అర్ధిక వృద్ధి..నిరాశ! | GDP growth of 7 percent in the quarter | Sakshi
Sakshi News home page

అర్ధిక వృద్ధి..నిరాశ!

Published Tue, Sep 1 2015 3:12 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

అర్ధిక వృద్ధి..నిరాశ! - Sakshi

అర్ధిక వృద్ధి..నిరాశ!

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతమే..
- అంచనాలను అందుకోని గణాంకాలు..
- సేవలు, వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు
- ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత డిమాండ్‌లకు ఊతం
న్యూఢిల్లీ:
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2015-16;ఏప్రిల్-జూన్; క్యూ1) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక  కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలైన..  సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2014-15 జనవరి-మార్చి) వృద్ధి రేటు 7.5 శాతం.

చైనా వృద్ధి రేటును మించి ఇది నమోదుకావడం విశేషం. అదే ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం.  ఆర్థిక క్రియాశీలతను లెక్కించడానికి కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) తాజాగా ప్రవేశపెట్టిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) రేటు గత ఏడాది ఇదే కాలంలో 7.4 శాతం కాగా ఇప్పుడు 7.1 శాతానికి పడింది. సీఎస్‌ఓ సోమవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది.
 
నిరాశాజనకం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదవుతుందని కేంద్రం అంచనావేస్తోంది. ఆర్‌బీఐకి సంబంధించి ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. అయితే ప్రస్తుత గణాంకాలు, తాజా ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే- భవిష్యత్తులో భారీ స్థాయిలో వృద్ధి అసాధ్యంగానే కనిపిస్తోంది. పలువురు ఆర్థిక వేత్తల అంచనా 7.2 శాతం నుంచి 7.5 శాతం కాగా ఈ అంచనాలను సైతం తాజా గణాంకాలు అందుకోలేకపోయాయి.
 
ప్రధాన రంగాలు పేలవం...
- 2011-12 స్థిర ధరల ప్రకారం, క్యూ1 జీవీఏను చూస్తే- తయారీ రంగంలో వృద్ధి రేటు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది.
- అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 3.2 శాతానికి చేరింది.
- వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6% నుంచి 1.9%కి దిగింది.
- గనులు, తవ్వకాల రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది.
- ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల రంగాలకు సంబంధించి వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి జారింది.
- అయితే నిర్మాణ రంగం క్రియాశీలత మాత్రం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది.

విలువ 27.13 లక్షల కోట్లు...
తొలి త్రైమాసికంలో వివిధ రంగాల ఉత్పత్తి విలువ రూ.27.13 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఈ రేటు రూ.25.35 లక్షల కోట్లు. అంటే వృద్ధి 7 శాతం అన్నమాట. జీవీఏ ప్రాతిపదికన చూస్తే విలువ రూ.24.10 లక్షల కోట్ల నుంచి రూ.25.80 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఈ రేటు 7.1 శాతం. ప్రాథమిక ధరల వద్ద జీవీఏకు నికర సబ్సిడీలు, పన్నులు కలిపి, జీడీపీ గణాంకాలను లెక్కించడం జరుగుతుంది. కాగా పెట్టుబడులకు సంబంధించిన గ్రోస్ ఫిక్స్‌డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) విలువ 2011-12 స్థిర ధరల వద్ద రూ.7.70 లక్షల కోట్ల నుంచి రూ.8.07 లక్షల కోట్లకు చేరింది.
 
జూలైలో మౌలిక రంగం డీలా...వృద్ధి రేటు కేవలం 1.1 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల కీలక గ్రూప్ జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2014 జూలై వృద్ధి విలువతో పోల్చితే 2015 జూలైలో కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. 2014 జూలైలో ఈ గ్రూప్ వృద్ధి 4.1 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ దాదాపు 38 శాతం. గ్రూప్‌లో భాగమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణించడం మొత్తం గ్రూప్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.  వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం తాజాగా విడుదల చేసిన  గణాంకాల ప్రకారం- ఎనిమిది రంగాల ధోరణి వేర్వేరుగా...
 
వృద్ధిలో 5: బొగ్గు ఉత్పాదకత వృద్ధి రేటు జూలైలో 0.3%. అయితే 2014 ఇదే నెలలో ఈ రేటు 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ప్రొడక్టుల రంగం మంచి పనితనం ప్రదర్శించింది. క్షీణతలోంచి (-5.2 శాతం) బయట పడి 2.9% వృద్ధిని నమోదుచేసుకుంది. ఎరువుల రంగం కూడా -4.2 శాతం క్షీణత నుంచి 8.6 శాతం వృద్ధికి మళ్లింది. సిమెంట్ రంగం వృద్ధి భారీగా 16.5% నుంచి 1.3 శాతానికి పడింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కూడా 11.8 శాతం నుంచి 3.5 శాతానికి పడింది.
 
క్షీణతలో 3: క్రూడ్ ఆయిల్ ఉత్పాదకత -1.0 శాతం క్షీణత నుంచి మరింతగా -0.4 శాతం క్షీణతకు పడింది. సహజ వాయువు రంగం కూడా క్షీణతలోనే ఉంది. అయితే ఈ మైనస్ 8.9 శాతం నుంచి 4.4 శాతానికి మారింది.స్టీల్ ఉత్పాదకత 2.1 శాతం వృద్ధి రేటు నుంచి 2.6 శాతం క్షీణతలోకి జారింది.
 
వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు
అటు జీడీపీ క్యూ1 గణాంకాలు, ఇటు పారిశ్రామిక రంగం మందగమన ధోరణికి ‘తక్కువ వడ్డీ రేటు’ రుణాలే మందని పరిశ్రమలు పేర్కొన్నాయి. తక్షణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా(ఆర్‌బీఐ) పాలసీ రేట్లను మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. తద్వారా అటు పెట్టుబడులు-ఇటు వినిమయం రెండింటికీ ఊపునివ్వాలని సూచించింది. ఇక ప్రభుత్వం సైతం సంస్కరణల అమలు దిశలో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేసింది. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తుందని భావిస్తున్నాం. ధరలు తక్కువగా ఉన్న పరిస్థితులు సైతం దీనికి అనుకూలిస్తాయి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరి పేర్కొన్నారు. సంస్కరణలు మందగమన ధోరణి ఆందోళన కలిగించే అంశం. క్షేత్ర స్థాయిలో సంస్కరణలు వాటి అమలుపై కేంద్రం దృష్టి సారించాలి. ఆయా అంశాలే ఆర్థిక మెరుగుదలకు దోహదపడతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement