పన్ను తగ్గాలా? | Interest rates may remain firm | Sakshi
Sakshi News home page

పన్ను తగ్గాలా?

Published Sun, Mar 2 2014 2:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

పన్ను తగ్గాలా? - Sakshi

పన్ను తగ్గాలా?

మార్చి నెల వచ్చేసింది. ఆదాయపు పన్ను కోతల నుంచి తప్పించుకోవాలన్నా... ఒకవేళ ఇప్పటికే కోత పడి ఉంటే రిఫండ్ రూపంలోనైనా వెనక్కి తీసుకోవాలన్నా... తగినంత మొత్తాన్ని ఈ నెల్లో పొదుపు చేయాల్సిందే. ఎంపిక చేసిన పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. పన్ను భారం తగ్గించుకోవడానికి చట్టం అనేక మార్గాలను సూచించింది. అందరికీ బాగా పరిచయం ఉన్న సెక్షన్ 80సీనే కాకుండా ఇంకా అనేక సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
  సెక్షన్ 80సీతో పాటు పలు సెక్షన్‌లు పన్ను భారం తగ్గించుకునేలా చేస్తాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సాధ్యమైనంత వరకు ఆదాయపు పన్నుకు దూరంగా ఉండొచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన సెక్షన్‌లు ఇప్పుడు చూద్దాం..

 సెక్షన్ 24బి
 రుణం తీసుకొని నిర్మించిన ఇంటికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో  అసలుకు (అంటే వడ్డీ కాకుండా) చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

 సెక్షన్ 80డీ/ 80డీడీ / 80డీడీబీ
 రోజువారి దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు లేదా చికిత్సకు అయ్యే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి ఆదాయపు పన్ను చట్టంలో అనేక సెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో  ప్రధానంగా మూడు సెక్షన్‌లు 80డీ, 80డీడీ, 80డీడీబీ ముఖ్యమైనవి.
 80డీ: హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80డీ ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. గరిష్టంగా రూ.15,000 వరకు  సీనియర్ సిటిజన్స్ అయితే రూ.20,000 వరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు.

అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్‌కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్య పరీక్షలకూ ఇది వర్తిస్తుంది.

 80డీడీబీ: కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు ఆదాయంలోంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్‌లో వివరంగా ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-ఎంబర్స్‌మెంట్ పొందితే మాత్రం ఈ ప్రయోజనం లభించదు.

 80యూ: అసెస్సీకి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందచ్చు. అంగవైకల్యం తీవ్రతను బట్టి పొందే మినహాయింపు ఆధారపడి ఉంటుంది. ఇందుకు డాక్టర్ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించుకోవచ్చు.


 80డీడీ: వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు) సెక్షన్ 80డీడీ కింద పన్ను ప్రయోజనాలు పొందచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి.

 సెక్షన్ 80జీ
 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అంటే ఈ మేరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవడం ద్వారా పన్ను భారం నుంచి ఉపశమనం పొందవచ్చు.  అన్ని విరాళాలకు ఈ మినహాయింపులు లభించవు. ఇందుకు సంబంధించి సెక్షన్ 80జీలో అనేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తాయి.

జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్య మంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ, జిల్లా సాక్షరతా మిషన్, కేంద్ర స్పోర్ట్స్ ఫండ్, కేంద్ర సాంస్కృతిక ఫండ్, నేషనల్ టెక్నాలజీ ఫండ్‌లకు ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సహాయక నిధి, జాతీయ చిల్డ్రన్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వంటి వాటికిచ్చే విరాళాలపై 50 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అలాగే నగదు రూపంలో ఇచ్చే విరాళాలు, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి.

 సెక్షన్ 54ఈసీ
 ఈ మధ్య కాలంలో బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కాని ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఈ లాభాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ మూడేళ్ళ లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. కాని ఈ బాండ్స్ అందించే వడ్డీని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టకుండా ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గరిష్టంగా 20 శాతం పన్ను భారం తగ్గుతుంది.

 సెక్షన్ 80జీజీ
 హెచ్‌ఆర్‌ఏ లేకపోయినా చెల్లించే ఇంటద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సౌలభ్యం లేని వృత్తినిపుణులు, వ్యాపారస్తులు వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతం లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 వరకు ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. కాని ఈ ప్రయోజనం పొందాలంటే నివసిస్తున్న ఊరిలో మీ పేరు మీద లేక భార్య పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలను పొంది ఉండకూడదు. ఈ సెక్షన్ ఉపయోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.7,400 వరకు పన్ను భారం తగ్గుతుంది.

 సెక్షన్ 80సీసీజీ
 రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద  గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో  సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు.  - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 సెక్షన్ 80ఈ
  చదువుల కోసం చేసే వ్యయాలపై పన్ను ప్రయోజనాలను పొందడానికి రెండు రకాల సెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి సెక్షన్ 80సీ కాగా రెండోది సెక్షన్ 80ఈ. పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజులపై సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలా కాకుండా అసెస్సీనే ఉన్నత చదువు కోసం రుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ  ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఈ వడ్డీ మినహాయింపులపై ఎటువంటి పరిమితులు లేవు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ మినహాయింపు కేవలం వడ్డీ చెల్లింపులపైన మాత్రమే. అసలుకు చెల్లించే వాటిపైన ఎటువంటి మినహాయింపులుండవు. అలాగే గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపులు లభించవు. భార్య లేదా భర్త, పిల్లలు లేదా సొంతంగా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలన్నింటిపైనా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
 
 సెక్షన్ 80సీ...
  పన్ను భారం తగ్గించుకోవడం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని పొదు పులు, చెల్లింపుల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి అనేక సాధనాలు వచ్చినా గరిష్టంగా లక్ష రూపాయలు మించి ప్రయోజనం పొందలేరు.

ఇప్పుడు ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే వాటిని ఒకసారి చూద్దాం...
 పొదుపు పథకాలు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), బ్యాంకులో ఐదేళ్లకు చేసిన ఫిక్స్‌డ్ డపాజట్లు, జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, బీమా, యులిప్, పెన్షన్ పథకాలు ముఖ్యమైనవి.

 చెల్లింపులు: గృహ రుణం ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించే వాటా, ఇంటి రిజిస్ట్రేషన్‌కి చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, వంటివి ఈ కోవలోకి వస్తాయి.
 
  ఆన్‌లైన్‌లో పునరుద్ధరణ
 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆన్‌లైన్‌లో పాలసీల పునరుద్ధరణ సదుపాయాన్ని కల్పించింది. మధ్యలో ప్రీమియంలు చెల్లించకుండా రద్దయిన పాలసీలను ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించడం, ఆరోగ్య ధృవీకరణ పత్రం ఇవ్వడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు.
 
  టాటా ఏఐఏ టర్మ్ పాలసీ
 ‘మహా రక్ష సుప్రీం’ పేరుతో టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీవితంలో బాధ్యతలు పెరుగుతున్న కొద్ది బీమా రక్షణ మొత్తం పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కనీస బీమా రక్షణ రూ.50 లక్షలుగా, కాలపరిమితి 10-40 ఏళ్లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపు ఉంది.
 
  బిర్లా సన్‌లైఫ్ ఆర్‌జీఈఎస్‌ఎస్
 బిర్లాసన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ  ‘ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2’ను ప్రవేశపెట్టిం ది. కేవలం బీఎస్‌ఈ 100 ఇండెక్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఈ పథకం మూడేళ్ల లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటుంది. ఇది రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం పరిధిలో ఉండటంతో మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను మినహాయింపులు లభిస్తాయి.
 
  సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్
 ఆరోగ్య బీమా రంగంలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. అమెరికాకు చెందిన సిగ్నా, ఇండియాకు చెందిన టీటీకే సంయుక్తంగా సిగ్నా టీటీకే హెల్త్ న్సూరెన్స్ పేరిట వైద్య బీమా సేవలను ప్రారంభించాయి. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు తగిన విధంగా సరికొత్త వైద్య బీమా పథకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 
  ఎల్‌ఐసీ రాజీవ్‌గాంధీ స్కీం
 ఎల్‌ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీంను ప్రారంభించింది. సెక్షన్ 80సీసీజీ కింద ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే తొలి ఈక్విటీ పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పథకం మార్చి 14తో ముగుస్తుంది. మూడేళ్ల లాకిన్ పిరియడ్ ఉన్న ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.5,000.
 
  మోర్గాన్‌స్టాన్లీ డివిడెండ్లు
 మోర్గాన్‌స్టాన్లీ రెండు ఈక్విటీ పథకాలపై డివిడెండ్‌ను ప్రకటించింది. ఏస్ ఫండ్‌పై 10 శాతం, గ్రోత్ ఫండ్‌పై 15 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్లకు రికార్డు తేది మార్చి 4గా నిర్ణయించారు. మార్చి4న నాటికి కలిగి ఉన్న ప్రతీ ఏస్ ఫండ్ యూనిట్‌పై రూ.1, అదే గ్రోత్ ఫండ్‌పై రూ.1.50 డివిడెండ్ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement