మరో ఏడాదిన్నర బుల్ జోరే!
‘సాక్షి’ ఇంటర్వ్యూ : డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఫండ్ మేనేజర్ అపూర్వ షా
* వరుస సానుకూల వార్తలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి
* గతేడాదిలాగానే లాభాలను ఇవ్వొచ్చు
* అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఆ ప్రభావం పెద్దగా ఉండదు...
* బడ్జెట్ తర్వాత ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత
* ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్‌పై బుల్లిష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వైపుల నుంచి వస్తున్న సానుకూల అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని, వచ్చే ఏడాదిన్నర వరకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు డీఎస్‌పీ బ్లాక్ రాక్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ అపూర్వ షా. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినా ఇండియాకొచ్చే ఎఫ్‌ఐఐ నిధుల ప్రవాహంపై పెద్దగా ప్రభావం చూపదంటున్న ‘షా’తో ఇంటర్వ్యూ విశేషాలు..
గతేడాది కాలంగా ఎటువంటి చెప్పుకోదగ్గ పతనం లేకుండానే మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది?
ఒకదాని తర్వాత ఒకటి సానుకూల వార్తలు, సంఘటనలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి. రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూపాయి బలపడటం, యూపీఏ ప్రభుత్వం చివర్లో సంస్కరణలు, మోదీ నేతృత్వలో స్థిరమైన ప్రభుత్వం, ముడి చమురు, బంగారం ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణం... ఇలా అన్నీ ఒకదాని వెనుక ఒకటిగా సానుకూల వార్తలు వెలువడుతుండటంతో లాభాల స్వీకరణకు అవకాశం లేకుండా మార్కెట్ పెరుగుతోంది. వచ్చేది రెండో ఆర్థిక సంస్కరణల బడ్జెట్ అన్న వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచుతున్నాయి. రానున్న కాలంలో ఇదే విధమైన సానుకూల వార్తలు వస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే రికవరీ బాట పట్టడంతో మరో ఏడాదిన్నర పాటు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయి.
గతేడాది కాలంలో ఇండెక్స్‌లు సుమారు 40 శాతం రాబడిని అందించాయి. వచ్చే ఏడాదిన్నర కూడా ఇదే విధమైన రాబడిని అంచనా వేస్తున్నారా?
ఎంత రాబడిని అందిస్తాయని చెప్పలేము. ఇండెక్స్‌ల పెరుగుదల అనేది కంపెనీలు ఆర్జించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రోత్సాహకరమైన విధానాలు ప్రవేశపెడితే వచ్చే ఏడాది కూడా ఇండెక్స్‌లు ఇదే స్థాయిలో లాభాలు అందించవచ్చు.
వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ ఏ స్థాయికి చేరవచ్చు?
మా పాలసీ ప్రకారం ఇండెక్స్ లక్ష్యాలను చెప్పలేము. కానీ బంగారం, రియల్ ఎస్టేట్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వంటి ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక రాబడిని ఇస్తాయని చెప్పొచ్చు. ఇప్పటికే బంగారం ధరలు తగ్గడంతో దేశీయ నగదు ఈక్విటీల్లోకి వస్తోంది. వడ్డీరేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలు కూడా మంచి రాబడిని అందించే అవకాశం ఉన్నా అది ఈక్విటీల కంటే తక్కువగా ఉంటుంది. ఇండెక్స్‌లు ఏటా 20% పెరిగితే ఇప్పుడు కొంతమంది మార్కెట్ నిపుణులు పేర్కొంటున్న లక్ష్యాలను(రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2030కి నిఫ్టీ 1,25,000పాయింట్ల చేరుతుందని చెప్పారు) చేరుకోవడం పెద్ద కష్టం కాదు. దీర్ఘకాలంలో చూస్తే దేశీ స్టాక్ మార్కెట్స్ 20% రాబడిని అందించాయి. ఇప్పుడు ఇండెక్స్‌లు ఎంత లాభాలు అందిస్తాయని చెప్పలేము కానీ, ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక లాభాలను అందిస్తాయని చెప్పగలను.
ప్రస్తుతం దేశీ మార్కెట్స్ ఎదుర్కొనే అతిపెద్ద రిస్క్?
దేశీయంగా అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రవాదం, దేశాల మధ్య యుద్ధాలు ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఎదుర్కొంటుందన్నదే ప్రధానమైన రిస్క్‌గా చెప్పొచ్చు. దేశీయంగా చూస్తే అధికారంలో ఉన్న మోదీ నాయకత్వానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించొచ్చు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే అయినా... మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదన్న సంకేతాన్ని ఇస్తోంది కదా?
ప్రస్తుతం చమురు ధరలు తగ్గడాన్ని ఆ విధంగా చూడలేము. ఇంతకాలం కొంతమంది కూటమిగా ఏర్పడి చమురు ధరలను పెంచుతున్నారు. ఇప్పడు ఆ కూటమికి దెబ్బపడింది. రష్యాని దెబ్బతీయడంతో పాటు షెల్ గ్యాస్ కంపెనీలను దెబ్బతీయాలన్న ఉద్దేశంలో ఒపెక్ దేశాలు ఉన్నాయి. షెల్ గ్యాస్ కంపెనీల బ్యాలెన్స్ షీట్ బలహీనంగా ఉండటం, అత్యధిక వ్యయంతో కూడిన ఈ ఉత్పత్తిని ధరలు తగ్గించడం ద్వారా ఆపించాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు 40 శాతం తగ్గాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చింది.
రానున్న ఏడాది కాలంలో వడ్డీరేట్ల కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు?
రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుతాయని ఇప్పటికే ఆర్‌బీఐ చెప్పింది. బడ్జెట్ తర్వాత కోత మొదలు కావచ్చు. ఒకసారి రేట్ల కోత మొదలైన తర్వాత అది నిరంతరాయంగా కొనసాగుతుందని భావిస్తున్నాం.
అమెరికా వడ్డీరేట్లు పెంచితే దేశీయ మార్కెట్స్‌పై ముఖ్యంగా ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహంపై ప్రభావం ఏవిధంగా ఉండొచ్చు?
అమెరికా వడ్డీరేట్లు పెంచినా అది మన మార్కెట్లపై అంత ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చు. యూరప్, జపాన్ నుంచి వచ్చే నిధులు ఆదుకునే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయిలోనే ఒడిదుడుకులు తక్కువే. ఇది ఇండియా మార్కెట్‌పై బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది. అమెరికాలో తక్షణం వడ్డీరేట్లు పెంచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత మార్కెట్లో ఏ సెక్టార్స్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు?
ఒక సెక్టార్ బాగున్నా.. అందులోని అన్ని కంపెనీల షేర్లు బాగుంటాయని కాదు. అందుకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీల ఫండమెంటల్స్‌ను చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో మొబైల్ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నాం. అలాగే ఇప్పటికే బాగా పెరిగిన ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పై వాటితో పోలిస్తే ఈ రెండు రంగాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది.