RBI interest rates
-
కీలక వడ్డీరేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్‌బ్యాంక్ వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (ఆర్బీఐ మానిటరీ పాలసీ) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలోని ముఖ్యాంశాలు.. బెంచ్‌మార్క్ వడ్డీరేటు, రెపోరేటు స్థిరంగా 6.5శాతంగా ఉంది. 2024-25 ఏడాదికిగాను జీడీపీ వృద్ధి 7 శాతం నమోదుకానుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉంటుందని అంచనా. 2023-24కుగాను భారత్‌కు వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు 625 బిలియన్డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2014-15 తర్వాత వచ్చిన రెండో అత్యధిక పెట్టుబడులుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్‌పై ట్రేడింగ్ కోసం ఆర్బీఐ త్వరలో స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. కీలక రేట్లు ఇలా.. రెపోరేటు: 6.5 శాతం ఎస్డీఎఫ్ రేటు: 6.25 శాతం ఎంఎస్ఎఫ్ రేటు: 6.75 శాతం బ్యాంక్ రేటు: 6.75 శాతం -
రుణ సంస్థను మారుస్తున్నారా..?
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించింది. దీంతో చాలా బ్యాంకులు వాటి బేస్ రేట్లను కూడా తగ్గించుకున్నాయి. కానీ కొన్ని బ్యాంకుల బేస్ రేట్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. దీంతో చాలామంది తక్కువ వడ్డీరేట్లున్న బ్యాంకుల్లోకి తమ గృహరుణాలను మార్చుకోవాలని చూస్తు న్నారు. కానీ ఇలా మార్చుకునేటప్పుడు కేవలం వడ్డీరేట్లను మాత్రమే చూడకుండా మిగిలిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి రుణాన్ని మార్చుకునేటప్పుడు గమనించాల్సిన అంశాలేమిటో చూద్దాం... వడ్డీరేట్లే కాదు... చాలా చూడాలి తగ్గించమని అడగండి.. ఒక బ్యాంకు నుంచి రుణాన్ని మరో బ్యాంకుకి మార్చుకోవడం అనేది అంత సులభం కాదు. ఇందులో కూడా తిరిగి కొత్త రుణం తీసుకున్నంత పనే ఉంటుంది. కొత్త బ్యాంకు మీ క్రెడిట్ హిస్టరీని పరిశీలించడం, ఇంటి కాగితాలను న్యాయపరంగా పరిశీలించడం, ఇంటి విలువను మదించడం, అన్ని అనుమతులూ ఉన్నాయా? లేదా? వంటి అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకనే మరో బ్యాంకుకు మారేకంటే ప్రస్తుత బ్యాంకులోనే వడ్డీరేటును తగ్గించమని అడగండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బ్యాంకులు మంచి ఖాతాదారులను వదులుకోవడానికి సిద్ధపడవు. మీ లాంటి మంచి ఖాతాదారులను నిలుపుకోవడానికి వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉంది. పోల్చి చూసుకోండి.. రుణాన్ని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి మార్చుకునేటప్పుడు వడ్డీరేటు, రుణం ఇంకా ఎంత కాలం చెల్లించాల్సి ఉంది అన్న విషయాలను తప్పక పోల్చి చూసుకోవాలి. మిగిలిన కాలానికి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది, రుణం మార్చుకున్న తర్వాత ఎంత వడ్డీ కడతాం? వంటి అంశాలను చూడండి. ఈ మధ్యనే రుణాన్ని తీసుకున్న వారు తక్కువ వడ్డీరేటులోకి మారడం వల్ల కొంత ఉపయోగం కనపడుతుంది. అదే రుణ చెల్లింపులు చివరి దశలో ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ పరిశీలించుకోండి.. కొత్త బ్యాంకుకి రుణం మార్చుకునే ముందు మీ క్రెడిట్ హిస్టరీ ఏవిధంగా ఉందో పరిశీలించి చూసుకోండి. క్రెడిట్ హిస్టరీ బాగుండకపోతే కొత్త బ్యాంకు మీ రుణ మార్పిడిని తిరస్కరిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత క్రెడిట్ స్కోరును సులభంగా తెలుసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణ మార్పిడికి దాఖలు చేసుకోండి. ఇతర వ్యయాలు.. రుణం మార్చుకునేటప్పుడు కొత్త బ్యాంకులో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజు, స్థిరాస్తి కాగితాలను భద్రపర్చడానికి తీసుకునే రుసుములు, స్టాంప్ డ్యూటీ, బీమా వంటి అన్ని వ్యయాలను లెక్కలోకి తీసుకోండి. మారడం వల్ల కలిగే వడ్డీ ప్రయోజనం కంటే ఈ వ్యయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించండి. రుణం మార్చుకునేటప్పుడే ఈ లెక్కలన్నీ చూసుకుంటే మీకు చాలా సమయం కలిసొస్తుంది. అంతేకాదు ఈ మధ్య రుణం తీసుకున్న రెండేళ్లలోపే వేరే బ్యాంకుకి మారితే ప్రీ పేమెంట్ పెనాల్టీలను విధించడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనుమతిస్తోంది. ప్రీపేమెంట్ పెనాల్టీ ఉందా లేదా అన్న విషయం అడిగి తెలుసుకోవడం మర్చిపోవద్దు. - హర్షలా చందోర్కర్ సీవోవో, సిబిల్ -
అర్ధిక వృద్ధి..నిరాశ!
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతమే.. - అంచనాలను అందుకోని గణాంకాలు.. - సేవలు, వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు - ఆర్బీఐ వడ్డీరేట్ల కోత డిమాండ్లకు ఊతం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2015-16;ఏప్రిల్-జూన్; క్యూ1) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలైన.. సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2014-15 జనవరి-మార్చి) వృద్ధి రేటు 7.5 శాతం. చైనా వృద్ధి రేటును మించి ఇది నమోదుకావడం విశేషం. అదే ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం. ఆర్థిక క్రియాశీలతను లెక్కించడానికి కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) తాజాగా ప్రవేశపెట్టిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) రేటు గత ఏడాది ఇదే కాలంలో 7.4 శాతం కాగా ఇప్పుడు 7.1 శాతానికి పడింది. సీఎస్ఓ సోమవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది. నిరాశాజనకం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదవుతుందని కేంద్రం అంచనావేస్తోంది. ఆర్బీఐకి సంబంధించి ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. అయితే ప్రస్తుత గణాంకాలు, తాజా ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే- భవిష్యత్తులో భారీ స్థాయిలో వృద్ధి అసాధ్యంగానే కనిపిస్తోంది. పలువురు ఆర్థిక వేత్తల అంచనా 7.2 శాతం నుంచి 7.5 శాతం కాగా ఈ అంచనాలను సైతం తాజా గణాంకాలు అందుకోలేకపోయాయి. ప్రధాన రంగాలు పేలవం... - 2011-12 స్థిర ధరల ప్రకారం, క్యూ1 జీవీఏను చూస్తే- తయారీ రంగంలో వృద్ధి రేటు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. - అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 3.2 శాతానికి చేరింది. - వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6% నుంచి 1.9%కి దిగింది. - గనులు, తవ్వకాల రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. - ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల రంగాలకు సంబంధించి వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి జారింది. - అయితే నిర్మాణ రంగం క్రియాశీలత మాత్రం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. విలువ 27.13 లక్షల కోట్లు... తొలి త్రైమాసికంలో వివిధ రంగాల ఉత్పత్తి విలువ రూ.27.13 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఈ రేటు రూ.25.35 లక్షల కోట్లు. అంటే వృద్ధి 7 శాతం అన్నమాట. జీవీఏ ప్రాతిపదికన చూస్తే విలువ రూ.24.10 లక్షల కోట్ల నుంచి రూ.25.80 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఈ రేటు 7.1 శాతం. ప్రాథమిక ధరల వద్ద జీవీఏకు నికర సబ్సిడీలు, పన్నులు కలిపి, జీడీపీ గణాంకాలను లెక్కించడం జరుగుతుంది. కాగా పెట్టుబడులకు సంబంధించిన గ్రోస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) విలువ 2011-12 స్థిర ధరల వద్ద రూ.7.70 లక్షల కోట్ల నుంచి రూ.8.07 లక్షల కోట్లకు చేరింది. జూలైలో మౌలిక రంగం డీలా...వృద్ధి రేటు కేవలం 1.1 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల కీలక గ్రూప్ జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2014 జూలై వృద్ధి విలువతో పోల్చితే 2015 జూలైలో కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. 2014 జూలైలో ఈ గ్రూప్ వృద్ధి 4.1 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ దాదాపు 38 శాతం. గ్రూప్‌లో భాగమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణించడం మొత్తం గ్రూప్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం- ఎనిమిది రంగాల ధోరణి వేర్వేరుగా... వృద్ధిలో 5: బొగ్గు ఉత్పాదకత వృద్ధి రేటు జూలైలో 0.3%. అయితే 2014 ఇదే నెలలో ఈ రేటు 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ప్రొడక్టుల రంగం మంచి పనితనం ప్రదర్శించింది. క్షీణతలోంచి (-5.2 శాతం) బయట పడి 2.9% వృద్ధిని నమోదుచేసుకుంది. ఎరువుల రంగం కూడా -4.2 శాతం క్షీణత నుంచి 8.6 శాతం వృద్ధికి మళ్లింది. సిమెంట్ రంగం వృద్ధి భారీగా 16.5% నుంచి 1.3 శాతానికి పడింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కూడా 11.8 శాతం నుంచి 3.5 శాతానికి పడింది. క్షీణతలో 3: క్రూడ్ ఆయిల్ ఉత్పాదకత -1.0 శాతం క్షీణత నుంచి మరింతగా -0.4 శాతం క్షీణతకు పడింది. సహజ వాయువు రంగం కూడా క్షీణతలోనే ఉంది. అయితే ఈ మైనస్ 8.9 శాతం నుంచి 4.4 శాతానికి మారింది.స్టీల్ ఉత్పాదకత 2.1 శాతం వృద్ధి రేటు నుంచి 2.6 శాతం క్షీణతలోకి జారింది. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు అటు జీడీపీ క్యూ1 గణాంకాలు, ఇటు పారిశ్రామిక రంగం మందగమన ధోరణికి ‘తక్కువ వడ్డీ రేటు’ రుణాలే మందని పరిశ్రమలు పేర్కొన్నాయి. తక్షణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా(ఆర్బీఐ) పాలసీ రేట్లను మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. తద్వారా అటు పెట్టుబడులు-ఇటు వినిమయం రెండింటికీ ఊపునివ్వాలని సూచించింది. ఇక ప్రభుత్వం సైతం సంస్కరణల అమలు దిశలో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేసింది. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందని భావిస్తున్నాం. ధరలు తక్కువగా ఉన్న పరిస్థితులు సైతం దీనికి అనుకూలిస్తాయి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరి పేర్కొన్నారు. సంస్కరణలు మందగమన ధోరణి ఆందోళన కలిగించే అంశం. క్షేత్ర స్థాయిలో సంస్కరణలు వాటి అమలుపై కేంద్రం దృష్టి సారించాలి. ఆయా అంశాలే ఆర్థిక మెరుగుదలకు దోహదపడతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. -
మరో ఏడాదిన్నర బుల్ జోరే!
‘సాక్షి’ ఇంటర్వ్యూ : డీఎస్పీ బ్లాక్‌రాక్ ఫండ్ మేనేజర్ అపూర్వ షా * వరుస సానుకూల వార్తలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి * గతేడాదిలాగానే లాభాలను ఇవ్వొచ్చు * అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఆ ప్రభావం పెద్దగా ఉండదు... * బడ్జెట్ తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్ల కోత * ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్‌పై బుల్లిష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వైపుల నుంచి వస్తున్న సానుకూల అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని, వచ్చే ఏడాదిన్నర వరకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు డీఎస్పీ బ్లాక్ రాక్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ అపూర్వ షా. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినా ఇండియాకొచ్చే ఎఫ్ఐఐ నిధుల ప్రవాహంపై పెద్దగా ప్రభావం చూపదంటున్న ‘షా’తో ఇంటర్వ్యూ విశేషాలు.. గతేడాది కాలంగా ఎటువంటి చెప్పుకోదగ్గ పతనం లేకుండానే మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఒకదాని తర్వాత ఒకటి సానుకూల వార్తలు, సంఘటనలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి. రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూపాయి బలపడటం, యూపీఏ ప్రభుత్వం చివర్లో సంస్కరణలు, మోదీ నేతృత్వలో స్థిరమైన ప్రభుత్వం, ముడి చమురు, బంగారం ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణం... ఇలా అన్నీ ఒకదాని వెనుక ఒకటిగా సానుకూల వార్తలు వెలువడుతుండటంతో లాభాల స్వీకరణకు అవకాశం లేకుండా మార్కెట్ పెరుగుతోంది. వచ్చేది రెండో ఆర్థిక సంస్కరణల బడ్జెట్ అన్న వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచుతున్నాయి. రానున్న కాలంలో ఇదే విధమైన సానుకూల వార్తలు వస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే రికవరీ బాట పట్టడంతో మరో ఏడాదిన్నర పాటు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయి. గతేడాది కాలంలో ఇండెక్స్‌లు సుమారు 40 శాతం రాబడిని అందించాయి. వచ్చే ఏడాదిన్నర కూడా ఇదే విధమైన రాబడిని అంచనా వేస్తున్నారా? ఎంత రాబడిని అందిస్తాయని చెప్పలేము. ఇండెక్స్‌ల పెరుగుదల అనేది కంపెనీలు ఆర్జించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రోత్సాహకరమైన విధానాలు ప్రవేశపెడితే వచ్చే ఏడాది కూడా ఇండెక్స్‌లు ఇదే స్థాయిలో లాభాలు అందించవచ్చు. వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ ఏ స్థాయికి చేరవచ్చు? మా పాలసీ ప్రకారం ఇండెక్స్ లక్ష్యాలను చెప్పలేము. కానీ బంగారం, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ ఇన్కమ్ వంటి ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక రాబడిని ఇస్తాయని చెప్పొచ్చు. ఇప్పటికే బంగారం ధరలు తగ్గడంతో దేశీయ నగదు ఈక్విటీల్లోకి వస్తోంది. వడ్డీరేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు కూడా మంచి రాబడిని అందించే అవకాశం ఉన్నా అది ఈక్విటీల కంటే తక్కువగా ఉంటుంది. ఇండెక్స్‌లు ఏటా 20% పెరిగితే ఇప్పుడు కొంతమంది మార్కెట్ నిపుణులు పేర్కొంటున్న లక్ష్యాలను(రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2030కి నిఫ్టీ 1,25,000పాయింట్ల చేరుతుందని చెప్పారు) చేరుకోవడం పెద్ద కష్టం కాదు. దీర్ఘకాలంలో చూస్తే దేశీ స్టాక్ మార్కెట్స్ 20% రాబడిని అందించాయి. ఇప్పుడు ఇండెక్స్‌లు ఎంత లాభాలు అందిస్తాయని చెప్పలేము కానీ, ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక లాభాలను అందిస్తాయని చెప్పగలను. ప్రస్తుతం దేశీ మార్కెట్స్ ఎదుర్కొనే అతిపెద్ద రిస్క్? దేశీయంగా అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రవాదం, దేశాల మధ్య యుద్ధాలు ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఎదుర్కొంటుందన్నదే ప్రధానమైన రిస్క్‌గా చెప్పొచ్చు. దేశీయంగా చూస్తే అధికారంలో ఉన్న మోదీ నాయకత్వానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే అయినా... మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదన్న సంకేతాన్ని ఇస్తోంది కదా? ప్రస్తుతం చమురు ధరలు తగ్గడాన్ని ఆ విధంగా చూడలేము. ఇంతకాలం కొంతమంది కూటమిగా ఏర్పడి చమురు ధరలను పెంచుతున్నారు. ఇప్పడు ఆ కూటమికి దెబ్బపడింది. రష్యాని దెబ్బతీయడంతో పాటు షెల్ గ్యాస్ కంపెనీలను దెబ్బతీయాలన్న ఉద్దేశంలో ఒపెక్ దేశాలు ఉన్నాయి. షెల్ గ్యాస్ కంపెనీల బ్యాలెన్స్ షీట్ బలహీనంగా ఉండటం, అత్యధిక వ్యయంతో కూడిన ఈ ఉత్పత్తిని ధరలు తగ్గించడం ద్వారా ఆపించాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు 40 శాతం తగ్గాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చింది. రానున్న ఏడాది కాలంలో వడ్డీరేట్ల కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుతాయని ఇప్పటికే ఆర్బీఐ చెప్పింది. బడ్జెట్ తర్వాత కోత మొదలు కావచ్చు. ఒకసారి రేట్ల కోత మొదలైన తర్వాత అది నిరంతరాయంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. అమెరికా వడ్డీరేట్లు పెంచితే దేశీయ మార్కెట్స్పై ముఖ్యంగా ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంపై ప్రభావం ఏవిధంగా ఉండొచ్చు? అమెరికా వడ్డీరేట్లు పెంచినా అది మన మార్కెట్లపై అంత ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చు. యూరప్, జపాన్ నుంచి వచ్చే నిధులు ఆదుకునే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయిలోనే ఒడిదుడుకులు తక్కువే. ఇది ఇండియా మార్కెట్‌పై బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది. అమెరికాలో తక్షణం వడ్డీరేట్లు పెంచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఏ సెక్టార్స్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు? ఒక సెక్టార్ బాగున్నా.. అందులోని అన్ని కంపెనీల షేర్లు బాగుంటాయని కాదు. అందుకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీల ఫండమెంటల్స్‌ను చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో మొబైల్ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నాం. అలాగే ఇప్పటికే బాగా పెరిగిన ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పై వాటితో పోలిస్తే ఈ రెండు రంగాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. -
పన్ను తగ్గాలా?
మార్చి నెల వచ్చేసింది. ఆదాయపు పన్ను కోతల నుంచి తప్పించుకోవాలన్నా... ఒకవేళ ఇప్పటికే కోత పడి ఉంటే రిఫండ్ రూపంలోనైనా వెనక్కి తీసుకోవాలన్నా... తగినంత మొత్తాన్ని ఈ నెల్లో పొదుపు చేయాల్సిందే. ఎంపిక చేసిన పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. పన్ను భారం తగ్గించుకోవడానికి చట్టం అనేక మార్గాలను సూచించింది. అందరికీ బాగా పరిచయం ఉన్న సెక్షన్ 80సీనే కాకుండా ఇంకా అనేక సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... సెక్షన్ 80సీతో పాటు పలు సెక్షన్లు పన్ను భారం తగ్గించుకునేలా చేస్తాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సాధ్యమైనంత వరకు ఆదాయపు పన్నుకు దూరంగా ఉండొచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఇప్పుడు చూద్దాం.. సెక్షన్ 24బి రుణం తీసుకొని నిర్మించిన ఇంటికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా) చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80డీ/ 80డీడీ / 80డీడీబీ రోజువారి దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు లేదా చికిత్సకు అయ్యే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి ఆదాయపు పన్ను చట్టంలో అనేక సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మూడు సెక్షన్లు 80డీ, 80డీడీ, 80డీడీబీ ముఖ్యమైనవి. 80డీ: హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80డీ ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. గరిష్టంగా రూ.15,000 వరకు సీనియర్ సిటిజన్స్ అయితే రూ.20,000 వరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్‌కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్య పరీక్షలకూ ఇది వర్తిస్తుంది. 80డీడీబీ: కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు ఆదాయంలోంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్లో వివరంగా ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-ఎంబర్స్మెంట్ పొందితే మాత్రం ఈ ప్రయోజనం లభించదు. 80యూ: అసెస్సీకి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందచ్చు. అంగవైకల్యం తీవ్రతను బట్టి పొందే మినహాయింపు ఆధారపడి ఉంటుంది. ఇందుకు డాక్టర్ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించుకోవచ్చు. 80డీడీ: వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు) సెక్షన్ 80డీడీ కింద పన్ను ప్రయోజనాలు పొందచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. ఎల్ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80జీ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అంటే ఈ మేరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవడం ద్వారా పన్ను భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. అన్ని విరాళాలకు ఈ మినహాయింపులు లభించవు. ఇందుకు సంబంధించి సెక్షన్ 80జీలో అనేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తాయి. జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్య మంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ, జిల్లా సాక్షరతా మిషన్, కేంద్ర స్పోర్ట్స్ ఫండ్, కేంద్ర సాంస్కృతిక ఫండ్, నేషనల్ టెక్నాలజీ ఫండ్లకు ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సహాయక నిధి, జాతీయ చిల్డ్రన్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వంటి వాటికిచ్చే విరాళాలపై 50 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అలాగే నగదు రూపంలో ఇచ్చే విరాళాలు, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి. సెక్షన్ 54ఈసీ ఈ మధ్య కాలంలో బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కాని ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఈ లాభాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ మూడేళ్ళ లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. కాని ఈ బాండ్స్ అందించే వడ్డీని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టకుండా ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గరిష్టంగా 20 శాతం పన్ను భారం తగ్గుతుంది. సెక్షన్ 80జీజీ హెచ్ఆర్ఏ లేకపోయినా చెల్లించే ఇంటద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్ఆర్ఏ సౌలభ్యం లేని వృత్తినిపుణులు, వ్యాపారస్తులు వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతం లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 వరకు ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. కాని ఈ ప్రయోజనం పొందాలంటే నివసిస్తున్న ఊరిలో మీ పేరు మీద లేక భార్య పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలను పొంది ఉండకూడదు. ఈ సెక్షన్ ఉపయోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.7,400 వరకు పన్ను భారం తగ్గుతుంది. సెక్షన్ 80సీసీజీ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం సెక్షన్ 80ఈ చదువుల కోసం చేసే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి రెండు రకాల సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి సెక్షన్ 80సీ కాగా రెండోది సెక్షన్ 80ఈ. పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజులపై సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలా కాకుండా అసెస్సీనే ఉన్నత చదువు కోసం రుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వడ్డీ మినహాయింపులపై ఎటువంటి పరిమితులు లేవు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ మినహాయింపు కేవలం వడ్డీ చెల్లింపులపైన మాత్రమే. అసలుకు చెల్లించే వాటిపైన ఎటువంటి మినహాయింపులుండవు. అలాగే గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపులు లభించవు. భార్య లేదా భర్త, పిల్లలు లేదా సొంతంగా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలన్నింటిపైనా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 80సీ... పన్ను భారం తగ్గించుకోవడం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని పొదు పులు, చెల్లింపుల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి అనేక సాధనాలు వచ్చినా గరిష్టంగా లక్ష రూపాయలు మించి ప్రయోజనం పొందలేరు. ఇప్పుడు ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే వాటిని ఒకసారి చూద్దాం... పొదుపు పథకాలు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), బ్యాంకులో ఐదేళ్లకు చేసిన ఫిక్స్డ్ డపాజట్లు, జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, బీమా, యులిప్, పెన్షన్ పథకాలు ముఖ్యమైనవి. చెల్లింపులు: గృహ రుణం ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించే వాటా, ఇంటి రిజిస్ట్రేషన్‌కి చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఆన్లైన్లో పునరుద్ధరణ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆన్లైన్లో పాలసీల పునరుద్ధరణ సదుపాయాన్ని కల్పించింది. మధ్యలో ప్రీమియంలు చెల్లించకుండా రద్దయిన పాలసీలను ఆన్లైన్లో ప్రీమియం చెల్లించడం, ఆరోగ్య ధృవీకరణ పత్రం ఇవ్వడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. టాటా ఏఐఏ టర్మ్ పాలసీ ‘మహా రక్ష సుప్రీం’ పేరుతో టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీవితంలో బాధ్యతలు పెరుగుతున్న కొద్ది బీమా రక్షణ మొత్తం పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కనీస బీమా రక్షణ రూ.50 లక్షలుగా, కాలపరిమితి 10-40 ఏళ్లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపు ఉంది. బిర్లా సన్‌లైఫ్ ఆర్జీఈఎస్ఎస్ బిర్లాసన్లైఫ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2’ను ప్రవేశపెట్టిం ది. కేవలం బీఎస్ఈ 100 ఇండెక్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఈ పథకం మూడేళ్ల లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటుంది. ఇది రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం పరిధిలో ఉండటంతో మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా రంగంలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. అమెరికాకు చెందిన సిగ్నా, ఇండియాకు చెందిన టీటీకే సంయుక్తంగా సిగ్నా టీటీకే హెల్త్ న్సూరెన్స్ పేరిట వైద్య బీమా సేవలను ప్రారంభించాయి. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు తగిన విధంగా సరికొత్త వైద్య బీమా పథకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎల్ఐసీ రాజీవ్‌గాంధీ స్కీం ఎల్ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీంను ప్రారంభించింది. సెక్షన్ 80సీసీజీ కింద ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే తొలి ఈక్విటీ పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పథకం మార్చి 14తో ముగుస్తుంది. మూడేళ్ల లాకిన్ పిరియడ్ ఉన్న ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.5,000. మోర్గాన్‌స్టాన్లీ డివిడెండ్లు మోర్గాన్‌స్టాన్లీ రెండు ఈక్విటీ పథకాలపై డివిడెండ్‌ను ప్రకటించింది. ఏస్ ఫండ్‌పై 10 శాతం, గ్రోత్ ఫండ్‌పై 15 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్లకు రికార్డు తేది మార్చి 4గా నిర్ణయించారు. మార్చి4న నాటికి కలిగి ఉన్న ప్రతీ ఏస్ ఫండ్ యూనిట్‌పై రూ.1, అదే గ్రోత్ ఫండ్‌పై రూ.1.50 డివిడెండ్ లభిస్తుంది.