కొన్నారు. సంస్కరణలు మందగమన ధోరణి ఆందోళన కలిగించే అంశం. క్షేత్ర స్థాయిలో సంస్కరణలు వాటి అమలుపై కేంద్రం దృష్టి సారించాలి. ఆయా అంశాలే ఆర్థిక మెరుగుదలకు దోహదపడతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు.