రుణ సంస్థను మారుస్తున్నారా..?
ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించింది. దీంతో చాలా బ్యాంకులు వాటి బేస్ రేట్లను కూడా తగ్గించుకున్నాయి. కానీ కొన్ని బ్యాంకుల బేస్ రేట్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. దీంతో చాలామంది తక్కువ వడ్డీరేట్లున్న బ్యాంకుల్లోకి తమ గృహరుణాలను మార్చుకోవాలని చూస్తు న్నారు. కానీ ఇలా మార్చుకునేటప్పుడు కేవలం వడ్డీరేట్లను మాత్రమే చూడకుండా మిగిలిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి రుణాన్ని మార్చుకునేటప్పుడు గమనించాల్సిన అంశాలేమిటో చూద్దాం...
వడ్డీరేట్లే కాదు... చాలా చూడాలి
తగ్గించమని అడగండి..
ఒక బ్యాంకు నుంచి రుణాన్ని మరో బ్యాంకుకి మార్చుకోవడం అనేది అంత సులభం కాదు. ఇందులో కూడా తిరిగి కొత్త రుణం తీసుకున్నంత పనే ఉంటుంది. కొత్త బ్యాంకు మీ క్రెడిట్ హిస్టరీని పరిశీలించడం, ఇంటి కాగితాలను న్యాయపరంగా పరిశీలించడం, ఇంటి విలువను మదించడం, అన్ని అనుమతులూ ఉన్నాయా? లేదా? వంటి అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది.
ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకనే మరో బ్యాంకుకు మారేకంటే ప్రస్తుత బ్యాంకులోనే వడ్డీరేటును తగ్గించమని అడగండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బ్యాంకులు మంచి ఖాతాదారులను వదులుకోవడానికి సిద్ధపడవు. మీ లాంటి మంచి ఖాతాదారులను నిలుపుకోవడానికి వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉంది.
పోల్చి చూసుకోండి..
రుణాన్ని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి మార్చుకునేటప్పుడు వడ్డీరేటు, రుణం ఇంకా ఎంత కాలం చెల్లించాల్సి ఉంది అన్న విషయాలను తప్పక పోల్చి చూసుకోవాలి. మిగిలిన కాలానికి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది, రుణం మార్చుకున్న తర్వాత ఎంత వడ్డీ కడతాం? వంటి అంశాలను చూడండి. ఈ మధ్యనే రుణాన్ని తీసుకున్న వారు తక్కువ వడ్డీరేటులోకి మారడం వల్ల కొంత ఉపయోగం కనపడుతుంది. అదే రుణ చెల్లింపులు చివరి దశలో ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
క్రెడిట్ స్కోర్ పరిశీలించుకోండి..
కొత్త బ్యాంకుకి రుణం మార్చుకునే ముందు మీ క్రెడిట్ హిస్టరీ ఏవిధంగా ఉందో పరిశీలించి చూసుకోండి. క్రెడిట్ హిస్టరీ బాగుండకపోతే కొత్త బ్యాంకు మీ రుణ మార్పిడిని తిరస్కరిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత క్రెడిట్ స్కోరును సులభంగా తెలుసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణ మార్పిడికి దాఖలు చేసుకోండి.
ఇతర వ్యయాలు..
రుణం మార్చుకునేటప్పుడు కొత్త బ్యాంకులో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజు, స్థిరాస్తి కాగితాలను భద్రపర్చడానికి తీసుకునే రుసుములు, స్టాంప్ డ్యూటీ, బీమా వంటి అన్ని వ్యయాలను లెక్కలోకి తీసుకోండి. మారడం వల్ల కలిగే వడ్డీ ప్రయోజనం కంటే ఈ వ్యయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించండి. రుణం మార్చుకునేటప్పుడే ఈ లెక్కలన్నీ చూసుకుంటే మీకు చాలా సమయం కలిసొస్తుంది. అంతేకాదు ఈ మధ్య రుణం తీసుకున్న రెండేళ్లలోపే వేరే బ్యాంకుకి మారితే ప్రీ పేమెంట్ పెనాల్టీలను విధించడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనుమతిస్తోంది. ప్రీపేమెంట్ పెనాల్టీ ఉందా లేదా అన్న విషయం అడిగి తెలుసుకోవడం మర్చిపోవద్దు.
- హర్షలా చందోర్కర్
సీవోవో, సిబిల్